వివేకా హత్య కేసు నిందితుడు వైఎస్ భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏపీకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. ఇప్పటికే షరతులతో కూడా బెయిల్‌పై భాస్కర్ రెడ్డి బయటే ఉన్న సంగతి తెలిసిందే.
కాగా, ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా ఏపీలో ప్రవేశించవద్దని హైకోర్టు గతంలో షరతులు విధించింది. అయితే ఆ షరతులను సడలించాలని తాజాగా భాస్కర్ రెడ్డి పిటిషన్ వేశారు. పులివెందులలో తనకు వ్యవసాయం ఉందని, అనారోగ్యంతో ఉన్నానని ఏపీలో అడుగు పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన పిటిషన్‌లో వివరించారు.
తాజాగా మాజీ మంత్రి వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తయినట్లు సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. ఒక వేళ సుప్రీం ఆదేశిస్తే తదుపరి విచారణ జరుపుతామని సీబీఐ పేర్కొంది. ఈ మేరకు ధర్మాసనానికి సీబీఐ వెల్లడించింది. దీనిపై తాజాగా.. వైఎస్ సునీత కీలక వ్యాఖ్యలు చేశారు.
వివేకా హత్య కేసు నిందితులు ఇంకా బయట తీరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య తరువాత పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్‌ను తుడిచేశారని ఆరోపించారు. గత 6 ఏళ్ళుగా కేసుపై పోరాడుతూనే ఉన్నామని తెలిపారు. ఇంత వరకు దోషులకు శిక్ష పడలేదని అసహనం వ్యక్తం చేశారు. న్యాయం కోసం పోరాడడానికి సెక్యూరిటీ పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఏ రోజైనా కచ్చితంగా న్యాయం గెలుస్తుందని నమ్ముతున్నాని ధీమా వ్యక్తం చేశారు. న్యాయం కోసం ఎన్నాళ్లైనా పోరాడుతూనే ఉంటా అని సునీత స్పష్టం చేశారు.