భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు (Indian Vice Presidential Elections) ఈసారి ఎన్నికల సమరాన్ని తలపిస్తున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షాలు తమ తమ అభ్యర్థులతో బరిలోకి దిగాయి. ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను అధికార కూటమి ప్రకటించింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆయన పాలిటిక్స్‌లో అనుభవంగా ఉన్నారు.ఇండియా బ్లాక్ తరఫున జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి బరిలోకి దిగారు. తెలంగాణకు చెందిన ఆయనకు న్యాయరంగంలో పెద్ద అనుభవం ఉంది.ఎన్డీయే గెలుపు ఖాయమన్న లెక్కలు కనిపిస్తున్నా… ఇది సాధారణ ఎన్నికలా మారింది. ఇండియా కూటమి వ్యూహాత్మకంగా అభ్యర్థిని ప్రకటించింది.
మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోకుండానే జగధీప్ ధంఖర్ మాజీ అయిపోయారు. ఆయన ఆరోగ్య కారణాల వల్లనే తన పదవికి రాజీనామా చేశారు అని లేఖలో పేర్కొన్నారు. అయితే వెనక ఏముందో అన్నది విపక్షాల అనుమానం. ఇదిలా ఉంటే ఉప రాష్ట్రపతి పదవికి అనుకోకుండా వచ్చిన ఎన్నికలు ఇవి. దాంతో ఈసారి గెలిచిన వారి పదవీ కాలం జగదీప్ ధంఖర్ మిగిల్చిన రెండేళ్ళు మాత్రమే ఉంటుందా లేక అయిదేళ్ళు ఉంటుందా అన్నది ఒక చర్చగా ముందుకు వస్తోంది.
తాజాగా జరుగుతున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఎ కూటమి తరఫున సీపీ రాధాక్రిష్ణన్ అభ్యర్ధిగా ఉన్నారు. ఆయన మహారాష్ట్ర గవర్నర్ గా ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఇక ఇండియా కూటమి తరఫున న్యాయ కోవిదుడు అయిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ ఇద్దరి మధ్యమే పోటీ నెలకొని ఉంది. ఇందులో ఎవరు గెలిచినా ఫుల్ టెర్మ్ పదవిలో కొనసాగుతారు అని అంటున్నారు. నిజానికి మధ్యలో వచ్చిన ఎన్నికలు కాబట్టి రెండేళ్ళ కాలానికే అని అంతా భావిస్తున్నారు. కానీ అయిదేళ్ళ పాటు పదవీ కాలం కోసమే ఉప రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహిస్తున్నారు అని అంటున్నారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67 ప్రకారం భారత ఉపరాష్ట్రపతి ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగాలని పేర్కొన్నారు. అదే విధంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 68లోని 2వ నిబంధన ప్రకారం చూస్తే కనుక ఉప రాష్ట్రపతి మరణం, రాజీనామా లేదా తొలగింపు లేదా ఇతర కారణాల వల్ల ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి ఎన్నికలు వీలైనంత త్వరగా నిర్వహిస్తారు. ఆ విధంగానే జగదీప్ ధంఖర్ రాజీనామా తరువాత ఎన్నికల నోటిఫికేషన్ ని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దాని ప్రకారం సెప్టెంబర్ 9న ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.
ఇదీ ఎన్నిక జరిగే విధానం :
రాష్ట్రపతిని దేశంలోని అన్ని అసెంబ్లీలకు చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్నుకుంటారు. అయితే ఉప రాష్ట్రపతిని రాజ్యసభ, లోక్‌సభ లతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఎన్నుకుంటారు. అదే విధంగా ఎగువ సభకు నామినేట్ చేయబడిన సభ్యులు కూడా ఎన్నికల ప్రక్రియలో ఓటు వేయడానికి అర్హులుగా ఉంటారు. ఇక చూస్తే కనుక రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరుగుతుంది. అభ్యర్థి భారత పౌరుడై ఉండాలి, కనీసం 35 సంవత్సరాల వయస్సు ఉండాలి, రాజ్యసభకు ఎన్నిక కావడానికి అర్హత కలిగి ఉండాలి, లాభాపేక్ష కలిగిన ఎలాంటి పదవిని కలిగి ఉండకూడదు వంటి నిబంధనలు ఈ పదవికి విధించారు.
రాష్ట్రపతికి వేరుగా :
దీనిని బట్టి చూస్తే ఎవరు ఉప రాష్ట్రపతిగా నెగ్గినా అయిదేళ్ళ పాటు ఈ పదవిలో కొనసాగుతారు. అంటే తిరిగి ఎన్నికలు 2030లో జరుగుతాయన్న మాట. అదే సమయంలో రాష్ట్రపతి ఎన్నికలు 2027లో జరుగుతాయి. ఇప్పటిదాకా రాష్ట్రపతి ఎన్నికలు ఒకే ఏడాది జరిగేవి. జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు జరిగితే ఆగస్టులో ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతూండేవి. ఇపుడు మాత్రం వేరు వేరుగా జరుగుతాయని అంటున్నారు.