కథ కంచికి.. మనం ఇంటికి అంటే ఏ కథకైనా ఓ ముగింపు ఉంటుందని అర్థం.. కానీ, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మాత్రం కంచికి చేరడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హత్య జరిగి దాదాపు ఆరున్నర ఏళ్లు పూర్తయినా దర్యాప్తు సంస్థలు విచారణ ముగించకపోవడంతో నిందితులు తప్పించుకోడానికి మార్గం చూపుతున్నట్లు అవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హత్య కేసు విచారణను పూర్తి చేసి నిందితులను శిక్షించాలని హతుడి కుమార్తె వైఎస్ సునీత చాలా కాలం న్యాయపోరాటం చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లి అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నారు. కానీ, అసలు నిందితులు ఎవరో? ఇప్పటికే గుర్తించలేదని అంటున్నారు. దీంతో నిందితులను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయా? నిందితులకు అనుకూలంగా ఎవరు పనిచేస్తున్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యలతో వివేకా కేసుపై మళ్లీ చర్చ జరుగుతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగానే వివేకా హత్య జరిగింది. అయితే అప్పట్లో ఎన్నికలు ఉండటంతో ఈ కేసులో చంద్రబాబు ముందుకు వెళ్లలేకపోయారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడంతో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక ఏడాది క్రితం చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవడంతో వివేకా కేసు దర్యాప్తు కొలిక్కి వస్తుందని అంతా భావించారు. అయితే ఏడాది అయినా ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండటంతో కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా ఎవరైనా అడ్డుకుంటున్నారా? అనే అనుమానాలు ఎక్కువవుతున్నాయని అంటున్నారు.
వివేకా కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోడానికి వీలు లేకుండా పోయింది. అయితే గత ప్రభుత్వంలో సీబీఐకి సహకరించలేదన్న కారణంతో దర్యాప్తులో పురోగతి కనిపించలేదన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ప్రభుత్వం సీబీఐకి సహకరించే వీలున్నా, రాష్ట్ర ప్రభుత్వంలోని కీలకమైన టీడీపీ మద్దతుతో కేంద్రంలో బీజేపీ అధికారం చలాయిస్తున్నా, వివేకా కేసు దర్యాప్తునకు పుల్ స్టాప్ పడకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు.
అయితే, ఇటీవల తరచూ తన పర్యటనల్లో వివేకా కేసును ప్రస్తావిస్తున్న చంద్రబాబు.. అప్పట్లో తననే ఏమార్చారని, ఇప్పటికీ తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో వివేకా కేసులో నిందితులకు సహకరిస్తున్న వారిపై చంద్రబాబు పరోక్షంగా ఒత్తిడి చేస్తున్నారా? అని సందేహిస్తున్నారు. వివేకా కేసులో కీలక నిందితులు తన ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేలా వ్యవహరిస్తుండటాన్ని సీరియస్గా పరిగణిస్తున్న సీఎం.. కేసును కొలిక్కి తెచ్చి నిందితులను అరెస్టు చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు భావిస్తున్నారు.
ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ ను డైల్యూట్ చేయాలన్న రాజకీయ వ్యూహంతో ఆయనకు సహకరిస్తున్న కేంద్ర పెద్దలకు కూడా తాను వివేకా కేసును సీరియస్ గా తీసుకున్నట్లు సంకేతాలివ్వాలని సీఎం చంద్రబాబు పదేపదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నట్లు చెబుతున్నారు. వివేకా కేసును పరిష్కరించి నిందితులను అరెస్టు చేయిస్తానని సీఎం చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. వివేకా కుమార్తె సునీత కూడా చంద్రబాబు సీఎంగా బాధ్యతలు తీసుకున్న కొద్దిరోజులకే ఆయనను కలిశారు. అయితే ఏడాది అయినా ఎటువంటి పురోగతి లేకపోవడం, ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వానికి చికాకు తెప్పించేలా వ్యవహరిస్తుండటంతో జగన్ ను ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహంతో చంద్రబాబు మాజీ మంత్రి వివేకా హత్య కేసును మళ్లీ తెరపైకి తెస్తున్నారని అంటున్నారు. దీంతో ఇప్పటికైనా వివేకా కేసు కథ కంచికి చేరుతుందా? అని అంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.