కాంగ్రెస్ లో ఎపుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. జాతీయ అధినాయకత్వం ఆలోచనల మేరకే ఎవరైనా పని చేయాల్సి ఉంటుంది. అయితే రాజకీయంగా వస్తూనే ఒక ప్రాంతీయ పార్టీని తెలంగాణాలో పెట్టి గట్టిగా మూడేళ్ల పాటు నడపకుండానే వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. అలా ఏపీకి షిఫ్ట్ అయి ఏపీసీసీ చీఫ్ పదవిని అందుకున్నారు. అది లగాయితూ గత ఏణ్ణర్థం దాకా ఆమె ఏపీలో తానే అంతా అన్నట్లుగా వ్యవహరించారు. ఒక విధంగా ఆమె సొంత పార్టీ మాదిరిగానే ఏపీలో హవా చూపించారు.
ఫలితంగా పార్టీలో పెద్ద తలకాయలు సీనియర్లు అంతా సైలెంట్ అయ్యారు. తమకు ఏ మాత్రం సంబంధం లేదు అన్నట్లుగా వారు చోద్యం చూశారు. దీంతో హై కమాండ్ కి ఫిర్యాదులు వెళ్ళాయని చెబుతారు. ఏకంగా షర్మిలనే తప్పించాలని కొత్త చీఫ్ ని నియమించాలని కూడా డిమాండ్లు వెళ్ళాయని అంటారు. అయితే చాలా ఆచీతూచీ హై కమాండ్ వ్యవహరించింది అని అంటున్నారు. షర్మిలను తప్పించకుండానే ఆమె చేతులు కట్టేసింది అని అంటున్నారు.
ఏపీ కాంగ్రెస్ లో పాతిక మంది సీనియర్లతో పొలిటికల్ అడ్వైజర్స్ కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా పార్టీలో సమిష్టి నాయకత్వానికి తెర తీశారు. సీనియర్లను అందులోకి తీసుకుని రావడం ద్వారా షర్మిలను కూడా వారితో పాటే ఉంచారు. ఆమె పీసీసీ చీఫ్ గా ఉన్నా అందరితో పాటే ఆమె నడచుకోవాలని సంకేతాలు పంపించారు. ఆమె సొంత నిర్ణయాలు చెల్లవని దాదాపుగా చెప్పాల్సింది ఈ విధంగా చెప్పేశారు అని అంటున్నారు. ఏ డెసిషన్ అయినా పీఏసీ తీసుకుంటుంది దానిని బట్టే ఆమె నడచుకోవాల్సి ఉంటుంది అని అంటున్నారు.
ఇక ఈ విధంగా చేయడం ద్వారా నిర్ణయం షర్మిలకే ఇచ్చారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే ఆ పార్టీతో అందరితో సమిష్టిగానే ముందుకు సాగాలి. ఆమె గతంలో మాదిరిగా సింగిల్ గా ఫోకస్ అవలేరు. సీనియర్లు కూడా తెర మీద ఉంటారు. దాంతో ఆమె పార్టీతో కలసి పనిచేయడమా లేక తప్పుకోవడమా అన్నది ఆమెకే చాయిస్ గా ఉందని అంటున్నారు. షర్మిలను ఎందుకు తప్పించలేదు అంటే ఇక్కడే కాంగ్రెస్ వ్యూహం ఉందని చెబుతున్నారు. ఆమె వైఎస్సార్ కుమార్తె. దాంతో ఆమెను తప్పిస్తే ఎంతో కొంత ప్రభావం పడుతుంది అన్న అన్న ఆలోచన కావచ్చు అని అంటున్నారు. ఆమెను ముందు పెట్టి వైఎస్సార్ చరిష్మాను తమ వైపు తిప్పుకునే స్ట్రాటజీ కావచ్చు అని కూడా అంటున్నారు.
కాంగ్రెస్ అంటేనే మహా సముద్రం. అందులో ఎంతో మంది నేతలు ఉంటారు. అందువల్ల ఏ ఒక్కరి మాటో చలామణీ అవదు. ఇపుడు ఏపీ కాంగ్రెస్ లో అదే జరుగుతుంది. దాంతో ఈ సమిష్టి బాధ్యతలు నాయకత్వం వల్ల షర్మిల ప్రాధాన్యత తగ్గినట్లే అంటున్నారు. ఒక విధంగా ఆమెకు షాక్ ఇచ్చారని చెబుతున్నారు. ఆమె పార్టీ కోసం కష్టపడి రేపటి రోజున కాంగ్రెస్ కి ఏపీలో ఏమైనా మంచిగా ఉంటే ఆమెకు కూడా పదవులు దక్కితే దక్కవచ్చు. కానీ ఈలోగా మాత్రం అందరితో కలసి పార్టీని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఈ రకమైన సందేశం పార్టీ ఇచ్చిన తరువాత షర్మిల మౌనంగా ఉంటున్నారు అని అంటున్నారు. ఆమె కాంగ్రెస్ తో ఉంటే లాభమేనా అంటే కాంగ్రెస్ లో అవకాశాలు రావడం అంటే జాక్ పాట్ కొట్టినట్లే. ఓపికగా వేచి చూడాల్సిందే. సో షర్మిల ఇపుడు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది అని అంటున్నారు.