అనంతపురంలో దారుణం: వరకట్న వేధింపులతో భార్య-కుమారుడు మృతి… డిప్యూటీ తహసిల్దార్‌పై ఆరోపణలు
అనంతపురం నగరంలోని శారద నగర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు, వరకట్న వేధింపుల నేపథ్యంలో తల్లి తన కుమారుడిని హత్య చేసి, అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది.రామగిరి మండలంలో డిప్యూటీ తహసిల్దార్‌గా పనిచేస్తున్న రవికుమార్ ఉదయం విధులకు వెళ్లి సాయంత్రం ఇంటికి చేరగా తలుపులు తీయకపోవడంతో అనుమానం కలిగింది. కిటికీ ద్వారా చూస్తే భార్య అమూల్య ఉరి వేసుకుని కనిపించడంతో వెంటనే ఇరుగుపొరుగు వారి సహాయంతో తలుపులు విరిగించారు. లోపల మంచంపై కుమారుడు రక్తపు మడుగులో మృతదేహంగా కనిపించడంతో విషాద వాతావరణం నెలకొంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం అమూల్య ముందుగా కుమారుడి గొంతు కోసి హత్య చేసి, తరువాత ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.కుటుంబ సభ్యుల ప్రకారం, రూ.50 లక్షల వరకట్నం, 50 తులాల బంగారం, పెళ్లి ఖర్చులు, స్థలాలు సహా భారీగా ఇచ్చినా… వరకట్న వేధింపులు ఏ మాత్రం తగ్గలేదని ఆరోపిస్తున్నారు.డిప్యూటీ ఎమ్మార్వోగా ఉద్యోగంలో ఉన్నప్పటికీ, గత కొంతకాలంగా భర్త రవికుమార్ వేధింపులతో తీవ్ర ఆవేదనకు గురైందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తల్లిదండ్రులకు చెప్పి బాధ పెంచకూడదనే భావనతో అమూల్య తన బాధను వ్యక్తం చేయలేదని తెలుస్తోంది.
తన కుమారుడు కూడా భర్త చేతుల్లోనే వేధింపులకు గురవుతాడనే భయంతో ఈ దారుణానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువుకున్న గ్రూప్-2 అధికారి ఇలా వరకట్న వేధింపులకు పాల్పడటం నిందనీయమని వారు పేర్కొన్నారు.రవికుమార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


















