ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇద్దరు సంతానం అనే సంగతి తెలిసిందే. అందులో ఒకరు విభజిత ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రస్తుతం మాజీగా ఉన్నారు. మరొకరు ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరిమధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. అది ఏ స్థాయిలో ఉందంటే అనే విషయంపై మరోసారి చర్చ మొదలైంది.
అవును… వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి అనే సంగతి తెలిసిందే. వాస్తవానికి 2019 వరకూ వీరిద్దరి మధ్య చాలా సన్నిహిత బంధమే ఉంది. రాఖీ పండక్కు ఎక్కడ ఉన్నా షర్మిల అన్న ముందు వాలిపోయేవారు! ఇక.. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ తరుపున షర్మిల ప్రచారానికి నాయకత్వం వహించారు.. అన్న జైల్లో ఉంటే ఆమె పాదయాత్ర చేశారు.
ఈ క్రమంలో 2019లో వైసీపీ 151 సీట్లు సాధించి రికార్డ్ విక్టరీ సాధించడంలో ఆమె పాత్రనూ చాలామంది పరిగణలోకి తీసుకుంటారు. కట్ చేస్తే.. సరస్వతి పవర్ ప్లాంట్, ఇతర ఆస్తుల పంపకాల విషయంలో అన్నాచెల్లి మధ్య సమస్యలు మొదలయ్యాయి! పెద్దమనుషులు, కుటుంబ సభ్యుల మధ్య సమిసిపోవాల్సిన సమస్య కాస్తా కోర్టు మెట్లు ఎక్కిన పరిస్థితి. దీంతో.. గ్యాప్ మరింత పెరిగింది!
ఈ ఉపోద్గాతమంతా ఎందుకంటే… డిసెంబర్ 17న షర్మిల తన పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు పలువురు రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. అయితే.. జగన్ నుంచి మాత్రం ఆమెకు విషెస్ అందలేదు.
ఇప్పుడు ఈ కారణంగానే వైఎస్సార్ సంతానం విషయంలో మరోసారి చర్చ తెరపైకి వచ్చింది. వాస్తవానికి షర్మిల పుట్టినరోజు సందర్భంగా ఆమెకు జగన్ శుభాకాంక్షలు తెలిపి చాలాకాలం అయ్యింది. అందుకు ఏమాత్రం తక్కువకాదు అన్నట్లుగా… జగన్ బర్త్ డేకి కానీ, రాఖీ పండక్కి గానీ షర్మిల నుంచి స్పందన లేని పరిస్థితి. దీంతో… వైఎస్సార్ బిడ్డలు మరీ ఇంతలా మారిపోయార అనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.
ఇది ఇలా ఉంటే..
ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా ఉన్న వైఎస్ షర్మిల.. రాష్ట్ర రాజకీయాల కంటే కూడా.. జాతీయ పాలిటిక్స్‌పై ఎక్కువగా దృష్టి పెడుతున్నారా? అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తోంది. గత రెండు నెలలుగా ఆమె జాతీయ రాజకీయాలను ప్రస్తావిస్తున్నారు. ఏపీ రాజకీయాల కంటే కూడా.. జాతీయ పాలిటిక్స్‌పైనే ఎక్కువగా స్పందిస్తున్నారు. మోడీ సహా బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. గత ఎన్నికల్లోనూ ఎంపీగా పోటీ చేసిన విషయం తెలిసిందే.
ఇక, వచ్చే ఎన్నికల నాటికి.. ఆమె స్థానాన్ని వేరే వారితో భర్తీ చేస్తే.. అప్పుడు పూర్తిస్థాయిలో జాతీయ రాజకీ యాలపై షర్మిల దృష్టి పెట్టే అవకాశం ఉందని పార్టీలో అంతర్గత చర్చ నడుస్తోంది. జాతీయ రాజకీయాల్లో షర్మిలకు ఈజీ ఉంటుందన్నది ఆమె భావన. ఏపీలో అయితే.. నాయకులను సమన్వయం చేయడం.. స్థానికంగా ఉన్న సమస్యలను ప్రస్తావించడం ద్వారా.. రాష్ట్రంలో పార్టీని పుంజుకునేలా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ.. జాతీయ రాజకీయాల్లో అధిష్టానమే అన్నీ చూసుకుంటుంది.
ఈ నేపథ్యంలోనే షర్మిల జాతీయ రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నారన్నది పరిశీలకులు కూడా చెబు తున్న మాట. నిజానికి షర్మిల ఏపీ విషయంలో విఫలమవుతున్నారు. పార్టీని ముందుకు నడిపించలేక పోతున్నారు. సీనియర్లను సమన్వయం చేయలేక పోతున్నారు. ఆమె వైఖరి సీనియర్లకు, సీనియర్ల వైఖరి ఆమెకు కూడా నచ్చడం లేదన్న వాదన గత ఏడాది నుంచి కూడా వినిపిస్తోంది. అదే కేంద్రంలో అయితే.. ఎవరితోనూ పెద్దగా పని ఉండదు. ఎవరినీ బుజ్జగించాల్సిన అవసరం కూడా ఉండదు.
పైగా జాతీయస్థాయిలో షర్మిలకు గుర్తింపు ఉంటుంది. దీంతోనే ఆమె వచ్చే ఎన్నికల నాటికి జాతీయ స్థాయిలో చక్రం తిప్పేలా ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు కూడా నాయకులు చెబుతున్నారు. ఎలానూ వచ్చే ఎన్నికల నాటికి ఆమెను మార్చడం ఖాయమని అంటున్న నేపథ్యంలో రాష్ట్రం కంటే ఢీల్లీ బెటరని.. దీని వల్ల తాను మరింత ఎలివేట్ కావొచ్చన్న ధీమాలోనూ షర్మిల ఉన్నారని అంటున్నారు. మరి దీనిపై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.











