ఏపీలో ఒక ఇష్యూ మీద ఇపుడు చర్చ అయితే సాగుతోంది. అదే ఏపీ అసెంబ్లీకి వైసీపీ రావడం మీద. ఈ విషయంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఒకటికి రెండు సార్లు మాట్లాడారు. అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామ క్రిష్ణంరాజు కూడా జగన్ రావాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఇప్పటికే రెండు సార్లు పిలిచారు. రాజంపేటలో లో ఈ నెల 1న పెన్షన్ల పంపిణీ తరువాత జరిగిన సభలో మాట్లాడుతూ అసెంబ్లీకి రావడానికి సిద్ధమేనా అని సవాల్ చేశారు. తాజాగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో మాట్లాడుతూ కూడా ఆయన మరోసారి అసెంబ్లీకి జగన్ రావాలని కోరారు.
అయితే గత పదిహేను నెలలుగా చూస్తే చాలా మంది జగన్ విషయంలో అసెంబ్లీకి రావాలని కోరుకుతున్నారు. కానీ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం ఆ విషయం గురించి మాట్లాడడంలేదు. ఆయన ఆ మధ్యన ఒకసారి సభలో ప్రసంగం చేస్తూ తనను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అని ఛాలెంజ్ చేసిన వారు ఈ రోజున సభకే రాకుండా బయట ఉండిపోయారని సెటైర్లు వేశారు. కానీ ఫస్ట్ టైం జగన్ గురించి ఆయన స్పందించారు. జగన్ అసెంబ్లీకి రావాలని ఆయన కోరారు.
వైసీపీ వారికి బహుశా వేరే రాజ్యాంగం ఉందేమో తెలియదు అని ఆయన వ్యాఖ్యానించారు. వారు అలా అనుకుంటే మాత్రం తమ ప్రభుత్వంలో కుదరదు అన్నారు అంటే విపక్ష హోదా గురించి పవన్ ఈ విధంగా కామెంట్స్ చేసి ఉంటారని అంటున్నారు, సభకు జగన్ భారత రాజ్యాంగాన్ని గౌరవించి అసెంబ్లీకి అటెండ్ అవాలని పవన్ కోరారు.
అయితే ప్రతిసారి అసెంలీ సమావేశాలకు ముందు కూటమి నుంచి ఈ రకమైన పిలుపులు వస్తున్నా వైసీపీ అయితే పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆ పార్టీ స్టాండ్ క్లియర్ గా ఉందని అంటున్నారు. తమకు ప్రతిపక్ష స్థానం ఇస్తేనే సభకు వస్తామని వైసీపీ అంటోంది. దానికి తమైన తర్కాన్ని కూడా జోడిస్తోంది. సభలో ఉన్న ఏకైక ప్రతిపక్షం వైసీపీ కాబట్టి హోదా ఇవ్వాల్సిందే అని అంటోంది. ప్రతిపక్ష హోదా ఇస్తే తాము ప్రజా సమస్యల మీద విపులంగా ప్రస్తావిస్తామని కూడా చెబుతోంది. లేకపోతే ఒక్కో ఎమ్మెల్యేలు అయిదేసి నిముషాలు వంతున అవకాశం ఉంటుందని దాంతో తాము ఏమి మాట్లాడగలమని కూడా జగన్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.
అయితే వైసీపీని అసెంబ్లీకి రమ్మని కూటమి పిలుపుల వెనక కూడా వ్యూహం ఉంది అని అంటున్నారు. వైసీపీ తానుగా సభకు అటెండ్ కాకుండా ప్రజా తీర్పుని తేలికగా తీసుకుంటోంది అన్న చర్చను అయితే జనంలోకి పంపించడానికి అని అంటున్నారు. అదే సమయంలో తాము సభకు ఎందుకు గైర్ హాజర్ అవుతుందన్నది వైసీపీ బలంగా వివరించలేకపోతోంది. పైగా హోదా ఇస్తేనే వస్తామన్న కండిషన్ కూడా పెద్దగా జనం మద్దతు పొందేలా లేదు అని అంటున్నారు. మొత్తానికి సభకు రాకుండా దూరంగా ఉంటే వైసీపీకే నష్టమా లేక రాజకీయ వ్యూహంగా లాభమా అన్నది ముందు ముందు కాలం నిర్ణయిస్తుంది అని అంటున్నారు.