చేతిలో అధికారంలో ఉన్నపుడు ఎంతో మందికి ప్రభుత్వ పదవులు జగన్ ఇచ్చారు. ఆయన చేతికి ఎముక లేదు అన్నట్లుగానే ఎంతో ఉన్నతమైన పదవులు సైతం ఇచ్చారు. రాజ్యసభకు కూడా చాలా మందిని పంపించారు. ఉప ముఖ్యమంత్రులు ఒకరు కాదు అని తన అయిదేళ్ళ హయాంలో అనేక మందికి చాన్స్ ఇచ్చారు అలాగే ఎమ్మెల్సీ పదవులు కానీ నామినేటెడ్ పదవులు కానీ వీటితో పాటు సలహాదారుల పదవులు కానీ చాలా మందికి ఇచ్చారు. అయితే అలా ఇచ్చినా వైసీపీకి చాలా మంది ఏ మేరకు ఉపయోగపడ్డారో తెలియదు, 2024 ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలు అయింది ఇపుడు చూస్తే ఘనమైన పదవులు అందుకున్న వారు ఎవరూ కనిపించడంలేదు. దాంతో పాటు వైసీపీ అధినేత కూడా విపక్షంలోకి వచ్చేశారు.
వైసీపీ ఇపుడు పార్టీ పదవులే అందరికీ పంచి ఇస్తోంది. వాటిని పెంచి మరీ ఇస్తోంది. పార్టీ వ్యవస్థలో కొత్త నిర్మాణం చేసి మరీ సరికొత్త పదవులు సృష్టించి మరీ ఇస్తోంది. ఈ పదవులు అందుకున్న వారు అయినా పార్టీ కోసం పనిచేస్తారని జనంలో ఉంటారని నమ్ముతోంది. అయితే ఈ పార్టీ పదవుల విషయంలో మాత్రం జగన్ సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు అని అంటున్నారు. గతంలో ప్రభుత్వ పదవులు ఇవ్వలేకపోయిన వారికి టికెట్లు ఇవ్వలేకపోయిన వారికి పార్టీ కోసం ఎంతో కొంత నిబద్ధత చాటుకున్న వారికి ఏరి కోరి మరీ పదవులు అప్పగిస్తున్నారు.
రాష్ట్రంలో పాలనను వికేంద్రీకరించాలని వైసీపీ ఎంతగానో ముచ్చటపడింది. మూడు రాజధానులు అంది కానీ అది మాత్రం నెరవేరలేదు. ఆ దిశగా కనీస ప్రయత్నంగా ఒక్క అడుగు కూడా ముందుకు పడకుండానే వైసీపీ గద్దె దిగాల్సి వచ్చింది. అయితే పార్టీ వైసీపీ సొంతం కాబట్టి అధినేత జగన్ తనకు నచ్చిన తీరున వికేంద్రీకరణ విధానాన్ని అమలు చేస్తున్నారు. దాంతో వైసీపీకి రీజనల్ కో ఆర్డినేటర్ల వ్యవస్థ వచ్చింది ఇపుడు కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ల వ్యవస్థ కూడా వచ్చింది అన్ని అనుబంధ విభాగాలకు వర్కింగ్ ప్రెసిడెంట్లను జగన్ నియమించారు. దాంతో చాలా మందికి పార్టీ పదవులు అయితే దక్కాయి.
ఇపుడు కొత్తగా రాష్ట్ర కార్యదర్శి పదవుల పందేరం వైసీపీలో సాగుతోంది. గతంలో పట్టించుకోని నాయకులను సీనియర్లను ఇపుడు గుర్తించి మరీ రాష్ట్ర కార్యదర్శులుగా పదవులు ఇస్తున్నారు. వీరికి రెండేసి అసెంబ్లీ నియోజకవర్గాలను కేటాయించి వాటికి పరిశీలకులుగా పంపిస్తున్నారు. అలా విశాఖ జిల్లాలో చూస్తే గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్యకు ఈ పదవి లభించింది. ఆయన గాజువాక టికెట్ ని 2014 నుంచి ఆశిస్తున్నా దక్కలేదు. ఇక అరకుఇ ఎంపీగా 2019లో గెలిచి అయిదేళ్ళ పాటు పనిచేసిన గొడ్డేటి మాధవికి మళ్ళీ ఆ సీటు ఇవ్వలేదు. దాంతో ఆమె గత ఎన్నికల్లో ఖాళీ అయిపోయారు. ఆమెకు కూడా ఈ పదవిని కట్టబెట్టారు.
నర్శీపట్నంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు తమ్ముడు సన్యాసిపాత్రుడు 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. ఆయనకు ఆనాడు ఇవ్వలేదు. ఇపుడు రాష్ట్ర కార్యదర్శి పదవి దక్కింది. ఇలా ఈ పదవుల పందేరం అయితే వైసీపీలో జోరుగా సాగుతోంది. మరి ఈ పదవులు అందుకున్న వారు పార్టీ కోసం ఏ మేరకు చేస్తారు, రేపటి ఎన్నికల్లో అయినా వీరికి టికెట్లు ఇచ్చి న్యాయం చేస్తారా అన్న చర్చ అయితే అనుచరులలో ఉంది. పార్టీ పదవి అంటే కష్టపడాలి. అధికారంలో ఉన్నపుడు చాలా మంది ప్రభుత్వ పదవులు అందుకున్నారు. పార్టీ కోసం పనిచేయడానికి మాత్రం వారు ఎవరూ సిద్ధంగా లేరు. దాంతో ఇపుడు పనిచేస్తే పదవులు, వారికే రేపటి రోజున అందలాలు అన్న విధానాన్ని వైసీపీ అమలు చేయాలని అనుకుంటోంది అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి ఈ ప్రయోగం ఏ మేరకు విజయవంతం అవుతుందో.