వైసీపీ అధినేత జగన్ రెండు నెలల కిందట.. ఖచ్చితంగా ఆగస్టు 25న నిర్వహించిన పార్టీ అగ్రనేతల సమావేశంలో ఘర్ వాపసీ అంటూ.. పెద్ద పిలుపే ఇచ్చారు. అంటే.. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన వారిని తిరిగి చేర్చుకునే కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టారు. అంతేకాదు.. ఎవరు వచ్చినా డోర్లు తెరిచే ఉన్నాయని కూడా చెప్పారు. వెళ్లిపోయిన వారిని ఏమీ అనబోనని,.. వారు కొన్ని కారణాలతో వెళ్లిపోయినా.. తిరిగి వచ్చేవారికి తలుపులు తెరిచి ఉంచామని చెప్పారు.
కానీ.. ఇప్పటి వరకు రెండు మాసాలు గడిచినా.. ఎవరూ వైసీపీ వైపు తొంగి కూడా చూడలేదు. మరి ఇలా ఎందుకు జరిగింది? జగన్ అంచనాల్లోనే తేడా ఉందా? లేక.. ఆయనకు సరైన సమాచారం అందకుండా నే ఘర్ వాపసీ పిలుపునిచ్చారా? అనేది ప్రశ్న. గత ఎన్నికల తర్వాత.. అనేక మంది కీలక నాయకులు.. పార్టీ నుంచి బయటకు వచ్చారు. వీరిలో సొంత దూరపు బంధువు బాలినేనిశ్రీనివాసరెడ్డి సహా అనేక మంది ఉన్నారు. మరీ ముఖ్యంగా రైట్ హ్యాండ్ లాంటి విజయసాయిరెడ్డి ఉన్న విషయం తెలిసిందే.
ఇక.. జిల్లాల స్థాయిలోనూ చాలా మంది నాయకులు ఉన్నారు. వీరంతా కూడా .. వైసీపీని కాదని వెళ్లిపోయా రు. సాయిరెడ్డి మినహా.. మిగిలిన వారు.. పదవుల్లో ఉన్న వారు కూడా వేర్వేరు పార్టీల్లో చేరిపోయారు. అయి తే.. జగన్‌కు అందిన సమాచారం ప్రకారం.. వారికి ఆయా పార్టీల్లో సరైన గుర్తింపు లేకుండా పోయిందట. అందుకే వారు వైసీపీని వదిలేసి బాధపడుతున్నట్టు లీకులు ఇస్తున్నారట!. ఈ నేపథ్యంలోనే మాజీసీఎం ఘర్ వాపసీ పిలుపునిచ్చారు. కానీ.. నాయకులు ఎవరూ మళ్లీ వైసీపీలోకి చేరలేదు.
నాడు ఏ కారణంతో అయితే.. వైసీపీ ని వదిలేశారో.. నేటికీ అవే కారణాలు పార్టీని పట్టి పీడిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారంపై అనేక మంది విమర్శలు చేశారు. ఇంకా చేస్తున్నారు. ఆయనను పక్కన పెట్టాలన్న ప్రధాన డిమాండ్ ఇంకా అలానే ఉంది. పైగా ఆయనకు మరిన్ని అధికారాలు కూడా ఇచ్చారు. ఇక, ప్రజలతోను.. నాయకులతోనూ మమేకం కావాలని జగన్‌కు సూచించారు. కానీ, ఈ రెండు తప్ప.. ఇంకేమైనా చేస్తానని ఆయన వ్యవహరిస్తున్నారు. ఇలా.. ఈ రెండు కారణాలతో బయటకు వెళ్లినవారు.. ఇంకా మార్పు రాకపోవడంతో ఇప్పుడున్న పార్టీల్లోనే కుదురుకుంటున్నారు.















