వంగవీటి రంగా రాజకీయ వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన రాధాకృష్ణ గెలిచి ఎమ్మెల్యేగా చట్ట సభలలో అడుగు పెట్టింది మాత్రం ఒకే ఒక్క సారి. అదే 2004 ఎన్నికల్లో. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత మరో రెండు సార్లు పోటీ చేసినా ఓటమి పాలు అయ్యారు. అయితే ఆయన రెండు దశాబ్దాల రాజకీయ జీవితం చిత్ర విచిత్రంగా సాగింది అని విశ్లేషిస్తున్నారు.
రాంగ్ రూట్లో జంప్ :
ఇక చూస్తే కనుక రాధాకృష్ణ 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దలు చెప్పినా వినకుండా ప్రజారాజ్యం పార్టీలోకి జంప్ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తే ఓటమిని మూట కట్టుకోవాల్సి వచ్చింది. అదే కాంగ్రెస్ లో ఉంటే గెలిస్తే అధికార పార్టీలో ఉండడమే కాదు సామాజిక రాజకీయ సమీకరణలు కలసి వచ్చి ఆనాడే మంత్రి అయి ఉండేవరు కదా అని కూడా చర్చగా ఎపుడూ వస్తుంది. ఇక 2014 నాటికి ఆయన వైసీపీలోకి మారి మరోసారి పోటీ చేసి ఓడారు. ఆ సమయంలో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అలా మరో అయిదేళ్ళ పాటు విపక్షంలో ఉండాల్సి వచ్చింది. 2019లో చూస్తే వైసీపీ నుంచి టీడీపీలోకి మారారు. కానీ వైసీపీ అధికారంలోకి రావడంతో మళ్ళీ విపక్ష సావాసం చేయాల్సి వచ్చిందని అనుచరులు చింతిస్తూంటారు.
ఫస్ట్ టైం అలా అయినా :
ఇక 2024లో మరోసారి రాంగ్ స్టెప్ మాత్రం రాధాక్రిష్ణ వేయలేదని అంటారు. ఆయనకు వైసీపీ నుంచి ఆహ్వానం వచ్చినా చేరలేదు. గాడ్ గ్రేస్ అని అభిమానులు ఇపుడు అదే తలచుకుంటారు. లేకపోతే మరో అయిదేళ్ళు కలిపి ఇరవయ్యేళ్ళ పాటు విపక్ష పార్టీలతోనే రాజకీయం పూర్తి అయ్యేదని అంటారు. ఇక టీడీపీ అధికారంలోకి వచ్చింది. రాధాకు తగిన పదవి ఇస్తామని చెప్పారు అది కూడా ఎమ్మెల్సీ అని అన్నారు. కానీ ఏణ్ణర్ధానికి దగ్గర పడుతోంది కానీ ఏ పదవీ దక్కలేదు చిక్కలేదు అని అభిమానులు బాధపడుతూంటారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ పదవులు చాలా వరకూ భర్తీ చేసినా రాధాకు చాన్స్ మాత్రం దక్కలేదు అని గుర్తు చేస్తున్నారు.
అపుడే చాన్స్ అంటూ :
ఇక రాధాకు ఏ పదవీ లేకపోవడం తమకు బాధగా ఉందని అనుచరులు అంటున్నారు. కానీ ఏపీలో చూస్తే సమీప భవిష్యత్తులో ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయితే లావు. 2027లో మాత్రం భారీ ఎత్తున ఖాళీ కాబోతున్నాయని అంటున్నారు. దాంతో అప్పటిదాకా ఎదురు చూపులు తప్పవని అంటున్నారు. అపుడు తమ నాయకుడికి ఎమ్మెల్సీ ఇస్తారని మాత్రం వారు ఎంతో ఆశగా ఉన్నారు. అయితే ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా రెండేళ్ళకే ఎన్నికలు కూడా వస్తాయి కాబట్టి ఎన్నికల హడావుడిలో ఏమంత తీరిగ్గా పదవిని అనుభవించడం జరుగుతుందన్న చింత కూడా ఉందిట. ఏది ఏమైనా తమ నేతకు పదవి దక్కితే అదే పదివేలు అని వారు అంటున్నారు. దాంతో కేలెండర్ వైపు అలా చూస్తే ఎపుడు 2027 వస్తుందా అని లెక్క బెట్టుకుంటోంది రాధా అనుచరగణం. సో ఆల్ ది బెస్ట్ అని వంగవీటికి చెబుతూనే ఎక్కాల్సిన పదవుల రైలు జీవిత కాలం లేటు అని వేడి నిట్టూర్పులు విడుస్తున్నారు.