శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన మాజీ ఇన్ చార్జి కోట వినుతకు బెయిలు మంజూరైంది. వ్యక్తిగత సహాయకుడు శ్రీనివాసులు హత్య కేసులో వినుత ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గత నెలలో వినుతను చెన్నై పోలీసులు అరెస్టు చేయగా, రెండు రోజుల క్రితం ఆమెకు షరతులతో కూడిన బెయిలు మంజూరైనట్లు ఆలస్యంగా వెలుగు చూసింది. గత నెల 7న వినుత అరెస్టు అయ్యారు. రెండు రోజుల క్రితం వరకు చెన్పై జైలులో రిమాండు ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో వినుత భర్త చంద్రబాబుతోపాటు మొత్తం 5 గురిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వినుత ఒక్కరికే బెయిలు మంజూరైనట్లు తెలుస్తోంది.
హత్యోదంతం వెలుగు చూసిన వెంటనే వినుతను జనసేన పార్టీ బహిష్కరించింది. వినుత వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన శ్రీనివాసులు అలియాస్ రాయుడు గత నెల 7న హత్యకు గురయ్యారు. అతడిని రేణిగుంటలో హతమార్చి, శవాన్ని చెన్నై తీసుకువెళ్లి ఓ కాలువలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. చెన్నైలో రాయుడు శవం బయట పడిన తర్వాత సీసీ కెమెరా పుటేజ్ ఆధారంగా అక్కడి పోలీసులు తీగలాగారు. దీంతో రాయుడు హత్య వెలుగుచూసింది.
ఈ కేసులో వినుత భర్త చంద్రబాబు ఏ1 కాగా, హత్యకు సహకరించిన షేక్ తాసర్ ఏ2గా పోలీసులు గుర్తించారు. ఇక వినుతను ఈ కేసులో ఏ3గా పేర్కొన్నారు. ఏ4గా శివకుమార్, ఏ5గా గోపిని నిర్ధారించారు. ప్రస్తుతం ఈ కేసులో వినుతకు మాత్రమే బెయిలు మంజూరైనట్లు చెబుతున్నారు. షరతులతో కూడిన బెయిలు కావడంతో నిందితురాలు వినుత ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు సీ3 సెవెన్ వెల్స్ పోలీసుస్టేషనులో సంతకాలు చేస్తున్నారు.