ప్రముఖ నిర్మాత, నటుడు అల్లు రామలింగయ్య భార్య, ప్రముఖ టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ నాయనమ్మ అల్లు కనకరత్నం శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. శ్రీమతి అల్లు కనకరత్నం వయసు 94 సంవత్సరాలు, వృద్ధాప్య సంబంధిత సమస్య కారణంగా ఆమె తుది శ్వాస విడిచారు.
ఈ విషాదం గురించి తెలుసుకున్న వెంటనే ముంబై నుంచి అల్లు అర్జున్ హైదరాబాద్ కి బయల్దేరారు. ఆయన నేటి ఉదయం 9 గంటలకు చేరుకుంటారని సమాచారం. మైసూర్ లో పెద్ది షూటింగ్ ని క్యాన్సిల్ చేసుకుని రామ్ చరణ్ హైదరాబాద్‌కు తిరిగి చేరుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వైజాగ్‌లో పర్యటిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్, నాగబాబు ఆదివారం హైదరాబాద్‌కు చేరుకుంటారు.
అల్లు కుటుంబంలో విషాదం గురించి విన్న పలువురు టాలీవుడ్ తారలు అల్లు కనకరత్నం కుమారుడు అల్లు అరవింద్, ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసారు. అల్లు కనకరత్నం భౌతికకాయాన్ని ఉదయం 9 గంటల నుండి అల్లు అరవింద్ నివాసంలో ఉంచగా, ఇతర లాంఛనాలను అల్లుడు చిరంజీవి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అల్లు కనకరత్నం అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం కోకాపేటలో జరుగుతాయి.