వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో భక్తుల సందడి నెలకొంది. ఈ పవిత్ర రోజున తిరుమల లోని శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునేందుకు రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి, గురుమూర్తి, రఘునందన్ రావు తో పాటు ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, చింతమనేని ప్రభాకర్ ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.క్రీడా రంగం నుంచి భారత క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వేకువజామునే తిరుమలకు చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు.సినీ రంగం నుంచి ప్రముఖ నటులు రాజేంద్రప్రసాద్, శ్రీలీల, శివాజీ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవడం అత్యంత ఆనందంగా ఉందని పలువురు ప్రముఖులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు వైకుంఠ ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకున్నారు.సినీ లోకం నుంచి మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, నటుడు బాలకృష్ణ సతీమణి వసుంధర, అలాగే నటుడు నారా రోహిత్ దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.వీఐపీల రాకతో పాటు సాధారణ భక్తుల తాకిడి కూడా అధికంగా ఉండటంతో టీటీడీ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. క్యూలైన్లు, దర్శన వేళలు, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టింది.వైకుంఠ ద్వారం గుండా శ్రీవారి దర్శనం చేయడం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని, మోక్ష మార్గానికి సంకేతంగా నిలిచిందని పలువురు భక్తులు పేర్కొన్నారు.
ఓం నమో నారాయణాయ! 🙏
TTD












