ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి.. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల 9న ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఎలాంటి పోటీ లేకపోతే.. పోలింగ్ ఉండదని కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే.. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పోటీ అని వార్యంగా కనిపిస్తోం ది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి.. తమ తరఫున అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తోంది. దాదాపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకే ఈ టికెట్ లభించే అవకాశం కూడా ఉందని అంటున్నారు.
ఇదిలావుంటే.. అధికార ఎన్డీయే కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే ప్రక్రియ పుంజు కుంది. గురువారం ఢిల్లీలో భేటీ అయిన ఎన్డీయే పక్ష సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్ప గించారు. వీరు ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు. ఇది ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయమని నడ్డా పేర్కొన్నారు. ఇదిలా వుంటే, ప్రస్తుతం ఢిల్లీవర్గాల్లో జరుగుతున్న చర్చను బట్టి.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి పై ప్రధాని మోడీ ఒక అంచనాకు వచ్చారని సమాచారం.
ప్రస్తుతం కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా ను ఈ పదవికి ఎంపిక చేసేఅవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఢిల్లీ మీడియా కథనాలు కూడా.. దీనిపై చర్చ పెడుతున్నాయి. ప్రస్తుతం కేంద్రంలో హోం శాఖ మంత్రిగా పనిచేసిన వారిలో అమిత్‌షా కొత్త రికార్డును నెలకొల్పారు. ఎల్ కే అద్వానీ తర్వాత.. సుదీర్ఘ కాలం పనిచేసిన హోం మంత్రిగా షా రికార్డును సొంతం చేసుకున్నారు. వ్యూహాత్మక చతురతతోపాటు.. ప్రధాని మోడీ మనసు తెలిసిన, గెలిచిన నాయకుడిగా కూడా షా పేరు తెచ్చుకున్నారు.
గుజరాత్‌లో పాలన సాగించినప్పుడు కూడా అమిత్ షా హోం మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఉపరాష్ట్రపతి పదవిని అప్పగించడం ద్వారా.. వచ్చే నాలుగేళ్లపాటు.. కేంద్రం తెచ్చే బిల్లులకు రాజ్యసభలో ఆమోదం పొందడంతో పాటు.. బలమైన రాజ్యాంగ శక్తిని నియమించినట్టుగా ఉంటుందని కూడా భావిస్తున్నారు. ఇక, హోం మంత్రి స్థానంలో నడ్డాకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని కూడా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. అధికారికంగా మాత్రం ఇంకా ఎవరి పేరు పరిశీలనలో లేదు.
కానీ, ప్రస్తుతం ఉన్న లెక్కలు, అంచనాల ప్రకారం.. షా అయితే కరెక్ట్ అనే మాట వినిపిస్తోంది. గతంలో వెంకయ్య నాయుడిని కూడా.. కేంద్రమంత్రి గా ఉన్న సమయంలోనే ఉపరాష్ట్రపతిగా చేశారు. ఆయన కూడా మోడీ మనసెరిగి వ్యవహరించారు. ఇప్పుడు కూడా అదే ఫార్ములాను అమలు చేసే అవకాశం ఉందన్న చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం.