సాధారణంగా రోడ్లపై అడ్డదిడ్డంగా కరెంట్ తీగలు, విద్యుత్ స్తంభాలు కనిపిస్తూ ఉంటాయి. వాటికి కేబుల్ వైర్లు, ఇళ్లు, అపార్టు మెంట్ల మధ్యలోంచి కేబుల్ వైర్లు లాగుతారు. వీటికి కరెంట్ పాస్ అయి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక వర్షాకాలంలో అయితే ఈ విద్యుత్ తీగలు, విద్యుత్ స్తంభాల కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు నగరాల్లోని వీధుల్లో ఒక్కడ చూసినా విద్యుత్ స్తంభాలకు భయంకరంగా వేలాడుతున్న కరెంట్ తీగలు కనిపిస్తుంటాయి. ఇళ్లు, అపార్టు మెంట్ల మధ్యలోంచి వాటికి ఆనుకునేలా కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్లు లైన్లను వేశారు. ఇక రోడ్డు పక్కనే ట్రాన్స్ ఫార్మర్లు ఉంటాయి. ఈ క్రమంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సహా పలు ప్రాంతాల్లో భూగర్భంలో విద్యుత్ తీగలను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా చేయడంపై దృష్టి పెట్టారు. తాజాగా ఈ వ్యవస్థను జిల్లా కేంద్రాల్లోనూ అమలు పరిచేందుకు అధికార యంత్రాంగం సిద్ధం అవుతోంది. జిల్లా కేంద్రాల్లో భూగర్భ విద్యుత్తు వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు తొలుత నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో 12 కిలోమీటర్ల మేర భూగర్భ విద్యుత్తు వ్యవస్థను ఏర్పాటు చేయనుంది.
రాష్ట్రంలోని ఒక్కో జిల్లా కేంద్రంలో 6 కిలోమీటర్ల మేర భూగర్భ విద్యుత్తు వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు తొలుత నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో మొత్తంగా 12 కిలోమీటర్ల మేర భూగర్భ విద్యుత్తు వ్యవస్థలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భూగర్భ విద్యుత్తు వ్యవస్థను ఎప్పటి నుంచి అమలు చేస్తారనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.