బీజేపీ అగ్ర నేత కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక సంచలన జోస్యం చెప్పారు. బీహార్ ఎన్నికల ఫీవర్ ని ఆయన పెంచేస్తూ వరసగా పబ్లిక్ మీటింగ్స్ తో పాటు ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ ప్రత్యర్ధుల మీద మాటల తూటాలను పేలుస్తున్నారు. రాహుల్ గాంధీ ని రాహుల్ బాగా అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. తేజస్వి యాదవ్ ని లాలూ కొడుకుగానే చూస్తూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు ఈ ఇద్దరి జాతకమేంటో తాజాగా బీహార్ సభలలో అమిత్ షా చెప్పేశారు.
రాహుల్ గాంధీకి ప్రధాని పీఠం అందుతుందా అలాగే లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ కి బీహార్ సీఎం పీఠం అధిరోహించే చాన్స్ ఉందా అంటే ఈ ఇద్దరి జాతకాలను ఫుల్ గా పరిశీలించిన అమిత్ షా మాత్రం అసలు ఆ చాన్స్ వారికి లేదని తేల్చేశారు. ఈ ఇద్దరూ ఎప్పటికీ ఉన్నత స్థానాలను అందుకోలేరని ఆయన చాలా నిబ్బరంగా చెబుతున్నారు బీహార్ లో జంగిల్ రాజ్ రాదని దేశంలో రాహుల్ జమానా అన్నది కల అని కూడా క్లారిటీ ఇచ్చేశారు.
అటు కాంగ్రెస్ అయినా ఇటు ఆర్జేడీ అయినా కుటుంబ పార్టీలుగా అమిత్ షా ఎద్దేవా చేస్తున్నారు సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని అనుకుంటున్నారని, లాలూ రబ్రీ దంపతులు అయితే తేజస్విని సీఎం గా చేయాలని సకల ప్రయత్నాలు చేస్తున్నారని అయితే అవేమీ సాగేదే లేదని అమిత్ షా స్పష్టం చేశారు. నేను చెబుతున్నా చూడండి ఈ ఇద్దరికీ పదవులు దక్కవని అమిత్ షా అంటున్నారు. బీహార్ సీఎం గా నితీష్ కుమార్ అలాగే ఢిల్లీలో ప్రధాని కుర్చీలో నరేంద్ర మోడీ ఉన్నారని వారే కొనసాగుతారని అమిత్ షా నమ్మకంగా చెబుతున్నారు.
బీహార్ ఎన్నికల్లో ప్రజలు ఏ తప్పూ చేయకుండా కమలానికి ఓటేయాలని అమిత్ షా కోరుతున్నారు. ఎన్నికల్లో కనుక పొరపాటున మహా ఘట్ బంధన్ కి ఓటు వేస్తే మాత్రం బీహార్ లో హత్యలు, లూటీలు కిడ్నాపులు బెదిరింపులు అన్నీ రోజు వారీగానే జరిగిపోతాయని ఆయన హెచ్చరించారు తిరిగి ఎన్డీయేకు పట్టం కట్టాలని ఆయన అంటున్నారు. అపుడు ప్రజలు మంచి విద్య మంచి వైద్యంతో పాటు మంచి లా అండ్ ఆర్డర్ కూడా పొందవచ్చు అని అమిత్ షా సూచిస్తున్నారు. మరోసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనుక బీహార్ లో 26 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి కోసి నదీ జలాలను వ్యవసాయం కోసం వినియోగిస్తామని అలాగే వరదలకు అడ్డుకట్ట వేస్తామని ప్రతీ జిల్లాలో ఒక ఇంజనీరీంగ్ మెడికల్ కాలేజీలు తెస్తామని ఆయన హామీ ఇచ్చారు.
బీహార్ లో అభివృద్ధీ అడ్డుకునే పార్టీలకు ఈ ఎన్నికలే సరైన జవాబు అని అమిత్ షా అన్నారు. మొత్తానికి మొత్తం తుడిచి పెట్టుకుని పోతాయని ఆయన జోస్యం చెప్పారు. ఆర్జేడీ పార్టీ మోడీ తల్లిని, మోడీని కూడా అవమానించింది అని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల బీహార్ ప్రజలు దానికి ఇంతకు ఇంత బదులు తీర్చుకుంటారని కూడా అమిత్ షా అంటున్నారు. నితీష్ కుమార్ ని కాబోయే సీఎం గా బీజేపీ ప్రచారం చేస్తోంది. అంతే కాకుండా ప్రత్యర్ధులకు రాజయోగం లేదని జోస్యం చెబుతోంది. ప్రజలకు జంగిల్ రాజ్ ని గుర్తుకు తెస్తూ నాటి లాలూ రబ్రీల పాలనను గురించి చెబుతోంది. ఇవన్నీ ఈ ఎన్నికల్లో ఏ మేరకు ప్రతిఫలిస్తాయో చూడాల్సిందే.


















