వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ చిన్నాన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో బిగ్ ట్విస్టు చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ ముగిసిందంటూ గతంలో కోర్టుకు నివేదించిన దర్యాప్తు సంస్థ సీబీఐ, హతుడి కుమార్తె వైఎస్ సునీత వినతి మేరకు దర్యాప్తు కొనసాగించేందుకు సముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ లోని సీబీఐ ప్రధాన కోర్టులో మెమో దాఖలు చేసింది.
సునీత అభ్యర్థనను తాము వ్యతిరేకించడం లేదని, కోర్టు అనుమతిస్తే దర్యాప్తు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే సునీత అభ్యర్థనను వ్యతిరేకిస్తూ ఏ3 నిందితుడు గజ్జల ఉమాశంకర్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మిగిలిన నిందితులు తమ వాదన వినిపించకపోవడంతో కౌంటర్లు దాఖలుచేయాలని న్యాయమూర్తి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. 2019 మార్చిలో మాజీ మంత్రి వివేకానందరెడ్డి తన సొంత ఇంట్లోనే హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును తొలుత పులివెందుల పోలీసులు దర్యాప్తు చేయగా, అనంతరం సిట్ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. ఆ తర్వాత హతుడి కుమార్తె వైఎస్ సునీత కోర్టుకు వెళ్లడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి కేసు బదిలీ అయింది.
కోర్టు సూచనల మేరకు మాజీ మంత్రి వివేకా హత్య కేసును విచారించిన సీబీఐ.. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డితోపాటు ఆయన తండ్రి భాస్కరరెడ్డి, వైసీపీ కడప జిల్లా నేత శివశంకర్ రెడ్డిని నిందితులుగా చేర్చింది. భాస్కరరెడ్డి, శివశంకర్ రెడ్డితోపాటు ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరుడైన ఉమా శంకర్ రెడ్డిని అరెస్టు చేసింది. అదేవిధంగా వివేకా పీఏ గంగిరెడ్డి, డ్రైవర్ దస్తగిరి (అప్రూవర్)తోపాటు సునీల్ యాదవ్ ను అరెస్టు చేసింది. అదేవిధంగా కోర్టులో రెండు అనుబంధ చార్జిషీట్లను దాఖలు చేసింది. ఈ సమయంలో దర్యాప్తు ముగిసినట్లు ప్రకటించింది. అయితే సీబీఐ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తన తండ్రి హత్య వెనుక బలమైన కుట్ర ఉందని, తన కుటుంబానికే చెందిన కొందరు ముఖ్యులకు హత్య విషయం ఆ రోజు వేకువజామునే తెలిసిందని ఆమె అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి మాజీ సీఎస్ అజేయ్ కల్లం వాంగ్మూలాన్ని సాక్ష్యంగా చూపుతున్నారు. అయితే సీబీఐ ఈ విషయంపై దర్యాప్తు చేయలేదని అంటున్నారు. అంతేకాకుండా హత్యతో మరికొందరికి సంబంధం ఉందని, సీబీఐ వారిపై దృష్టిపెట్టలేదని సునీత వాదిస్తున్నారు. తండ్రి హత్య కేసులో న్యాయం కోసం గత ప్రభుత్వంలో ఒంటరి పోరాటం చేసిన వైఎస్ సునీతకు.. ప్రస్తుత ప్రభుత్వంలో మంచి సహకారం లభిస్తోందని అంటున్నారు. అందుకే కేసు పునర్విచారణకు సీబీఐ సమ్మతించిందనే వాదన వినిపిస్తోంది. అయితే ఈ కేసులో నిందితులైన ఎంపీ అవినాశ్ రెడ్డితోపాటు మిగిలిన వారు కౌంటర్లు దాఖలు చేయనందున కోర్టు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ సునీతకు అనుకూలంగా నిర్ణయం వెలువరితే వైసీపీ పార్టీలో మరికొందరికి ఇబ్బందులు తప్పవనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తన చిన్నాన్న హత్య కేసుపై మాజీ సీఎం జగన్ తీసుకోబోయే నెక్ట్స్ స్టెప్ ఎలా ఉండబోతోందనే చర్చ జరుగుతోంది.
 
			



















