దేశవ్యాప్తంగా పులుల గణనకు అటవీ విభాగం సిద్ధమవుతోంది. ‘ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2025-26’ పేరుతో ప్రస్తుతం దేశంలో ఎన్ని పులులు ఉన్నాయో లెక్కకట్టనున్నారు.ఈ ఏడాది అంటే 2025 డిసెంబర్ నుంచి 2026 ఏప్రిల్ మధ్యన మూడు దశల్లో ఈ లెక్కింపు జరుగుతుందని అధికారులు వెల్లడించారు.నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్‌టీసీఏ) దేశవ్యాప్తంగా పులులను లెక్కిస్తుంది. దీనిలో వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా భాగమవుతుంది.
పెద్దపులులకు ఆవాసాలైన 16 రాష్ట్రాలతోపాటు మరికొన్నిఇతర రాష్ట్రాల్లోని అన్ని అడవుల్లో నాలుగేళ్లకోసారి ఈ గణన చేపడతారు. 2006 నుంచి పులుల లెక్కింపు జరుగుతోంది.ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ (ఏఐటీఈ) 2025-26 కోసం తెలంగాణ ‘ఎర్న్ యువర్ స్ట్రైప్స్’ ట్యాగ్‌లైన్‌తో వలంటీర్లకు ఆహ్వానం పలుకుతోంది. ఈ మేరకు విడుదల చేసింది తెలంగాణ అటవీ విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది.ఏఐటీఈ తొలి దశలో పాల్గొనబోయే వలంటీర్లు, సంబంధిత ఫారెస్ట్ బీట్లలో జంతు సంచార దారులలో వాటి లెక్కింపునకు అటవీ సిబ్బందికి సహకరించాల్సి ఉంటుంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్ షెడ్యూల్‌ను విడుదల చేసింది.
దీనికి నవంబర్ 4 నుంచి నవంబర్ 22 మధ్య రిజిస్టర్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ కోసం ఒక దరఖాస్తును కూడా జత చేసింది.ట్రాన్సెస్ట్ వాక్, ట్రయల్ వాక్‌లను 2026 జనవరి 17 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ( వైల్డ్‌లైఫ్) ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ వాక్‌లో పౌరులు, విద్యార్థులు, ఎన్‌జీవోలు, స్థానిక కమ్యూనిటీలు.. ఇలా ఎవరైనా వలంటీర్లుగా పాల్గొనవచ్చు.సంబంధిత అటవీ ప్రాంతాల్లో అటవీ సిబ్బందితో కలిసి వన్యప్రాణుల ఉనికికి సంబంధించిన సంకేతాలను, ఆధారాలను రికార్డు చేసేందుకు సహాయపడాలి.
వలంటీర్లు శిక్షణ పొందిన ఫ్రంట్‌లైన్ స్టాఫ్‌తో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. భిన్నమైన వాతావరణ పరిస్థితులు, అటవీ భూభాగంలో రోజుకు 10 నుంచి 12 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది.ఈ సమయంలో క్రమశిక్షణ, టీమ్‌వర్క్, భద్రతా విధానాలకు కట్టుబడి ఉండటం చాలా ముఖ్యమని తెలంగాణ అటవీ విభాగం విడుదల చేసిన ఆఫ్‌లైన్ అప్లికేషన్‌లో పేర్కొంది.దేశవ్యాప్తంగా పులుల జనాభా అంచనా, ఆవాస పర్యవేక్షణకు పునాది వేసే ఈ శాస్త్రీయ విధానానికి వలంటీర్లు కచ్చితమైన ఫీల్డ్ డేటాను అందించాలని, అటవీ చట్టాలకు, వన్య ప్రాణులకు గౌరవమివ్వాలని, అర్థవంతమైన సహకారాన్ని అందించాలని వలంటీర్లను ఆహ్వానించే ఫామ్‌లో పేర్కొంది.
డేటా రికార్డింగ్ కోసం M-STrIPES మొబైల్ యాప్‌ను ఎలా వాడాలో చెప్పడంతోపాటు ఫీల్డ్ ప్రొటోకాల్స్‌పై వలంటీర్లందరికీ శిక్షణ ఇస్తారు.‘ఈ లెక్కింపు కోసం మాకు 6 వేల మంది వలంటీర్లు అవసరం. ఎన్జీవోల సాయంతో ఎంపిక చేస్తాం. గతంలో పనిచేసిన వలంటీర్లకు టైగర్ సెల్ ప్రాధాన్యం ఇస్తుంది. ఎంపికైన వలంటీర్లకు శిక్షణ అందిస్తాం’’ అని అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్ సునీల్ హేరామత్ చెప్పారు.
”ఈ యాప్‌లోనే ఎప్పటికప్పుడు అటవీ సిబ్బందితో పాటు వలంటీర్లు సేకరించిన డేటానంతా యాడ్ చేయాలి. జంతువుల గుర్తులు, పులుల పాదముద్రలు, పులుల గుర్తులు, ఎక్కడ ఈ గుర్తులను గుర్తించారు అనే ప్రతి వివరాన్ని, ఏ సమయంలో గుర్తించారనే దాన్ని ఈ యాప్‌లో నమోదు చేయాలి” అని వన్యప్రాణుల కార్యకర్త, ఫారెస్ట్స్ అండ్ వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ (ఎఫ్‌ఏడబ్ల్యూపీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మీర్జా కరీమ్ బేగ్ చెప్పారు.
పాదముద్రలు ఏ ప్రాంతంలో, ఏ సమయంలో గుర్తించినదీ నమోదు చేసుకుంటారు. పాదముద్ర ఎన్ని సెంటీమీటర్ల మేర ఉందనే దాన్ని బట్టి పులి వయసును నిర్ణయిస్తారు.వాలంటీర్లు కచ్చితంగా 7 రోజుల గడువుకు కట్టుబడి ఉండాలి. మధ్యలో వెళ్లడానికి వీలు లేదు.
దీనిలో పాలుపంచుకునే వాలంటీర్లు సొంతంగా స్లీపింగ్ బ్యాగ్‌లు, ట్రెక్కింగ్ షూ తెచ్చుకోవాలి.
వసతి, ఆహారం, ఫీల్డ్ ట్రాన్స్‌పోర్టు మొత్తం అటవీ విభాగమే చూసుకుంటుంది.
వయసు 18 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి.అటవీ భూభాగంలో రోజుకు 10 నుంచి 12 కిలోమీటర్లు నడిచే సామర్థ్యం ఉండాలి.
కనీస సదుపాయాలతో మారుమూల క్యాంపులలో నివసించడానికి సిద్ధపడి ఉండాలి.మరింత సమాచారం కోసం : 18004255364, +914023231440 నెంబర్లను సంప్రదించాల్సిందిగా తెలంగాణ అటవీ విభాగం పేర్కొంటోంది.9803338666 పై వాట్సాప్ ద్వారా లేదా aite2026tg@gmail.com ఈమెయిల్‌పై సంప్రదించవచ్చని కూడా తెలిపింది.ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు-2023 ప్రకారం.. దేశవ్యాప్తంగా మొత్తం అడవులు, చెట్లు ఉన్న ప్రాంతం 8,27,357 చదరపు కిలోమీటర్లు.
పులుల లెక్కింపు కోసం భారత భూభాగంలో ఉన్న ఈ మొత్తం ప్రాంతాన్ని అధికారులు కవర్ చేయాలి. దానిలో అడవులున్న ప్రాంతం 7,15,343 చదరపు కిలోమీటర్లు కాగా, చెట్లు ఉన్న ప్రాంతం 1,12,014 చదరపు కిలోమీటర్లు.దేశవ్యాప్తంగా 58 టైగర్ రిజర్వులు ఉండగా.. కోర్ ఏరియా 46701.29 చదరపు కిలోమీటర్లలో, బఫర్ ఏరియా 37786.54 చదరపు కిలోమీటర్లలో ఉంది. మొత్తంగా టైగర్ రిజర్వులు 84,487.83 చదరపు కిలోమీటర్లలో ఉన్నాయి.పులులు నివాసం ఉండే ప్రధాన ప్రాంతాన్ని కోర్ ఏరియా అని, సంచరించే అవకాశమున్న ప్రాంతాన్ని బఫర్ ఏరియా అని వ్యవహరిస్తారు.ఈ రిజర్వుల్లో తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు, కవ్వాల్ టైగర్ రిజర్వు, ఏపీలోని నాగార్జున సాగర్ శ్రీశైలం రిజర్వు ప్రముఖమైనవి.
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో అత్యధిక ప్రాంతం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వచ్చింది. గుండ్ల బ్రహ్మేశ్వర అభయారణ్యం కూడా ఇందులో విలీనమైంది.ఏపీలోని కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలో నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది.అమ్రాబాద్ టైగర్ ప్రాజెక్ట్ నల్లమలలోనే ఉన్నప్పటికీ రాష్ట్ర విభజన తరువాత అది తెలంగాణలో భాగమైంది.
తెలంగాణలో 26 వేల చదరపు కిలోమీటర్లకు పైగా అటవీ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న 3000కు పైగా బీట్లలో పులుల సంఖ్యను లెక్కించాల్సి ఉంది.” సామాన్య ప్రజలకు ఇదొక మంచి అవకాశం. ఈ లెక్కింపులో పాల్గొన్నప్పుడు సబ్జెక్ట్ మీద అవగాహన ఏర్పడుతుంది. పులుల లెక్కింపు జరిగేటప్పుడు పరిమితులు, ఆంక్షలు ఉంటాయి. అటవీ విభాగం గ్రూప్‌లను తయారు చేస్తుంది. ఒక్కో ఫారెస్ట్ బీట్‌కు వారిని పంపుతుంది” అని మీర్జా కరీమ్ బేగ్ చెప్పారు.
”అటవీ ప్రాంతంలో ఈ లెక్కింపు ఎలా చేపట్టాలనే దానిపై ఒకటి లేదా రెండు రోజుల పాటు ఓరియెంటేషన్ జరుగుతుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదో ఆ శిక్షణలో వివరిస్తారు. రోజూ 10 నుంచి 15 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది కాబట్టి శారీరకంగా, మానసికంగా బలంగా ఉండటం ముఖ్యం. ఎప్పుడూ చురుకుగా ఉండాలి. అడవుల్లో గుట్టలు ఎక్కాల్సి ఉంటుంది, ఇసుకలో నడవాలి. చాలా కష్టంగా ఉంటుంది. వీటన్నింటికీ సిద్ధంగా ఉండాలి.
కాలేజీ విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైనా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. సబ్జెక్ట్ మీద వారికి ఒక కుతూహలం ఉండాలి. టైమ్ పాస్‌గా రాకూడదు. 2026 జనవరిలో ఇది మొదలవుతుంది. అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఈ లెక్కింపు చేపడతారు. ఎందుకంటే, జంతువులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలి వెళ్తూ ఉంటాయి, అందుకే లెక్కింపు ఒకేసారి చేస్తారు” అని తెలిపారు.”ఏ జంతువైనా ఎటువైపు నుంచైనా దాడి చేసే ప్రమాదం ఉంటుంది. కానీ, మంచి సూపర్‌వైజర్ ఉన్నప్పుడు వాటి బెడద నుంచి తప్పించుకోవచ్చు. అయితే పులుల లెక్కింపు చేసేటప్పుడు వన్యప్రాణుల దాడులు ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు” అని చెప్పారు.
















