టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. దాదాపు 13 ఏళ్ల తర్వాత విరాట్ దేశవాళీ క్రికెట్ రంజీ ఆడనుండడంతో క్రికెట్ అభిమానులు అంతా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం దిల్లీలోని అరుణ్ జెట్లీ స్టేడియంలో ప్రాక్టీస్ కూడా మెదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ కు ముందు దిల్లీ జట్టు కెప్టెన్ ఆయుష్ బదోనీ.. విరాట్ కోహ్లీతో కలిసి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం ఎలాంటి అనుభవాన్ని ఇచ్చిందో తెలిపాడు. విరాట్ రాకతో తమ జట్టులో ఎలాంటి వాతావరణం ఏర్పడిందో వివరించాడు. తొలి మ్యాచ్ లో సౌరాష్ట్రపై ఓటమిని అందుకున్నప్పటికీ.. ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నట్లు పేర్కొన్నాడు.
“ఈ మ్యాచ్ ను మంచి ఫలితంతో ముగించాలని అనుకుంటున్నాం. మేము పాయింట్ల పట్టిక గురించి ఆలోచించట్లేదు. ఏదైనా జరగొచ్చు. కానీ మేము మాత్రం మంచి ఫలితం అందుకోవాలని బరిలోకి దిగుతున్నాం. విరాట్ రాకతో ప్రతిఒక్కరిలో ఎంతో ఉత్సాహం, స్ఫూర్తి పెరిగింది. మా టీమ్ లో ఫన్నీ వాతావరణం కూడా నెలకొంది. కాన్ఫిడెంట్ గా ఎలా ఉండాలో అతడు మా అందరికీ వివరించాడు. అతడు మైదానంలో ఉండడంతో, గెలుపు మాదే అని ప్రతిఒక్కరూ భావిస్తున్నారు. ప్రతిఒక్కరూ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. విరాట్ కూడా ఈ మ్యాచ్ ఆడడంతో మా అందరిలో ఉత్సాహం మరింత పెరిగింది.”
“కోహ్లీ ఎప్పటిలాగే ఈ మ్యాచ్ లో కూడా 4వ స్థానంలో బ్యాటింగ్ కు దిగుతాడు. నేను ఐదో స్థానంలో బరిలోకి దిగుతాను. ఫీల్డింగ్ తనకు నచ్చిన చోట చేస్తాడు. నేనేమి అతడికి పొజిషన్ ఫిక్స్ చేయను. అయితే తుది జట్టు గురించి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఏదేమైనా కోహ్లీ, రిషభ్ పంత్ లాంటి ఇద్దరు పెద్ద ప్లేయర్లు జట్టులో ఉండటం అనేది ఎంతో ఆనందంగా ఉంది. వాళ్లు అలా ఉంటే చాలు, నాకు నేనే ఎంతో మోటివేట్ అవుతాను. కోహ్లీతో ఆడినప్పుడు (ప్రాక్టీస్ మ్యాచ్ లో)) ఒత్తిడిని బాగా హ్యాండిల్ చేయగలిగాను. అతడితో ఆడటం ఎంతో సరదాగా అనిపించింది.” అని బదోని పేర్కొన్నాడు.