విశాఖ వంటి ప్రతిష్టాత్మకమైన జిల్లాకు అధికారంలో టీడీపీ వంటి పార్టీకి ప్రెసిడెంట్ అంటే ఆ హోదావే వేరు. ఆ లెక్కే కిక్కు ఇచ్చేలా ఉంటుంది. ఒక విధంగా మంత్రి పదవితో సమానంగానే ఉంటుంది. పైగా విశాఖ జిల్లాకు తరచూ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ సహా కీలక నేతలు వస్తూంటారు. అంతే కాదు టీడీపీకి కంచుకోట లాంటి సిటీ విశాఖ. అందుకే విశాఖ జిల్లా తెలుగుదేశం అధ్యక్ష పదవి కోసం పోటీ చాలా ఎక్కువగా ఉంది.
ఇక విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్ష పీఠం అనగానే రేసులో ఎక్కువ మందే కనిపిస్తున్నారు. విశాఖ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే ఆరు నియోజకవర్గాల నుంచి పోటీ యమ జోరుగా ఉంది. భీమునిపట్నం నుంచి దాదాపుగా అర డజన్ మంది దాకా పోటీ పడుతున్నారు. అందులో ఒక మహిళా కార్పోరేటర్ కూడా ఉన్నారు. ఆమెకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారని ఇపుడు టీడీపీ అధ్యక్ష పీఠం అయినా ఇస్తే బాగుంటుందని విద్యాధికురాలిగా న్యాయం చేస్తారు అని అంటున్నారు. అంతే కాదు విశాఖ జిల్లాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా ఆమె రికార్డు సృష్టించాలని చూస్తున్నారు.
మరో వైపు చూస్తే భీమిలీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వర్గం నుంచి కూడా పోటీ ఉంది. ఆయన ఆశీస్సులతో పీఠం ఎక్కాలని చూస్తున్నారు. ఇక కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఈ పదవి మీద కన్నేశారు అని అంటున్నారు విశాఖ జిల్లాకు ఎటూ మంత్రి పదవి ఇవ్వలేదని కాపుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ జిల్లాలో కీలక పదవిని వారికి ఇస్తే బాగుంటుంది అన్న చర్చ కూడా పార్టీలో సాగుతోంది అని అంటున్నారు.
మరో వైపు టీడీపీ స్థాపించాక రెడ్లు, కాపులు ఇతర సామాజిక వర్గాల నుంచి విశాఖ జిల్లా అధ్యక్ష పదవిని చేసిన వారు ఉన్నారు అని గుర్తు చేస్తున్నారు. కానీ కమ్మ సామాజిక వర్గానికి ఈ పదవి ఎపుడూ దక్కలేదని గుర్తు చేస్తున్నారు. విశాఖ నగరంలో ప్రభావంతమైన పాత్ర పోషిస్తూ టీడీపీ ఎదుగుదలలో తమ వంతు కృషిని చేసిన కమ్మలకు ఈసారి అవకాశం ఇవ్వాలని అంటున్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు సన్నిహిత బంధువు, కేలక నేతకు ఈ పదవిని ఇస్తే ఆయన బాగా నిర్వహిస్తారు అన్న చర్చ కూడా సాగుతోందిట.
ఇక చూస్తే విశాఖ నుంచి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా పల్లా శ్రీనివాసరావు యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు, అలాగే చూస్తే కనుక విశాఖ మేయర్ పదవిని గవర సామాజిక వర్గానికి ఇచ్చారు. నిన్నటిదాకా వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు ఈ పదవిని నిర్వహించారు. దాంతో పాటు విజయనగరం జిల్లా అధ్యక్ష పదవిని కాపులకు ఇస్తే శ్రీకాకుళం జిల్లా పదవిని కాళింగులకు ఇస్తే విశాఖ జిల్లా అధ్యక్ష పదవిని కమ్మలకు ఇస్తే సామాజిక సమీకరణలు సరిపోతాయని అనుకుంటే కీలక నేతలు ఈ పదవి దక్కే చాన్స్ ఉంది. అదే విధంగా మైనారిటీలు కూడా ఈ పదవి కోసం చూస్తున్నాయి కాబట్టి వారికి ఏమైనా అవకాశం ఇవ్వాలని అనుకుంటే మాత్రం నిర్ణయం మారుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.