వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లాలో పార్టీ రిపేర్లకు దిగారు. జగన్ ఇలాకాలో పదికి ఆరు ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుని కూటమి 2024లో జెండా ఎగరేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత చూస్తే కడప జిల్లానే లక్ష్యంగా చేసుకుని అనేక కార్యక్రమాలు టీడీపీ చేపడుతూ వస్తోంది. ఈ ఏణ్ణర్ధం కాలంలో అనేక సార్లు చంద్రబాబు కడప జిల్లాలో పర్యటించారు. తాజాగా అన్నదాతా సుఖీభవ రెండో విడత నిధులను సైతం ఆయన కమలాపురం నియోజకవర్గం నుంచే రైతులకు అందించారు. రాయలసీమ అభివృద్ధి విజన్ తో బాబు ముందుకు సాగుతున్నారు. దాంతో పాటు వైసీపీని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో సొంత జిల్లా కడప నుంచే ప్రక్షాళన మొదలెట్టాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది అని అంటున్నారు.
వైఎస్సార్ ఫ్యామిలీకి పులివెందుల ఎలాగో జమ్మలమడుగు అలాగ అని అంటారు. అక్కడ కూడా మంచి పట్టు ఉంది. ఇక వైసీపీ పెట్టాక జమ్మలమడుగులో తొలిసారి 2024 ఎన్నికల్లోనే ఓటమి వైసీపీకి ప్రాప్తించింది. ఆదినారాయణరెడ్డి బీజేపీ అభ్యర్ధిగా కూటమి పార్టీల మద్దతుతో అక్కడ నుంచి గెలిచారు. ఆయన జగన్ మీద ఎప్పటికప్పుడు హాట్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. జగన్ ని ఆయన విమర్శించినంతగా సొంత జిల్లాలో ప్రత్యర్ధులు ఎవరూ విమర్శించినది లేదు. ఈ నేపధ్యంలో ఆదిని వైసీపీ కూడా గురి పెడుతోంది అని అంటున్నారు. ఆయనను కట్టడి చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచి గెలిచేందుకు పావులు కదుపుతోంది.
ఇక జమ్మలమడుగు వైసీపీ ఇంచార్జిగా రామ సుబ్బారెడ్డిని వైసీపీ అధినాయకత్వం తాజాగా నియమించింది. ఆయన ఎమ్మెల్సీగా వైసీపీ తరఫున ఉన్నారు. ఆయన ఆ నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్నారు. ఆయన మొదట కాంగ్రెస్ తరువాత టీడీపీ అక్కడ నుంచి వైసీపీలోకి 2019 ఎన్నికల కంటే ముందు వచ్చారు. కానీ డాక్టర్ సుధీర్ రెడ్డికి టికెట్ ఇవ్వడానికి అప్పటికే వైసీపీ నిర్ణయించడంతో ఆయనను పార్టీ కోసం పనిచేయమని కోరింది. అలా ఆయన చేసిన మీదట వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీగా చాన్స్ ఇచ్చింది. ఇక 2024 ఎన్నికల్లో కూడా ఆయన పేరు వినిపించినా సిట్టింగ్ ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డికే అవకాశం ఇచ్చారు. అయితే అక్కడ ఆది నారాయణరెడ్డి రాజకీయ దూకుడుని ఎదుర్కోవడంతో సుధీర్ రెడ్డి వెనకబడుతున్నారని భావించిన హై కమాండ్ ఆయన ప్లేస్ లో బలమైన నేతగా రామ సుబ్బారెడ్డిని ఎంపిక చేసింది. ఆదికి ఆయన అన్ని విధాలుగా సరిజోడుగా పార్టీ అంచనా కడుతోంది అని అంటున్నారు.
ఇక సుధీర్ రెడ్డిని రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నారు. ఆయన సేవలను పార్టీ ఉపయోగించుకుంటూనే 2029లో మరోసారి అధికారంలోకి వచ్చిన తరువాత తగిన న్యాయం చేయడానికి హామీ ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. మొత్తానికి జమ్మలమడుగు అంటేనే వేడెక్కే రాజకీయం. ఇపుడు ఆది వర్సెస్ రామసుబ్బారెడ్డి ఢీ డిక్కీ కొడతారా అన్నదే చర్చగా ఉంది.












