వైసీపీలో ఘర్ వాపసి ఫార్ములాను అనుసరిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత ఎన్నికల తర్వాత పార్టీ నుంచి అనేకమంది నాయకులు వెళ్లిపోయారు. వీరిలో సీనియర్లు, జూనియర్లు.. సామాజిక వర్గంగా ప్రభావితం చేయగలిగిన నాయకులు కూడా ఉన్నారు. అంతేకాదు జగన్ కు దూరపు బంధువులైన బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి వారు కూడా పార్టీని కాదని వెళ్లిపోయారు. ఇక సౌమ్యుడుగా పేరు తెచ్చుకున్న ఆళ్ళ నాని, పెండెం దొరబాబు వంటి వారు కూడా జగన్ను కాదనుకుని దూరమయ్యారు, వారు వెళ్లిపోయినప్పుడు గాని,, వెళ్ళిపోయిన తర్వాత గాని పార్టీ వారిపై ఎలాంటి విమర్శలు చేయలేదు.
ఎలాంటి దూషణలకు కూడా దిగలేదు, ఇటు సోషల్ మీడియాలో కానీ అటు వ్యక్తిగతంగా కానీ వెళ్లిపోయిన వారి పట్ల ఒక్క మాట కూడా అనలేదు. పైగా జగన్ వారు వెళ్లిపోవడాన్ని.. తాను తప్పు పట్టడం లేదని కూడా సర్టిఫికెట్ ఇచ్చారు. ఎవరి ఇష్టం వారిది.. వారికి అక్కడ అవకాశాలు ఉంటే వెళ్లిపోవడంలో తప్పులేదు.. కానీ నేను వారందరినీ బాగానే చూసుకున్నాను వారికి ఏ లోటు రాకుండా చేశాను అని చెప్పారు. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ రాజ్యసభకు పంపించిన మోపిదేవి వెంకటరమణ వంటి వారి విషయంలో జగన్ ఇలాంటి సానుభూతి వాక్యాలు పలికారు.
తద్వారా నాయకుల దూరం అయినప్పటికీ ఆయన వారిని దూరం చేసుకోవడం లేదు అన్న వ్యూహాన్ని అనుసరించారు. ఇప్పుడు సదరు నాయకులు వెళ్లిపోయి దాదాపు 10 మాసాలు అవుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు అనూహ్యంగా వైసిపి ఘర్ వాపసీ మంత్రాన్ని పఠిస్తోంది. దీనికి ప్రధాన కారణం వైసీపీని కాదనుకొని వెళ్లిపోయిన వారికి ఆయా పార్టీల్లో పెద్దగా గుర్తింపు లేకపోవడం. అదే విధంగా వారిపై ఏదో నిఘా పెట్టారు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న నేపథ్యంలో వారు కూడా మానసికంగా ఇబ్బందులు పడుతున్నారన్నది రాజకీయంగా ఒక చర్చ అయితే నడుస్తోంది.
ఉదాహరణకు ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి వెళ్లిపోయిన ఒక నాయకుడికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఆయన ఓ కీలక పార్టీలో చేరారు. కానీ ఎలాంటి గుర్తింపు రాలేదు. పైగా ఆయన విషయంలో ఇతర నాయకులు ఎక్కువగా జోక్యం చేసుకొని ఆయన ఏమన్నా తమ పార్టీ వ్యవహారాలను తమ పార్టీ అంశాలను ఇతరులకు చేరవేస్తున్నారా అనేది పరిశీలిస్తున్నారన్న విషయం చర్చగా మారింది. దీంతో సదరు నాయకుడు దూరంగా ఉంటున్నారు. ఇలాగే మరి కొందరు నాయకుల విషయంలో కూడా జరుగుతోందన్నది వైసిపి వేస్తున్న అంచనా.
ఇలాంటి వారందరూ తిరిగి వచ్చేస్తారని తమతో ఉంటారని అనుకుంటున్నారు. ఇటీవల జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలోకి వెళ్లిపోయిన విషయం తెలిసందే. అయితే ఆయనతో పాటు వెళ్లిన కొందరు స్థానిక నాయకులు.. ముఖ్యంగా స్థానిక ప్రజాప్రతినిధులు తిరిగి వైసీపీలో చేరిపోయారు. ఇది వైసీపీకి ఒక రకంగా నైతిక బలాన్ని చేకూర్చింది. వెళ్లిపోయిన నాయకులు తిరిగి రావడం, ముఖ్యంగా బలమైన నాయకుల వెంట వెళ్లిపోయిన వారు కూడా వెనక్కి వచ్చేయడం వంటివి వైసిపిలో నూతన ఉత్తేజాన్ని తీసుకువచ్చాయి. ఈ క్రమంలోనే ఘర్ వాపసి మంత్రాన్ని పటించాలని నిర్ణయించుకున్నారు. వచ్చేవారికి అడ్డు చెప్పకూడదని, వారికి ఎప్పుడూ ఆహ్వానం పలకాలని తాజాగా తాడేపల్లి నిర్ణయించినట్లు తెలిసింది. మరి ఎంతమంది వస్తారు? ఏం జరుగుతుంది? అనేది చూడాలి.