భారతీయ సంస్కృతిలో ప్రతి వస్తువు, ప్రతి స్థలానికి ప్రత్యేకత ఉంది. ఇక గోడ గడియారం విషయంలోనూ కొన్ని వాస్తు నియమాలు ఉన్నాయి. వేదాలలో ప్రస్తావించబడిన వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో గడియారం ఉంచే స్థానం ఎంత ముఖ్యమో చాలామందికి తెలియదు. ఇంట్లో ఉండే గడియారం మన జీవితంలో సమయాన్ని మాత్రమే కాదు… శ్రేయస్సు, సంపద, ఆరోగ్యాన్నీ ప్రభావితం చేస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
వాస్తు ప్రకారం, గడియారం తూర్పు గోడపై లేదా ఉత్తర దిశలో ఉండాలి. ఈ దిశలు శుభఫలితాల నిచ్చేవిగా పరిగణించబడతాయి. ముఖ్యంగా తూర్పు దిశ భగవంతుడి కిరణాలు (సూర్యోదయం) వచ్చే దిశ కావడంతో, అక్కడ గడియారం ఉంచితే సమయం సరైన దిశలో నడుస్తుందని నమ్మకం. ఉత్తర దిశలో ఉంచిన గడియారం ఇంట్లో శ్రేయస్సుని, ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావడంలో సహాయపడుతుందని చెబుతుందంటారు.
ఇక ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే… గడియారం ఎప్పుడూ పనిచేస్తుండాలి. ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంచినట్లయితే, సమయపు ప్రతికూలతలు మనపై ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, పాడైపోయిన, విరిగిపోయిన గడియారాన్ని వెంటనే తొలగించాలి. అది దురదృష్టానికి సంకేతమని, ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి కారణమవుతుందని చెబుతారు.
తలుపుల పైన గడియారాలు పెట్టకూడదు. ముఖ్యంగా ఇంటి ప్రధాన తలుపు మీద గడియారం ఉండకూడదని వాస్తు చెబుతుంది. ఇది ఇంట్లో శుభప్రవేశాన్ని అడ్డుకుంటుందని, శాంతి శ్రేయస్సులను దూరం చేస్తుందని భావన. అదేవిధంగా, దక్షిణ, పడమర దిశలలో గడియారం ఉంచడం వలన శత్రుశక్తులు, ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. (గమనిక: ఇవన్నీ పురాణాలు, సంప్రదాయాల ఆధారంగా వాస్తు నిపుణులు centuries గా పాటిస్తోన్న సూచనలు మాత్రమే. అయితే మత విశ్వాసాలపై ఆధారపడి ఉండే ఈ సూచనలు శాస్త్రీయ ప్రమాణాలతో నిరూపితమైనవి కావని గమనించాలి.