వైసీపీలో ఎస్సీ, ఎస్టీ సెల్స్ సహా బీసీ సెల్స్‌కు సంబంధించిన కమిటీలను నియమించారు. ఇంకా కొన్ని చోట్ల నియామకాలు సాగుతున్నాయి. రాష్ట్రాన్ని పార్టీ పరంగా ఐదు జోన్లుగా విభజించి.. కొన్ని సెల్స్‌కు ఆరు నుంచి 8 జోన్లుగా కూడా విభజించి.. కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. వీరిలో కొత్తవారికి అవకాశం కల్పిస్తు న్నారు. నిజానికి ఇది పార్టీ పరంగా మంచి నిర్ణయం. గతంలో పార్టీ కోసం పనిచేసిన వారికి ఇప్పుడు ఛాన్స్ ఇవ్వడం ద్వారా.. జగన్ వారి అభిమానాన్ని పొందుతున్నారు.
అయితే.. అసలు కథ ఇక్కడే ప్రారంభం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ కమిటీలకు బాధ్యతలు ఇవ్వలేదు. అంతేకాదు.. వారికి పార్టీ కార్యాలయాల్లో ప్రత్యేక రూమ్‌లను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ను కూడా అధిష్టానం అంగీకరించలేదు. దీంతో ఈ సెల్స్ ఇప్పుడు ఏం చేస్తాయన్నది ప్రశ్న. పైగా.. పార్టీ తరఫున వాయిస్ వినిపించాలని అంటున్నా.. ఏం మాట్లాడాలనే విషయంపై స్వతంత్ర నిర్ణయం తీసుకు నే అవకాశం లేదని ఒకరిద్దరు నాయకులు చెబుతున్నారు.
“పార్టీలో ఎప్పుడు ఏం చెబుతారో.. ఎప్పుడు ఎలాంటి వ్యూహాలు మారుతాయో చెప్పడం కష్టం. అందుకే.. ఏం మాట్లాడాలన్నా ఇబ్బంది అవుతోంది. పదవులు ఇస్తున్నారు. కానీ, ఇవి మొక్కుబడిగా ఉంటున్నాయి. ప్రభుత్వ పాలసీలపై.. ఏం చెప్పాలన్నా.. ఇబ్బందిగా ఉంది. అధినాయకుడు కొన్ని విషయాలను పాజిటి వ్‌గా తీసుకుంటున్నారు. మరికొన్ని నెగిటివ్ అవుతున్నాయి. దీంతో మేం ఏం మాట్లాడితే ఏం తంటా వస్తుందో అని ఇబ్బందిగా ఉంది.“ అని బీసీ సెల్ కు కొత్తగా నియమితుడైన కర్నూలు నేత ఒకరు వ్యాఖ్యానించారు.
ఇదే అభిప్రాయం దాదాపు ఇతర సెల్స్ కమిటీల నాయకుల్లోనూ ఉంది. దీనికి కారణం.. పార్టీ పరంగా ఇస్తు న్న పదవులతో కేవలం అలంకార ప్రాయంగానే తమ పరిస్థితి ఉందన్న వాదన. గతంలో వైసీపీ హయాం లో కార్పొరేషన్లను నియమించినప్పుడు కూడా ఇదే తంతు కొనసాగింది. 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసినా.. ఒక్కదానికి కూడా సరైన పని కల్పించలేదు. అంతేకాదు.. నిధులు ఇవ్వలేదు. దీంతో అవి మొక్కుబడి.. మొహమాటం కమిటీలుగా మారాయి. ఇప్పుడు పార్టీ పరంగా కూడా ఇదేసమస్య ఎదురవుతోంది.















