వైసీపీ అధినేత జగన్ ఎక్కువగా బెంగళూరులో గడుపుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ ఓటమి పాలు అయిన తరువాత జగన్ తాడేపల్లి టూ బెంగళూర్ షటిల్ సర్వీస్ చేస్తున్నారు అని ప్రత్యర్ధి కూటమి పార్టీలు విమర్శలు చేస్తున్న సంగతి విధితమే. అయితే జగన్ ఈ విషయాల మీద ఎక్కడా రియాక్ట్ కాలేదు, ఆయన తన పని తాను చేసుకుని పోతున్నారు. అయితే జగన్ హైదరాబాద్ కి వెళ్ళడం అన్నది అయితే పెద్దగా జరగడం లేదు అని అంతా అంటారు.
జగన్ 2014 నుంచి 2019 దాకా ఏపీలో విపక్ష నేతగా ఉన్నారు. ఆయన ఆ సమయంలో హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చేవారు. నాడు కూడా జగన్ ని ఏపీకి టూరిస్టు పొలిటీషియన్ అని ప్రత్యర్ధులు విమర్శించేవారు. కేరాఫ్ లోటస్ పాండ్ అని కూడా అనేవారు. అయితే జగన్ 2017 నుంచి ఏకంగా ఏపీలోనే ఉంటూ భారీ పాదయాత్రను నిర్వహించారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చారు. అయితే 2024లో అధికారం పోయిన తరువాత మాత్రం జగన్ హైదరాబాద్ కి వెళ్ళడం లేదు. పైగా లోటస్ పాండ్ లో ఆయన చెల్లెలు షర్మిల ఉంటున్నారు అని ప్రచారంలో ఉంది.
ఇక జగన్ హైదరాబాద్ ఎందుకు వస్తున్నారు అంటే నాంపల్లిలోని సీబీఐ కోర్టులో హాజరయ్యేందుకు అని అంటున్నారు. జగన్ చాలా కాలంగా ప్రత్యక్ష విచారణకు హాజరు కావడం లేదు. ఈ నేపధ్యంలో ఈ శుక్రవారం 21 తేదీన జగన్ స్వయంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉందని అంటున్నారు. దాంతో జగన్ ఈ నెల 21న హైదరాబాద్కు రానున్నారు అని అంటున్నారు. ఆ రోజున ఉదయం 11: 30 గంటలకు నాంపల్లి సీబీఐ కోర్టుకి జగన్ వెళ్తారు అని తన కేసుకు సంబంధించి విచారణ సందర్భంగా హాజరవుతారు అని అంటున్నారు.
జగన్ మీద 2012లో ఆదాయం మించిన ఆస్తులు అన్న దానికి సంబంధించి సీబీఐ కేసు పెట్టింది. దీనికి సంబంధించి 11 చార్జిషీట్లు కూడా దాఖలు చేసింది. ఈడీ కూడా ఈ కేసులో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ కేసు దీర్ఘకాలంగా సాగుతూ వచ్చింది జగన్ 2017లో పాదయాత్ర చేస్తున్నా కూడా ప్రతీ శుక్రవారం క్రమం తప్పకుండా కోర్టుకు హాజరవుతూండేవారు. అయితే ఆయన 2019లో సీఎం అయ్యాక మాత్రం భద్రతాపరమైన కారణాలతో ప్రత్యక్ష హాజరుకు మినహాయింపు తీసుకున్నారు ఇక మాజీ సీఎం అయి పద్దెనిమిది నెలలు అయింది అయినా ఆయన ఇప్పటిదాకా నేరుగా కోర్టుకు రాలేదు, దాంతో ఆయన ఈసారి విచారణకు నేరుగా రావాలని సీబీఐ అధికారులు కోర్టులో వేసిన పిటిషన్ మీద కోర్టు ఆదేశించడంతో జగన్ వస్తున్నారు అని అంటున్నారు. నిజానికి ఈ నెల 14న జగన్ రావల్సి ఉండగా 21కి ఆయన కోరడంతో కోర్టు అంగీకరించింది అని చెబుతున్నారు. ఇక జగన్ చాలా కాలానికి హైదరాబాద్ వస్తున్న నేపధ్యంలో ఆయన కోర్టు పని తరువాత వెనక్కి బెంగళూరు వెళ్తారా లేక లోటస్ పాండ్ కి వెళ్ళి అక్కడ ఉన్న తల్లితో భేటీ అవుతారా అన్నది కూడా చూడాలని అంటున్నారు.

















