రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తోన్నారు. రెండు రోజుల పాటు ఆయన వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎయిర్ పోర్ట్ లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు స్వాగతం పలికారు. ఇది చాలా అరుదు. ప్రధాని నేరుగా విమానాశ్రయానికి వెళ్లి అతిథిని ఆహ్వానించడం అనేది అతి కొద్ది సందర్భాల్లో మాత్రమే చోటు చేసుకుంటుంది.
ఈ క్రమంలో- ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి, పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి రష్యా పౌరులకు కేంద్రం అద్దిరిపోయే ఆఫర్ ఇచ్చింది. వారికి ఉచిత ఈ-వీసా సౌకర్యాన్ని ప్రకటించింది. వారి నుంచి ఒక్క రూపాయి కూడా ఫీజు రూపంలో వసూలు చేయరు. ఢిల్లీ హైదరాబాద్ హౌస్ లో ప్రధాని మోదీ, వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన వ్యూహాత్మక చర్చల అనంతరం ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. ఇది ఇరు దేశాల మధ్య పర్యాటక రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.
ఢిల్లీలో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధాని మోదీ ఈ వీసా పథకం వివరాలను వెల్లడించారు. రష్యన్ పౌరుల కోసం ఈ-టూరిస్ట్ వీసాలు, గ్రూప్ టూరిస్ట్ వీసాల సేవలను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ వీసా దరఖాస్తులను ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా 30 రోజులలోపు ప్రాసెస్ చేస్తారని స్పష్టం చేశారు. ఈ వీసా సేవలన్నీ కూడా ఉచితంగా లభిస్తాయని అన్నారు.
జాయింట్ ప్రెస్ మీట్ సందర్భంగా ఇరు దేశాలు ‘విజన్ 2030’ డాక్యుమెంట్ ను కూడా ఆవిష్కరించాయి. ఇది దీర్ఘకాలికంగా ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించడానికి, వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత రంగాల్లో సంపూర్ణ సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి వ్యూహాత్మక రోడ్‌మ్యాప్ గా ఉపయోగపడుతుందని మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందం కొత్త వ్యాపార అవకాశాలను సృష్టిస్తుందని, తద్వారా ఇరు దేశాలు భారత్-రష్యా బిజినెస్ ఫోరంలో భాగస్వామ్యం అవుతాయని తెలిపారు.
ఆర్థిక సహకారాన్ని మరింత పెంపొందించడానికి విజన్ 2030 డాక్యుమెంట్ పై సంతకం చేశామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. యూరేషియన్ ఎకనామిక్ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కూడా సాకారం చేసుకోవడానికి అంగీకరించామని అన్నారు. ఈ సందర్భంగా పుతిన్ దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటనతో ఇరు దేశాల ద్వైపాక్షిక అజెండాను మరింత బలోపేతమౌతుందని చెప్పారు. తమ మధ్య బంధం మరింత బలపడిందని పేర్కొన్నారు.















