ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మద్యం కుంభకోణం వణికిస్తున్న సంగతి తెలిసిందే. అధికార టీడీపీ కూటమి, విపక్ష వైసీపీ పార్టీల మధ్య ఈ అంశంపై మాటల యుద్ధం జరుగుతోంది. ప్రభుత్వం నియమించిన సిట్ అధికారులు.. అప్పటి వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారిని ఒక్కొక్కరిగా అరెస్ట్ చేస్తున్నారు. రేపో మాపో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కూడా సిట్ అరెస్ట్ చేస్తుందంటూ జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అనుచరుడు వెంకటేష్ నాయుడు ఇప్పుడు కీలకంగా మారాడు.
ఏ 34గా వెంకటేష్ నాయుడు
3500 కోట్ల లిక్కర్ స్కాంలో కీలక నిందితుల్లో ఒకడిగా సిట్ అధికారులు పేర్కొన్న సీహెచ్ వెంకటేష్ నాయుడిని ఎఫ్ఐఆర్‌లో ఏ34గా చేర్చారు. ఈ క్రమంలో ఈ కేసులో అతని ప్రమేయానికి సంబంధించి కీలక ఆధారం ఇటీవల బయటపడింది. ఓ ప్రాంతంలో దాచి ఉంచిన కరెన్సీ నోట్ల కట్టలను వెంకటేష్ లెక్కిస్తున్న వీడియో బయటపడింది. సదరు వీడియో ఓ గదిలో పలు వరుసలలో దాచి ఉంచిన 500 రూపాయలు, 100 రూపాయల కరెన్సీ కట్టలు గుట్టలుగా పేర్చి ఉన్నాయి. వీటిని లెక్క చెబుతుంటే మరో వ్యక్తి వాటిని అట్ట పెట్టెల్లో నింపుతున్నాడు.
వెంకటేష్ నాయుడు వీడియో వైరల్
వీడియోలోని వాయిస్‌ను బట్టి అది వెంకటేష్ నాయుడు గొంతేనని.. ఆ మొత్తం 5 కోట్ల వరకు ఉంటుందని సిట్ అధికారులు తేల్చారు. ఈ వీడియో నాలుగేళ్ల క్రితం నాటిదని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ డబ్బు ఎవరిది? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే దానిపై సిట్ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. లిక్కర్ స్కాంలో భాగంగా డిస్టలరీలు, పలు కంపెనీల నుంచి రాజ్ కసిరెడ్డి, అతని అనుచరులు ముడుపులు వసూలు చేసిన వాటిని హైదరాబాద్, తాడేపల్లిలోని పలు ప్రాంతాలకు చేర్చేదని సిట్ చెబుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని క్రిషి వ్యాలీ అపార్ట్‌మెంట్‌లోని తన నివాసాన్ని ఇందుకు అనువుగా మార్చినట్లు సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది.
ముడుపుల చేరవేతలో కీలకపాత్ర
హైదరాబాద్‌లోని ప్రముఖ రియల్టర్‌గా ఉన్న వెంకటేష్ నాయుడు.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. మద్యం కంపెనీల నుంచి వచ్చిన ముడుపులను భద్రపరిచి.. ఆయా మొత్తాలను వైసీపీ పెద్దలకు చెరవేయటంలో చెవిరెడ్డి, వెంకటేష్‌లు కీలక పాత్ర పోషించేవారని సిట్ గుర్తించింది. కేసు విచారణను సిట్ అధికారులు వేగవంతం చేయడంతో వీరిద్దరూ శ్రీలంక మీదుగా మాల్దీవులకు పారిపోయారని ప్లాన్ చేసినట్లుగా అభియోగాలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో జూన్ 18న బెంగళూరు విమానాశ్రయంలో భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.
తమన్నాతో క్లోజ్‌గా వెంకటేష్ నాయుడు
లిక్కర్ స్కాంలో కీలకంగా వ్యవహరించిన ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలతో వెంకటేష్ నాయుడుతో తరచుగా భేటీ అయినట్లుగా తేల్చారు. ఇక మాజీ సీఎం వైఎస్ జగన్‌కు కూడా వెంకటేష్ నాయుడిని పరిచయం చేశారు చెవిరెడ్డి. 2022లో తాడేపల్లి ప్యాలెస్‌లో జరిగిన సంక్రాంతి సంబరాలులో వెంకటేష్ కీలకపాత్ర పోషించినట్లు అధికారులు తేల్చారు. నాడు జగన్‌తో వెంకటేష్ కరచాలనం చేస్తున్న ఫోటోలు, వీడియోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
అలాంటి వెంకటేష్ నాయుడుతో స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఓ స్పెషల్ ఫ్లైట్‌లో తమన్నాతో వెంకటేష్ నాయుడు అత్యంత సన్నిహితంగా ఉన్నారు. 3500 కోట్ల లిక్కర్ స్కాంలో కీలక నిందితుడిని తమన్నా ఎందుకు కలిశారు? అసలు వాళ్లిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఏమైనా తేడా వస్తే తమన్నా కూడా కేసులో ఇరుక్కుంటుందని ఆమె అభిమానులు భయపడుతున్నారు.