ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పనితీరుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాల నుంచి అనూహ్యంగా ఏపీకి వచ్చిన షర్మిల.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని తీసుకుని కొంతకాలం హల్ చల్ చేశారు. పదునైన విమర్శలు, వ్యంగ్యస్త్రాలతో విరుచుకుపడుతూ అందరి దృష్టిని ఆకర్షించారు షర్మిల. ముఖ్యంగా తన సోదరుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి టార్గెట్ గా షర్మిల చేసే విమర్శలు తీవ్ర చర్చకు దారితీసేవి. స్పష్టమైన తెలుగులో మంచి చణుకులు వాడుతూ ఆమె సంధించే వాగ్బాణాలపై పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృతంగా చర్చ జరిగేది. అయితే ఇటీవల కొద్ది రోజులుగా ఆమె పనితీరులో ఇంతకు ముందన్నంత దూకుడు లేదన్నట్లు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తెగా మరో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సోదరిగా షర్మిలకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉంది. 2014 ఎన్నికల సమయంలో తన సోదరుడి కోసం పాదయాత్ర చేసిన షర్మిల.. రాష్ట్రవ్యాప్తంగా తన కంటూ కొందరు అభిమానులను సంపాదించుకున్నారు. అయితే సోదరుడితో విభేదాల వల్ల వైసీపీకి దూరమైన షర్మిల తనకంటూ సొంత గుర్తింపు కోసం చాలా ప్రయత్నాలే చేశారు. ముందుగా తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అనే పార్టీని ప్రారంభించిన షర్మిల అనంతరం ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీకి వచ్చేశారు.
గత ఎన్నికల ముందు ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న షర్మిల.. కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుత ఎంపీ వైఎస్ అవినాశరెడ్డికి చెమటలు పట్టేలా పోటీ ఇచ్చారు. దురదుష్టవశాత్తూ ఎన్నికల్లో ఓడినా తన గళంతో వైసీపీకి ఊపిరి ఆడకుండా విమర్శల దాడి కొనసాగించి నిత్యం పొలిటికల్ సర్కిల్స్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ప్రతిపక్షంలో ఉన్న తమను షర్మిల ఇంతలా టార్గెట్ చేయడం ఏంటని వైసీపీ నేతలు కూడా తలలు పట్టుకునేవారు. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ కంట్లో నలుసులా ప్రవర్తించిన షర్మిలను ఎలా ఎదుర్కోవాలో తెలియక ఆ పార్టీ సీనియర్ నేతలు తర్జనభర్జన పడేవారు.
అయితే ఏమైందో కానీ, ఇటీవల కొంతకాలంగా షర్మిల రాజకీయంలో దూకుడు కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పుడప్పుడు విజయవాడ వస్తున్న షర్మిల.. ఏదో మొక్కుబడి కార్యక్రమాలు చేసుకుని వెళ్లిపోతున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎక్కువగా తన ఎక్స్ ఖాతాల్లో పోస్టులకే పరిమితమవుతున్నారు. ఈ పోస్టులు కూడా గతంలో ఉన్నంత హాట్ గా ఉండటం లేదని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పరిణామంపై వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకుంటున్నారు. షర్మిల నుంచి తమపై దాడి తగ్గడంతో వారు ప్రభుత్వంపై యుద్ధానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు చెబుతున్నారు.

















