పక్కపక్కనే కాదు.. ఒక విధంగా ఒకే శరీరానికి ఉండే రెండు చేతుల మాదిరి ఉండే ప్రాంతాల్ని రెండు జిల్లాలుగా ముక్కలు చేస్తే వచ్చే ఇబ్బందులన్న మాటకు నిలువెత్తు రూపంగా ఉంటుంది వరంగల్.. హన్మకొండజిల్లాల ముచ్చట. కేసీఆర్ హయాంలో భారీ ఎత్తున కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసిన క్రమంలో జంట నగరాలుగా ఉన్న ప్రాంతాన్ని రెండు జిల్లాలుగా మారుస్తూ తీసుకున్న నిర్ణయంతో విపరీతమైన గందరగోళంతో పాటు.. రోజువారీ అంశాలకు సైతం సమస్యగా మారిన దుస్థితి.
అదెంతలా అంటే.. వరంగల్ జిల్లా కలెక్టరేట్ తో పాటు ఇతర ముఖ్యమైన కార్యాలయాలన్నీ హన్మకొండలో ఉండగా.. వరంగల్ జిల్లా వాసులు కలెక్టర్ ను కలిసేందుకు పక్క జిల్లా అయిన హన్మకొండకు రావాల్సిన పరిస్థితి. అంతేకాదు.. వరంగల్.. హన్మకొండ జిల్లా కార్యాలయాలు సైతం పక్కపక్కనే ఉంటాయి. ఇలాంటప్పుడు రెండు జిల్లాల అవసరం ఏమిటి? ఈ ప్రశ్నల పరంపర అంతకంతకూ ఎక్కువ కావటమేకాదు.. కలిసి మెలిసి ఉన్న రెండు ప్రాంతాల్ని రెండు జిల్లాలుగా చేయటాన్ని పలువురు తప్పు పడుతున్న పరిస్థితి.
ఇలాంటి వేళ.. ఈ రెండు జిల్లాల్ని గతంలో మాదిరి.. ఒకే జిల్లాగా మార్చాలన్న డిమాండ్ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఈ మధ్యన నిరసనలు కూడా మొదలయ్యాయి. రెండు జిల్లాల్ని మళ్లీ కలపాలంటూ కాకతీయ వర్సిటీ ప్రొఫెసర్లు.. విద్యార్థులు.. విద్యావంతులు.. వివిధ పార్టీ నేతలు ఉద్యమానికి శ్రీకారం చుట్టటం తెలిసిందే. గులాబీ నేతలు తమ పదవులు.. వ్యాపారాల కోసం ఘన చరిత్ర ఉన్న వరంగల్ నగరాన్ని రెండుగా విభజించి.. డెవలప్ కాకుండా కుట్ర చేశారన్న ఆరోపణలతో తెలంగాణ ఉద్యమ వేదిక.. ఫోరం ఫర్ బెటర్ వరంగల్ ఆధ్వర్యంలో సదస్సులు.. చర్చా వేదికలు నిర్వహిస్తున్నారు. దీనికి పెద్ద ఎత్తున సానుకూల స్పందన వస్తుండటం గమనార్హం. రోజువారీ కార్యకలాపాల విషయంలోనూ ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దీంతో.. రెండు జిల్లాల్ని ఒకటి చేయాలన్న డిమాండ్ కు మద్దతు పెరుగుతోంది.
దీనికి తోడు ఎన్నికల ముందు వరంగల్.. హన్మకొండ జిల్లాల్ని ఒకటి చేస్తామని కాంగ్రెస్ చెప్పటం.. ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రెండేళ్లు అవుతున్నా.. ఇప్పటికి హామీని అమలు చేయని వైనంపై రేవంత్ ప్రభుత్వాన్ని పలువురు తప్పు పడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వరంగల్ జిల్లాలో హన్మకొండ జిల్లాని విలీనం చేయాలన్న డిమాండ్ ను మరింత తీవ్రం చేయాలని భావిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఆచితూచి అన్నట్లు వ్యవహరిస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం మాదిరి తాము సైతం తొందరపడి నిర్ణయం ప్రకటించకుండా.. ప్రజల మద్దతు పెద్ద ఎత్తున ఉన్న కారణంగానే రెండు జిల్లాల్ని ఒకటిగా చేయాలన్న నిర్ణయాన్ని ప్రకటించాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
చారిత్రాత్మక వరంగల్ జిల్లాను వరంగల్ అర్బన్.. వరంగల్ రూరల్.. మభబూబాబాబద్.. జయశంకర్ భూపాలపల్లి.. జనగామ జిల్లాగావిభజించటం తెలిసిందే. 2019 ఫిబ్రవరిలో భూపాలపల్లి జిల్లాలోని తొమ్మిది మండలాలతో రెవెన్యూ డివిజన్ గా ఉన్న ములుగును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయటంతో ఉమ్మడి వరంగల్ జిల్లా ఆరు ముక్కలైంది. వరంగల్ నగరాన్ని రెండు ముక్కలుగా చేయటంపై పలువురు తప్పు పట్టారు. దీనిపై చరిత్రకారులు అప్పట్లోనే తమ అభ్యంతరాల్ని వ్యక్తం చేసినా.. నాటి కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకున్నది లేదు. విపక్ష నేతగా ఉన్న వేళలో రేవంత్ రెడ్డి సైతం.. వరంగల్ జిల్లాను శాస్త్రీయంగా విభజన చేయలేదన్న వాదనను బలంగా వినిపించారు. ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో.. గతంలో ఆయన చెప్పినట్లే వరంగల్ రూరల్.. అర్బన్ జిల్లాల్ని ఒకటిగా చేయాలన్న డిమాండ్ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఈ వాదనకు బీఆర్ఎస్ మినహా మిగిలిన ప్రధాన రాజకీయ పక్షాలు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో.. రెండు జిల్లాలు ఒకటి అయ్యేలా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే వీలుందన్న మాట బలంగా వినిపిస్తోంది.