వన్య ప్రాణుల ప్రపంచం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ముఖ్యంగా పులుల ప్రవర్తనలో కనిపించే సహజ స్వభావం మనిషికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవల అలాంటి సంఘటనే తెలంగాణలో చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన ఓ మగ పులి తోడు కోసం ప్రాణహిత నదిని ఈదుకుంటూ సరిహద్దులు దాటి తెలంగాణలోకి అడుగుపెట్టింది.
ఈ పులి మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా కంహర్గావ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుంచి బయలుదేరి, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ టైగర్ కారిడార్ వరకు చేరింది. దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం ప్రయాణం సాగించింది.
భారతదేశంలో పులుల సంయోగ కాలం ప్రధానంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో మగ పులులు తమ పరిధిని దాటి జత కోసం విస్తారంగా ప్రయాణిస్తాయి. చాలా సందర్భాల్లో అవి అడవి మార్గాల గుండా తమ ప్రయాణాన్ని సాగిస్తాయి. అయితే, ఈ పులి మాత్రం నడవడం కాదు, ఏకంగా నది మార్గాన్నే ఎంచుకొని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రాణహిత నదిని దాటి, ఇట్యఖాల్ పహాడ్ అటవీ ప్రాంతం గుండా తెలంగాణలోకి అడుగుపెట్టింది. ఇది మహారాష్ట్ర రిజర్వ్‌ల నుంచి పులులు తరచుగా వచ్చే ప్రసిద్ధ ప్రవేశ మార్గంగా గుర్తింపు పొందింది.
ఫారెస్ట్ అధికారులు ఆ పులి కదలికలను నిరంతరం గమనిస్తున్నారు. పులులు తరచూ ప్రాణహితను దాటి వస్తుంటాయి. ముఖ్యంగా వసంతకాలం, సంయోగ కాలంలో ఆహారం, నీరు, జత కోసం కొత్త ప్రదేశాలకు వెళ్తాయి. కొంతకాలం ఆ ప్రదేశాల్లో గడిపి, తిరిగి తమ అసలు పరిధికి చేరుతుంటాయి. అయితే ఫారెస్ట్ అధికారులు ఎప్పటికప్పుడు కెమెరా ట్రాప్స్, ట్రాకింగ్ పద్ధతుల ద్వారా ఆ పులి కదలికలను పర్యవేక్షిస్తుంటారు.
ఈ సంఘటన ప్రకృతి సమతౌల్యాన్ని సూచించే ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. పులులు తమ జాతి కొనసాగింపు కోసం ఎంత దూరమైనా ప్రయాణించగలవని ఇది నిరూపించింది. సంరక్షణ కేంద్రాల మధ్య ఉన్న కారిడార్లు (ప్రాణహిత-కాగజ్‌నగర్ మార్గం వంటి) పులుల సంచారానికి జీవనాధారం. అలాంటి మార్గాలు భద్రంగా ఉండటం వలన వన్యప్రాణుల సంయోగం, వంశవృద్ధి కొనసాగుతాయి.
ప్రేమ కోసం లేదా సహజప్రేరణ కోసం పులి చేసిన ఈ ప్రయాణం కేవలం జంతు ప్రవర్తనగాక, పర్యావరణ పరిరక్షణలోని సున్నితమైన సమతౌల్యాన్ని గుర్తు చేస్తుంది. నదులు, అడవులు, జంతు కారిడార్‌లు అడ్డంకుల్లేకుండా ఉండటం, వన్యప్రాణుల మనుగడకు అవసరం.















