సమయానికి తగిన విధంగా మాట్లాడాలి అనేది పెద్దలు చెప్పే మాట. అది రాజకీయాలైనా వ్యక్తిగతంగా అయినా వర్తిస్తుంది. అవకాశం అంది వచ్చినప్పుడు ప్రజల మధ్యకు వెళ్లడం, అలాంటిది లేకపోతే.. అవకాశం సృష్టించుకుని కూడా ప్రజల మధ్యకు వెళ్లడం అనేది రాజకీయాల్లో వినిపించే మాట. కనిపించే పరిస్థితి. గతంలో చంద్రబాబు `బాదుడే బాదుడు` పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు సృష్టించి ప్రజల్లోకి వచ్చారు. వాస్తవానికి అప్పటివరకు ప్రజల్లో అంత వ్యతిరేకత లేకపోయినా జగన్ పై వ్యతిరేకతను పెంచడంలో ఆ కార్యక్రమం బాగా వర్కౌట్ అయింది.
ఆ తర్వాత ఎన్నికల సమయానికి ప్రజల్లో అప్పుడప్పుడే మొదలైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యతిరేకతను చంద్రబాబు అందిపుచ్చుకుని అనుకూలంగా మార్చుకున్నారు. అంటే, రాజకీయాల్లో ఉన్నవారు తమకు అనుకూలంగా ఉన్న అంశాలను తమకు పనికొస్తాయి అన్న విషయాలను పసిగట్టి రాజకీయాల్లో దూకుడు పెంచుతారు. కానీ, వైసీపీ విషయానికి వచ్చేసరికి ఈ పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు, గడిచిన నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులు ఉద్యమాలు చేశారు, ఆందోళన నిర్వహించారు, తమ పింఛన్లు ఎత్తేస్తున్నారని తమ అన్యాయం చేస్తున్నారని చెబుతున్నారు.
రెండు దశాబ్దాలుగా పింఛన్లు తీసుకుంటున్న వారికి కూడా అర్నార్హులుగా ప్రకటించారని పేర్కొంటూ వారు ఆందోళనకు దిగారు. దీనిపై వైసీపీ పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, ఆ విషయాన్ని పక్కన పెట్టిన జగన్.. కేవలం ట్విట్టర్లకు మాత్రమే పరిమితం అయ్యారు. ఫలితంగా ప్రభుత్వం సృష్టించిన సమస్యను ప్రభుత్వమే పరిష్కరించుకున్న పరిస్థితి ఏర్పడింది తప్ప దీనిలో ప్రతిపక్షం పాత్ర ఎక్కడా కనిపించలేదు. దివ్యాంగులకు పింఛన్లు ఎత్తేస్తున్నామని ప్రకటించిన ప్రభుత్వం చివరికి వారి ఆందోళనతో వెనక్కి తగ్గి అసలు అలాంటి పరిస్థితి లేదని తేల్చేసింది.
దివ్యాంగులు అందరికీ పింఛన్లు ఇస్తామని తాజా ప్రకటన చేసింది. అంటే సమస్య సృష్టించిన ప్రభుత్వం తనంతట తానే పరిష్కరించుకుంది తప్ప దీనిలో విపక్షాల పాత్ర గాని ముఖ్యంగా వైసిపి అధినేత జగన్ పాత్ర గాని పెద్దగా ఏమీ లేదు. కేవలం ఇంట్లో కూర్చుని ట్విట్టర్లో ఒక పెద్ద సందేశం పెట్టి ఆయన వదిలేసారు. కానీ, ఇట్లాంటి వాటిని కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాష్ చేసుకోగలిగితే భవిష్యత్తులో వైసిపికి ప్రజల ఆదరణ లభిస్తుంది. ప్రస్తుతం ఎక్కడా కూడా వైసిపి తమకు అండగా నిలిచిందన్నమాట దివ్యాంగులు గాని అనర్హులైన పింఛన్‌దారులు గాని చెప్పడం లేదు. వారి సొంత ప్రయత్నమే ఫలించటం ఇక్కడ విశేషం.