సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష కొద్ది రోజుల్లో వార్తలు నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో వివాహం కాని హీరోయిన్‌ల జాబితాలో త్రిష ఒకరు కాగా.. ఆమె పెళ్లి ఎప్పుడు హాట్ టాపిక్ గా ఉంటుంది. త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
చంఢీగఢ్ కు చెందిన వ్యాపారవేత్తతతో త్రిష పెళ్లి ఫిక్స్ అయిందని.. ఇటీవల తల్లిదండ్రులు చూసిన ఈ సంబంధానికి ఆమె ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. రెండు కుటుంబాలకు చాలా ఏళ్లుగా పరిచయం ఉండటంతో, పెద్దల అంగీకారంతో ఈ బంధం ముందుకు సాగుతోందని ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఇప్పుడు త్రిష ఘాటుగా స్పందించారు.
ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ పెట్టిన త్రిష.. తన కోసం తన జీవితాన్ని ప్లాన్ చేస్తున్న వాళ్లను తాను ఎప్పుడూ ప్రేమిస్తానని తెలిపారు. ఇప్పుడు హనీమూన్ షెడ్యూల్ కూడా చెబుతారేమోనని వేచి చూస్తున్నా అంటూ సెటైరికల్ గా మాట్లాడారు. ప్రస్తుతం త్రిష పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. దాని ద్వారా పెళ్లి చేసుకోవట్లేదని చెప్పకనే చెప్పారు. అయితే 2015లో త్రిషకు వ్యాపారవేత్త వరుణ్ మణియన్ తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే అది పెళ్లి వరకు కూడా వెళ్లలేదు. కొన్ని కారణాల వల్ల ఇరువురు ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. అందుకు పెళ్లి తర్వాత నటనను కొనసాగించే విషయంపైనే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తి ఎంగేజ్మెంట్ రద్దు చేసినట్లు టాక్ వచ్చింది.
ఆ తర్వాత మళ్లీ కెరీర్‌పై దృష్టి పెట్టిన త్రిష వరుసగా సినిమాలు చేస్తూ వచ్చారు. వయసు 42 దాటినా త్రిష అదే గ్లామర్, గ్రేస్ తో దూసుకుపోతున్నారు. వరుస అవకాశాలు అందుకుంటున్నారు. షూటింగ్స్ తో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కరుప్పుతో పాటు మరిన్ని సినిమాలు చేస్తున్నారు. దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ విశ్వంభరలో చిరంజీవితోపాటు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆర్ జె బాలాజీ దర్శకత్వం వహిస్తున్న నటుడు సూర్య కరుప్పు చిత్రంలో కూడా లీడ్ రోల్ లో నటిస్తున్నారు. రెండు సినిమాలతో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరిన్ని చిత్రాలను ఇప్పుడు లైన్ లో పెడుతున్నారు.
















