అసెంబ్లీ సమావేశాల విరామ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చాంబర్ లో శుక్రవారం కేబినెట్ భేటీ నిర్వహించారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన 13 ముఖ్యమైన బిల్లులపై చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇందులో వచ్చేనెల 1 నుంచి అమలులోకి రానున్న వాహనమిత్ర పథకంపైనా చర్చ జరిగింది. ఆటోడ్రైవర్లకు ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయం చేసే బిల్లును ఆమోదించిన మంత్రివర్గం శాసనసభలో ప్రవేశపెట్టేందుకు ఓకే చెప్పింది. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న ఈ 13 బిల్లులలో కొన్ని అత్యంత కీలక నిర్ణయాలు ఉన్నాయి.
నాలా ఫీజును రద్దు చేసిన ప్రభుత్వం, కొత్తగా ల్యాండ్ డెవలప్మెంట్ చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించింది. పారిశ్రామికావృద్ధికి ఆటంకం లేకుండా తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రివర్గంలో చర్చ జరిగింది. అదేవిధంగా ఆగస్టు 31లోగా అర్బన్, లోకల్ బాడీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీ సీఆర్డీఏ, రాజధాని ఏరియా మినమాయించి అనథరైజ్ గా నిర్మించిన భవనాలకు పినలైజేషన్ విధించిందే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది.
అదేవిధంగా క్రిష్ణా జిల్లాలోని తాడిగడప మున్సిపాలిటీ పేరులో వైఎస్సార్ పేరును తొలగించేందుకు కేబినెట్ ఆమోదించింది. విజయవాడ నగరానికి ఆనుకుని ఉన్న తాడిగడప మున్సిపాలిటీని గత ప్రభుత్వంలో ఏర్పాటు చేయగా, ఈ ప్రాంతానికి సంబంధం లేని వైఎస్సార్ పేరు పెట్టడంపై స్థానికుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. దీంతో వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీని ఇకపై తాడిగడప మున్సిపాలిటీగానే వ్యవహరించాలని కేబినెట్ తీర్మానించింది.
రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్ద ప్రాజెక్టుల అమలుకు ప్రత్యేక వాహక నౌకలను ఏర్పాటు చేస్తూ మంత్రిమండలి నిర్ణయించింది. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955, ఏపీ మున్సిపాల్టీ యాక్ట్ 1965 లకు ప్రజాప్రాతినిధ్య చట్టం 1950ను అనుసరించి ఓటర్ల జాబితా తయారీకి మరో మూడు తేదీలను ఖరారు చేసే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదించింది. అదేవిధంగా రాజధాని అమరావతి పరిధిలో గతంలో 343 ఎకరాల సేకరణకు ఇచ్చిన నోటిఫికేషన్ వెనక్కితీసుకుంటూ మరో తీర్మానం ఆమోదించింది.
లిఫ్ట్ పాలసీ కింద చిన్న సంస్థల ఏర్పాటుకు భూ కేటాయింపులపై చర్చించి ఆమోదించారు. పంచాయతీరాజ్ శాఖలో పలు భూములకు అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ కు సంబంధించి చేసిన ప్రతిపాదనలకు కేబినెట్ లో ఆమోదముద్ర పడింది. ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ బిల్ 2025లో పలు సవరణలు చేస్తూ చేసిన ప్రతిపాదనలను ఆమోదించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో సభ ముందుకు తీసుకువచ్చే పలు బిల్లులకు కూడా మంత్రిమండలిలో ఆమోదముద్ర పడింది.