ఆంధ్రప్రదేశ్‌లో చాలా రోజుల తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సుమారు మూడేళ్ల తర్వాత ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. మే 7వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే కొత్త రేషన్ కార్డులు ఎన్నిరోజులకు మంజూరు చేస్తారనే దానిపై అధికారులు పలు వివరాలు వెల్లడించారు. కొత్త రేషన్ కార్డులు మంజూరు, విభజన వంటి వాటికి 21 రోజులు సమయం పడుతుందని చెప్తున్నారు. అలాగే ఆగస్టు నెలలో కొత్త రేషన్ కార్డులు అందించే అవకాశం ఉందని సమాచారం.
ప్రభుత్వాలు అందించే ఏ సంక్షేమ పథకానికి అయినా ప్రస్తుతం రేషన్ కార్డు అనేది తప్పనిసరి. రేషన్ కార్డు ఆధారంగానే ఓ కుటుంబం ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వాలు అంచనా వేస్తుంటాయి. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రస్తుతం రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. మే నెల మొదటి వారం నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అలాగే రేషన్ కార్డులలో మార్పులు, చేర్పులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. దీంతో మే నెల 7వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు , బియ్యం కార్డులలో కుటుంబసభ్యుల విభజన, చనిపోయిన వారి పేర్లు తొలగింపు, అడ్రస్ మార్పు, కొత్త సభ్యుల చేర్పులకు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీంతో ప్రజలు గ్రామ, వార్డు సచివాలయాలకు క్యూ కడుతున్నారు.
అయితే రేషన్ కార్డుల దరఖాస్తులకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. కొత్త రేషన్ కార్డు మంజూరు చేయడానికి, అలాగే రేషన్ కార్డుల విభజన, కొత్త సభ్యులను రేషన్ కార్డులో చేర్చేందుకు, చనిపోయిన వారి పేర్లను తొలగించేందుకు.. దరఖాస్తు చేసిన తర్వాత 21 రోజుల వరకూ సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు.
బియ్యం కార్డులలో అడ్రస్ మార్చుకోవడానికి, పేర్లు సరిచేసుకోవడానికి ఏడు రోజుల సమయం పడుతుందంటున్నారు. సచివాలయాల్లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసిన తర్వాత.. వారి వివరాలు ఆన్‌లైన్ నుంచి సిబ్బంది లాగిన్‌కు పంపుతారు. అలా వచ్చిన వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేస్తున్నారు.
మరోవైపు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా రేషన్ కార్డుల సేవలు పొందవచ్చు.మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 9552300009 కు హాయ్ మెసేజ్ పంపి.. అందులో అడిగిన వివరాలను సమర్పించడం ద్వారా రేషన్ కార్డుల మార్పులు, చేర్పులకు అధికారులు అవకాశం కల్పించారు. మరోవైపు కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ప్రభుత్వం నుంచి విధివిధానాలు రావాల్సి ఉందని అధికారులు చెప్తు్న్నారు. ప్రస్తుతానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని.. ఇది నిరంతరం జరుగుతుందని వెల్లడించారు. ఆగస్ట్ నెలలో కొత్త రేషన్ కార్డులు వచ్చే అవకాశం ఉందని సమాచారం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేయడానికి సిద్ధమవుతోంది. బ్యాంకు ఏటీఎం కార్డుల రూపంలో ఉండే ఈ కార్డుల్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. పౌరసరఫరాల శాఖ వచ్చే నెలలో వీటిని పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు, కార్డుల్లో మార్పులు చేసుకునేందుకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. దరఖాస్తు స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల్ని స్మార్ట్ కార్డుల రూపంలో జారీ చేయనుంది. ఈ కార్డుల్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేస్తున్నారు. బ్యాంకు ఏటీఎం కార్డ్ సైజులో క్యూఆర్ కోడ్‌తో ఈ స్మార్ట్ రేషన్ కార్డును రూపొందిస్తున్నారు. ఈ కార్డుల పంపిణీకి పౌరసరఫరాల శాఖ సిద్ధమవుతోంది.. అన్నీ కుదిరితే వచ్చే నెలలో వీటిని పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుపై ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం.. మరోవైపు కార్డుదారు (కుటుంబ పెద్ద) ఫోటో ఉంటుంది. రేషన్ కార్డు నంబరు, రేషన్ షాపు నంబరు వంటి వివరాలు పొందుపరుస్తారు. కార్డు వెనుకవైపు లబ్ధిదారుల కుటుంబ సభ్యుల వివరాలు ప్రింట్ చేస్తారు.
రేషన్ డీలర్ల దగ్గర ఈ-పోస్ యంత్రాల సహాయంతో ఈ స్మార్ట్ రేషన్ కార్డును స్కాన్ చేస్తారు. అప్పుడుఆ కుటుంబానికి సంబంధించిన వివరాలు, రేషన్ సరుకుల వినియోగానికి సంబంధించిన పూర్తి సమాచారం చూడొచ్చు. ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల ప్రింట్ చేయడం కోసం ఏపీటీఎస్ ద్వారా టెండర్ ప్రక్రియ పూర్తి చేయగా.. ప్రస్తుతం కార్డుల్ని ముద్రిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1.46 కోట్లకు పైగా కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి.. అయితే గత ప్రభుత్వ హయాంలో చాలామంది అర్హులైన పేదలు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నా పక్కన పెట్టారు.. ఈ క్రమంలో లక్షల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. కూటమి ప్రభుత్వం అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తోంది. తల్లిదండ్రుల నుంచి వేరుపడిన వారిని (కుమారులు, కూతుళ్లు) స్ల్పిట్ చేయడం.. రేషన్ కార్డులలో కుటుంబసభ్యుల పేర్లు చేర్చడానికి, సభ్యుల పేర్లు తొలగించడానికి, అడ్రస్ మార్చుకునేందుకు అవకాశం ఉంది. మే నెలలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.. ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని ప్రభుత్వం చెబుతోంది.
అంతేకాదు ఈ రేషన్ కార్డ్‌కు సంబంధించిన స్టేటస్‌ను చెక్ చేసుకునేందకు అవకాశం ఉంది. దీని కోసం ఏపీ సేవా పోర్టల్ అధికారిక వెబ్‌సైట్ https://vswsonline.ap.gov.in/ ను ఓపెన్ చేసి.. హోమ్ పేజీలో ‘Service Request Status Check’ సెర్చ్ లింక్ ఉంటుంది. ఆ లింక్‌లో రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇచ్చిన నంబర్‌ను ఎంటర్ చేయాలి.. కింద క్యాప్చాను నమోదు చేసి సెర్చ్‌పైనే క్లిక్ చేయాలి. అప్పుడు రేషన్ కార్డు స్టేటస్ కనిపిస్తుంది.. కార్డు ఏ దశలో ఉందో తెలుస్తుంది. ఒకవేళ పెండింగ్ ఉంటే.. ఎవరి వద్ద పెండింగ్‌లో ఉందో చూడొచ్చు. రేషన్ కార్డు సర్వీస్ ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలో తెలుస్తుంది. మొత్తం మీద కొత్త రేషన్‌కార్డులపై క్లారిటీ వచ్చేసింది.