దేవుడి మీద ఎవరి నమ్మకం వారిది. తమకున్న నమ్మకాన్ని.. అభిమానాన్ని ఒక్కో భక్తుడో ఒక్కోలా ప్రదర్శిస్తుంటాడు. హైదరాబాద్ కు చెందిన ఒక రిటైర్డ్ ఉద్యోగి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిపై తనకున్న భక్తిని ప్రదర్శిస్తూ.. ఎంతో ముచ్చటపడి కట్టించుకున్న సొంతింటిని కానుకగా ఇచ్చేసిన ఉదంతం ఆసక్తికరంగా మారింది. ఈ సొంతింటి విలువ అక్షరాల రూ.4 కోట్లు ఉండటం గమనార్హం.
హైదరాబాద్ లోని తిలక్ నగర్ లో ఉండే వెంకటేశ్వర్లు రిటైర్డు ఉద్యోగి. ఆయనకు 152 గజాల్లో జీప్లస్ 3 పెంట్ హౌస్ లో నిర్మించిన ఒక ఇల్లు ఉంది. దీన్ని తన ఇష్టదైవమైన యాదాద్రి లక్ష్మీ నరసింహుడికి బహుమతిగా ఇచ్చేశారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని తాజాగా పూర్తి చేశారు. స్వామివారికి కానుకగా తన సొంతింటిని ఇచ్చిన వెంకటేశ్వర్లను యాదాద్రి స్వామి దేవాలయానికి ఈవోగా వ్యవహరించే ఈవో వెంకట్రావు సన్మానించారు. దేవుడికి కానుకగా రూ.4 కోట్లకు పైనే విలువ ఉండే ఇంటిని బహుమతిగా ఇవ్వటం ఆలయ చరిత్రలో తక్కువసార్లు జరిగినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. స్వామి వారి భక్తుడి కానుక ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.