తురకపాలెం.. ఈ ఊరు పేరు కొద్ది రోజుల క్రితం ఎవరికి పెద్దగా పరిచయం లేదు. అలాంటి ఈ ఊరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. కేవలం ఐదు నెలల స్వల్ప వ్యవధిలో గ్రామంలోని దళితవాడలో చోటుచేసుకుంటున్న ఆకస్మిక మరణాలు ఇప్పుడు మిస్టరీగా మారుతున్నాయన్న మాట వినిపిస్తోంది. ఇంతకూ ఈ తురకపాలెం ఎక్కడ ఉంటుంది? అన్న విషయంలోకి వెళితే. గుంటూరు జిల్లా.. గుంటూరు నగరానికి అనుకొని ఉండే రూరల్ మండలంలోనే తురకపాలెం ఒకటి. తురకపాలెం ఊళ్లోని దళితవాడలో అకాల మరణాలు పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్నాయి.
జిల్లా కలెక్టర్ లెక్కల ప్రకారం చూస్తే.. 29మంది మరణించినట్లుగా చెబుతున్నా.. వాస్తవంలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. జులై.. ఆగస్టు నెలల్లో మరణాలు ఎక్కువగా ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. కుర్రాళ్ల నుంచి పెద్ద వయస్కుల వరకు వీళ్లు.. వాళ్లు అన్న తేడా లేకుండా అకాల మరణాల బారిన పడటం మిస్టరీగా మారింది. ఈ వ్యవహారంపై స్పందించిన ఏపీ ప్రభుత్వం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి.. పరీక్షలు జరుపుతున్నారు.
తురకపాలెం ఇష్యూను ఏపీ ముఖ్యమంత్రి కాస్తా ఆలస్యంగానే స్పందించినట్లుగా చెప్పక తప్పదు. అయితే.. ఆలస్యంగా స్పందంచినప్పటికీ.. తీవ్రత అంతకంతకూ పెరుగుతున్న వేళలో స్పష్టమైన ఆదేశాల్ని జారీ చేశారు. ప్రస్తుత పరిస్థితిని ఆరోగ్య అత్యవసరంగా పరిగణించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. గ్రామంలో అందరికి 42 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి.. అనుమానితులపై లోతైన అధ్యయనం చేయాలని కోరారు.
వారం రోజుల్లో వ్యాధిని గుర్తించాలన్న సీఎం చంద్రబాబు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఊళ్లో ఎవరూ వంట చేయొద్దని.. గ్రామంలోని ఆహారం కానీ.. నీళ్లను కానీ ఎవరూ వాడొద్దని చంద్రబాబు కీలక సూచన చేశారు. గ్రామస్తులకు అవసరమైన మూడు పూటల ఆహారాన్ని అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఇంతకూ తురకపాలెం దళితవాడలో మరణిస్తున్న వారి ఉదంతాల్ని చూస్తే.. ఏదో ఒక కొత్త ఎలిమెంట్ ఈ దారుణ పరిస్థితికి కారణమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరణించిన వారందరిలోనూ ఒక కామన్ పాయింట్ ఏమంటే.. అనారోగ్యం బారిన పడినోళ్లు ఊళ్లోని ఆసుపత్రికి వెళ్లటం.. అక్కడి ట్రీట్ మెంట్ తీసుకోవటం.. ఆ తర్వాత ఆరోగ్యం మరింత విషమించటం.. ఆపై చనిపోవటం లాంటివి చోటు చేసుకుంటున్నాయి. వారానికి ఇద్దరు.. ముగ్గురు మరణిస్తుండటం గమనార్హం. గడిచిన రెండు నెలల నుంచి ఊళ్లో అంతా జ్వరాలతో బాధ పడుతున్నట్లు చెబుతున్నారు. తురకపాలెంలో మొత్తం 230 ఇళ్లు.. వెయ్యికి పైగా దళిత జనాభా ఉంది. ఎస్సీకాలనీలో వీధికి ఒకరు చొప్పున అనారోగ్యం బారిన పడటం గమనార్హం.
తురకపాలెం ఉదంతాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. మీడియాలో వస్తున్న అకాల మరణాలపై స్పందించిన ప్రభుత్వం ఇటీవల ఊళ్లోని చర్చిలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఆరోగ్య మంత్రి మొదలు ఆరోగ్య శాఖ కమిషనర్.. జిల్లా కలెక్టర్..వివిధ శాఖల అధికారులు ఆ ఊరిని సందర్శిస్తున్నారు. రక్త నమూనాల్ని సేకరించటం.. ఈ ఊరికి ప్రత్యేకంగా ఒక యాప్ ను సిద్ధం చేశారు. ఊళ్లో వారందరి ఆరోగ్య వివరాల్ని నమోదు చేస్తున్నారు. ఊళ్లో అకాల మరణాలకు కారణం ఏమిటి? గ్రామస్తులు ఎందుకు ఆసుపత్రుల బారిన పడుతున్నారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేస్తున్నారు.
తాగునీరు కలుషితం కావటం వల్ల అని కొందరు అంటుంటే.. మరికొందరు మద్యానికి విపరీతంగా బానిస అయ్యారని చెబుతున్నారు. ఒకవేళ అలా ఉంటే.. ఊళ్లోని 5600 కుటుంబాల మీదా ప్రభావం చూపాలి తప్పించి.. కొంతమంది వ్యక్తుల మీదనే ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది? అన్నది ప్రశ్నగా మారింది.బాధితులకు నిర్వహించిన రక్త పరీక్షల్లో వైద్యులు కొత్త విషయాన్ని గుర్తించారు. బాధితులకు మెలియాయిడోసిస్ సోకినట్లుగా చెబుతున్నారు. బర్ఖోల్డేరియా సూడోమాలీ అనే బ్యాక్టీరియా ద్వారా వచ్చే ప్రమాదకర ఇన్ఫెక్షన్ గా చెబుతున్నారు. బ్లడ్ కల్చర్ ద్వారా దీన్ని గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ బ్యాక్టీరియా షుగర్.. లివర్.. కిడ్నీకి సంబంధించి దీర్ఘాలిక వ్యాధులు ఉన్న వారి మీద ప్రభావం ఎక్కువగా చూపుతుందని చెబుతున్నారు. అయితే.. ఈ వాదనకు మరో ఇబ్బంది ఉంది. అదేమంటే.. 29 మంది బ్లడ్ శాంపిల్స్ లో మెలియాయిడోసిస్ గా ఎవరికి తేల్లేదని చెప్పటంతో.. ఇష్యూ మళ్లీ మొదటికి వచ్చినట్లైంది. ఏమైనా.. ఈ మిస్టరీ మరణాలకు గుట్టు రట్టు కావాల్సిన అవసరం ఉంది.