టీటీడీ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. భక్తుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే అమలు చేస్తున్న పలు కొత్త విధానాల ద్వారా పెద్ద సంఖ్యలో భక్తులు తక్కువ సమయంలోనే శ్రీవారిని దర్శించుకుంటున్నారు. వసతి గదుల విషయంలోనూ టీటీడీ నిబంధనలు అమలు చేస్తోంది. ఇక, తాజాగా శ్రీవాణి కోటా టికెట్ల తో పాటుగా దర్శనం విషయం లోనూ కొత్త విధానం అమల్లోకి తెస్తోంది. భక్తుల వెసులుబాటు కోసం ఈ తాజా నిర్ణయాలను అమలు చేసేందుకు సిద్దమైంది.
టీటీడీ శ్రీవాణి దర్శనం విషయంలో సుదీర్ఘ కసరత్తు చేసింది. ఇప్పటికే శ్రీవాణి దర్శనం టికెట్ల జారీ కేంద్రాన్నిఅదనపు ఈవో కార్యాలయం వెనుక నుంచి అన్నమయ్య భవన్ ఎదురుగా ఉన్న భవనంలోకి మారుస్తున్నారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా శ్రీవాణి దర్శనం టికెట్ల జారీ కేంద్రాన్ని అదనపు ఈవో కార్యాలయం వెనుక తాత్కాలికంగా జర్మన్ షెడ్లలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు దానిని శాశ్వతంగా అన్నమయ్య భవన్ ఎదురుగా ఉన్న భవనంలోకి మారుస్తున్నారు. కొత్త టికెట్ల జారీ కేంద్రంలో క్యూలైన్లు, ఫర్నీచర్ ఏర్పాటు చేశారు. ఇక, ఇప్పుడు శ్రీవాణి టిక్కెట్ల కోసం భక్తుల నుంచి భారీగా డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో టికెట్ల కోటాను పెంచాలని టీటీడీ నిర్ణయించింది.
తాజా నిర్ణయం మేరకు 1500 టిక్కెట్ల కోటాను 2వేల టికెట్లకు పెంచాలని డిసైడ్ అయిది. అదే విధంగా ఇకపై ప్రతి రోజు కరెంటు బుకింగ్ కోటా క్రింద తిరుమలలో 2వేల టిక్కెట్లు, రేణిగుంట విమానాశ్రయంలో 400 టిక్కెట్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో శ్రీవాణి దర్శన సమయంలో కూడా టీటీడీ మార్పులు చేసింది. ప్రస్తుతం ఉదయం శ్రీవాణి టికెట్స్ కలిగిన భక్తులను దర్శనానికి అనుమతిస్తుండగా ఇకపై సాయంత్రం దర్శనానికి కూడా అనుమత ఇవ్వాలని డిసైడ్ అయింది. దీని ద్వారా గదులకు నెలకొని ఉన్న డిమాండ్ తగ్గుతోందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. శ్రీవాణి టికెట్ల జారీ సమయంలో కూడా మార్పులు చేసింది టీటీడీ. ఇకపై టికెట్ పొందిన నాటి సాయంత్రమే భక్తుడు వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లేలా టీటీడీ మార్పులు అమలు చేయనుంది.