మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉంటున్నారు. ఆయనది దాదాపుగా యాభై ఏళ్ల సినీ జీవితం. ఇక లెజెండరీ పర్సనాలిటీ. ఆయన రాజకీయాల్లోకి వచ్చి కేంద్ర మంత్రిగా అయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా ఆరేళ్ళ పాటు వ్యవహరించారు. ప్రస్తుతం తన మానాన తాను సినిమాలు చేసుకుంటున్నారు. ఆయన మీద బాలయ్య అసెంబ్లీ వేదికగా చేసిన సెటైర్లతో ఆయన మనస్తాపం చెందారని అంటున్నారు. అందుకే వెంటనే ఆయన ఒక లేఖ విదేశాల నుంచి విడుదల చేయాల్సి వచ్చింది. అందులో పూర్తి సమాచారం కూడా ఆయన రాసి మరీ మీడియాకు వదిలారు.
మెగాస్టార్ గా అందరి మన్ననలు అందుకుని తెలుగు ఇండస్ట్రీకి బ్యాక్ బోన్ గా ఉన్న చిరంజీవిని పట్టుకుని బాలయ్య మాట తూలుతూంటే ఆయన జనసేన పార్టీ మంత్రులు అసెంబ్లీలో ఉన్నారు. ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా ఎవరూ ఒక్క మాట కూడా అనకపోవడం మీద వైసీపీ ప్రశ్నిస్తోంది వారు అన్నారని కాదు కానీ ఎవరైనా జనసేన ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చి ఇది తప్పు అని అనలేకపోతోంది ఎందుకు ఇలా అన్న చర్చకు తెర లేస్తోంది. ప్రజారాజ్యం కొనసాగింపే జనసేన అని ఒక సందర్భంలో మెగాస్టార్ గొప్పగా చెప్పుకుని పార్టీని ఓన్ చేసుకున్నారు . కానీ ఈ సంఘటనలో మాత్రం జనసేన నుంచి సైలెన్స్ తప్ప మరేమీ దక్కలేదని అంటున్నారు. అందుకే మెగాస్టార్ తానుగానే లేఖ రాయాల్సి వచ్చింది అని గుర్తు చేస్తున్నారు.
మరో వైపు చూస్తే బాలయ్య విషయం అలాగే ఉంది అని అంటున్నారు ఆయన తప్పుగా మాట్లాడారా లేక ఆవేశంతో మాట తూలారా అన్నది పక్కన పెడితే టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు కుమారుడు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే, సీఎం కి బావమరిది, మరో కీలక మంత్రికి మామ అయినా కూడా ఆయనకు సైతం పార్టీ నుంచి తగిన మద్దతు దక్కలేదని గుర్తు చేస్తున్నారు. బాలయ్య జగన్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో లేదో వైసీపీ గట్టిగానే తగులుకుంటోంది. రెండు రోజులుగా బాలయ్యను పట్టుకుని టార్గెట్ చేస్తోంది. దిష్టి బొమ్మలు తగలబెడుతోంది. ఆయనని మెంటల్ అంటోంది. ఇంకా నానా రకాలుగా విమర్శిస్తోంది.
ఇంత చేసినా కూడా టీడీపీ నుంచి కనీసంగా కూడా ఆయనకు మద్దతు దక్కడం లేదు. బహుశా బాలయ్య చేసిన వ్యాఖ్యల ఘాటు ఆ స్థాయిలో ఉందని దూరంగా ఉంటున్నారేమో అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే బాలయ్య కెలికి ఒంటరి అయ్యారు. మెగాస్టార్ అనవసరంగా వివాదంలోకి బాలయ్య లాగబట్టి మనస్తాపానికి గురి అయ్యారు. మెగాస్టార్ కి ఇపుడు ఆయన ఫ్యాన్స్ అండగా నిలబడి బాలయ్యను క్షమాపణకు డిమాండ్ చేస్తూంటే వైసీపీ నేతలు కూడా జగన్ కి క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు. చూడబోతే బాలయ్య అన్ని వైపుల నుంచి కార్నర్ అయ్యేలా ఉన్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.