వైసీపీలో అంతా బాగుంది ఇక మనదే అధికారం అని ఒక వైపు అధినాయకత్వం గట్టిగా చెబుతోంది. కానీ గ్రౌండ్ లెవెల్ లో మాత్రం సీని వేరేగా ఉంది అని అంటున్నారు. అధినేత చెప్పిన మాటల మీద పార్టీలో కీలక నేతలకే విశ్వాసం కలుగడం లేదా అన్న చర్చ వస్తోంది. ఇక వైసీపీలో అసంతృప్తి నేతలు చాలా మంది ఉన్నారు. 2024 ఎన్నికల ముందు నుంచి పార్టీతో అంటీ ముట్టని నేతలు ఉంటే ఎన్నికల తరువాత సైలెంట్ అయిన వారు అనేక మంది ఉన్నారు. మరి వారు విషయంలో ఏమీ చేయకుండా వైసీపీకి అధికారం ఎలా దక్కుతుంది అన్నది మరో ప్రశ్నగా ఉంది.
పశ్చిమ గోదావరి జిల్లాలో కోటగిరి కుటుంబానిది రాజకీయంగా పలుకుబడి కలిగిన కుటుంబం. మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు టీడీపీ నుంచి అనేక సార్లు గెలిచారు. మంత్రిగా కీలక శాఖలు చూశారు. ఆయన టీడీపీలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ఉండేవారు. ఇక ఆయన వారసుడిగా కోటగిరి శ్రీధర్ తన పొలిటికల్ ఎంట్రీని వైసీపీ నుంచి ఇచ్చారు. తన తండ్రి పేరు బలమైన సామాజిక వర్గం దన్ను అంగబలం అర్ధబలం 2019లో వైసీపీకి ఉన్న ఊపు అన్నీ కలసి ఆయన ఏలూరు నుంచి ఎంపీగా అయ్యారు.
అయితే గెలిచిన కొంతకాలం పాటు బాగానే ఉన్న తన నియోజకవర్గంలో ఇతర నేతల ప్రమేయంతో ఆయన కొంత విసుగు చెందారు అని అంటారు. అంతే కాకుండా పార్టీ సైతం పెద్దగా పట్టించుకోకుండా వ్యవహరించింది అని చెబుతారు. ఇక 2024 ఎన్నికల ముందు ఆయనకు ఆయనే తనకు టికెట్ వద్దు అని చెప్పేశారు పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనకు సరైన ప్రాధాన్యత దక్కకపోవడంతో ఆయన ఇలా చేశారు అని నాడు చెప్పుకున్నారు. ఇక వైసీపీ వేరే వారికి టికెట్ ఇచ్చింది. అయినా వైసీపీకి గోదావరి జిల్లాలో బోణీ దక్కలేదు.
ఇక కోటగిరి అయితే తన వ్యాపారాల కోసం అమెరికాలో ఉన్నారని అంటున్నారు. అయితే ఆయన రాజకీయాలకు దూరం కావడం లేదని సంకేతాలు అయితే ఉన్నాయి. తన అనుచరులను మెల్లగా జనసేనలోకి పంపించారు అన్న టాక్ ఉంది. ఆయన సరైన సమయం చూసి జనసేనలోకే వెళ్తారు అని అంటున్నారు. టీడీపీలో అయితే పెద్ద నాయకులు చాలా మంది ఉన్నారని అంటున్నారు. అందుకే ఆయన జనసేనలోకి టచ్ లోకి వెళ్తున్నారు అని చెబుతున్నారు. ఆ దిశగా ఆయన ఇప్పటి నుంచే తన కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు అని అంటున్నారు.
వైసీపీకి ఆయన అధికారికంగా రాజీనామా చేయలేదు కానీ మానసికంగా దూరం అయినట్లే అని అంటున్నారు. అందుకే ఆయన వర్గం అంతా జనసేనలోకి వెళ్ళింది అని అంటున్నారు. వైసీపీలో ఆయన ఉండేది లేదని కూడా అంటున్నారు. ఆయన వైసీపీకి వీడడం జనసేనలోకి చేరడం అన్నది మాత్రం కరెక్ట్ టైం లోనే ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద ఒక ప్రముఖ రాజకీయ కుటుంబం బలమైన సామాజిక నేపథ్యం వివాదరహితుడిగా పేరున్న కోటగిరి శ్రీధర్ లాంటి వారు వైసీపీని వీడితే గోదావరి జిల్లాలలో భారీ నష్టమే అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.