దేశానికి కొత్త ఉప రాష్ట్రపతి ఎవరు. ఇది అందరిలో మెదులుతున్న ప్రశ్న. దాదాపుగా నెల రోజులుగా ఇదే విషయం మీద చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. అనేక రకాలైన పేర్లు తెర మీదకు వస్తున్నాయి. అయితే ఏదీ కన్ ఫర్మ్ కాదు, ఏదీ రూఢీగా కూడా చెప్పడం లేదు. ఇక చూస్తే కనుక గత నెల 21న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఆ రోజున రాజ్యసభకు చైర్మన్ హోదాలో హాజరైన జగదీప్ ధంఖర్ అదే రోజు రాత్రి పొద్దు పోయిన తరువాత తొమ్మిది గంటల సమయంలో తన పదవికీ రాజీనామా ప్రకటిస్తూ ఆ లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నేరుగా పంపించారు. దాంతో ఉరమని ఉరుములా పిడుగులా ఈ వార్త దేశమంతటా దావానలంగా వ్యాపించింది.
దాదాపుగా మూదేళ్ళ పాటు జగదీప్ ధన్ ఖర్ ఈ పదవిలో కొనసాగారు. మరో రెండేళ్ల పదవీ కాలం మిగిలి ఉంది. ఇంతలోనే ఆయన రాజీనామా చేశారు. అయితే అనారోగ్య కారణాలతోనే తాను ఈ పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా జగదీప్ ధన్ ఖర్ ప్రకటించారు. ఇక ఆయన వారసుడిగా ఎవరు వస్తారు రాజ్యసభకు కొత్త చైర్మన్ ఎవరు అవుతారు అన్నది నాటి నుంచి చర్చగా ఉంది. బీజేపీ నుంచి వస్తార లేక మిత్రుల పార్టీల నుంచి వస్తారా అన్నది కూడా మరో చర్చగా ఉంది. అయితే ఈ చర్చలకు సస్పెన్స్ కి ఫుల్ స్టాప్ పెడుతూ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరో చెప్పేయబోతోంది.
బీజేపీలో అత్యున్నత విభాగం అయిన పార్లమెంటరీ బోర్డులో ఉప రాష్ట్రపతికి సంబంధించిన అభ్యర్ధి ఎంపిక మీద నిర్ణయం తీసుకోబోతోంది. అంటే నేడు ఆదివారం బోర్డు సమావేశం అవుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే ఈ బోర్డ్ మీటింగులో కొత్త ఉప రాష్ట్రపతి ఎవరు అన్నది నిర్ణయిస్తారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రధాని మోడీ ఉప రాష్ట్రపతి అభ్యర్ధిని ఎంపిక చేయాలని ఎన్డీయే మిత్ర పక్షాలు అధికారం అప్పగించాయి. దాంతో ఎండీయే తరఫున ఎవరు ఉప రాష్ట్రపతి అభ్యర్ధి అవుతారో అన్నది కొద్ది గంటలలో తెలియాల్సి ఉంది.
ఉప రాష్ట్రపతి పదవి కోసం చాలా పేర్లు పరిశీలనలో ఉన్నాయని అంటున్నారు. బీహార్ నుంచే జేడీయూ తరఫున హరి వంశ నారాయణ్ సింగ్ కి చాన్స్ ఇస్తారు అని అంటున్నారు. ఆయన ఇపుడు రాజ్యసభ డిప్యూటీ చైర్ పర్సన్ గా ఉన్నారు. 2020 నుంచి ఆయన ఆ పదవిలో ఉన్నారు. రాజ్యసభను సమర్ధంతా నడపడంతో ఆయన అనుభవం సంపాదించారు. అలాగే అదే రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత కేంద్ర మంత్రి ఒకరికి ఈ పదవి దక్కే సూచనలు ఉన్నాయి. దక్షిణాది వారికే ఇస్తే కనుక బండారు దత్తాత్రేయ పేరు ప్రముఖంగా వినిస్తోంది.
ఆయన రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా చాలా కాలం పనిచేసారు. బీసీ నాయకుడు తెలంగాణా వాసి కావడంతో ఆ సమీకరణలు కూడా చూస్తారని అంటున్నారు. ఏపీ నుంచి చూస్తే ప్రస్తుత గవర్నర్ అబ్దుల్ నజీర్ పేరు కూడా ఉంది. ఆయన మైనారిటీ కావడంతో పాటు పూర్వాశ్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్గిగా ఉన్నారు. ఇక వీరితో పాటు అనేక పేర్లు కూడా తెర వెనక ఉన్నారని అంటున్నారు. మొత్తం మీద నలుగుతూన్న పేర్లు కాకుండా అనూహ్యమైన వారి పేర్లు కూడా పరిశీలించి వారిలో ఒకరికి ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించి గెలిపించుకునేందుకు ఎన్డీయే చూస్తుందని చెబుతున్నారు. చూడాలి ఎన్డీయే తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరో.