‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ రివ్యూ నటీనటులు: రష్మిక మందన్నా- దీక్షిత్ శెట్టి- అను ఇమ్మాన్యుయెల్- రావు రమేష్- రాహుల్ రవీంద్రన్- రోహిణి- తదితరులు సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహద్ నేపథ్య సంగీతం: ప్రశాంత్ విహారి ఛాయాగ్రహణం: కృష్ణన్ వసంత్ నిర్మాతలు: ధీరజ్ మొగిలినేని- విద్య కొప్పినీడి రచన- దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్ ఓవైపు కథానాయికగా బహు భాషల్లో పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ.. హిట్లు కొడుతూనే.. ఇంకోవైపు మెయిన్ లీడ్ గా ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి ప్రయోగాత్మక సినిమా చేసింది రష్మిక మందన్నా. నటుడు రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈ రోజే మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ అంచనాలను ఆ సినిమా ఏమేర అందుకుందో చూద్దాం. కథ: భూమా(రష్మిక) హైదరాబాదులోని ఓ కాలేజీలో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ కోర్సులో చేరుతుంది. అదే కాలేజీలో విక్రమ్ (దీక్షిత్ శెట్టి) ఎమ్మెస్సీ కంప్యూటర్స్ చదువుతుంటాడు. అతణ్ని దుర్గ (అను ఇమ్మాన్యుయేల్) ఇష్టపడుతుంది. కానీ దీక్షిత్.. భూమాతో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె వెంట తిరిగి తనూ ప్రేమలో పడేలా చేస్తాడు. ఒక రకమైన అయోమయ స్థితిలో విక్రమ్ తో రిలేషన్షిప్ లోకి వెళ్తుంది భూమా. కానీ ప్రేమలో పడ్డాక విక్రమ్ పెట్టే కండిషన్లు.. తన ప్రవర్తనతో భూమా ఇబ్బంది పడుతుంది. మరి విక్రమ్ తో భూమా నిజంగానే ప్రేమలో పడిందా.. ఈ బంధం ఏమేర నిలబడింది.. చివరికి వీళ్లిద్దరి జీవితాలు ఏ మలుపు తీసుకున్నాయి.. అన్నది మిగతా కథ. కథనం- విశ్లేషణ: ది గర్ల్ ఫ్రెండ్ ఒక సినిమా కాదు.. ఒక డిస్కషన్. నిజంగా ప్రేమలో పడడం కాకుండా.. నేను ప్రేమలో పడ్డాను అనే భ్రమలో ఒక రిలేషన్షిప్ లోకి వెళ్లిన అమ్మాయి.. అందులో ఎలా ఉక్కిరి బిక్కిరి అయింది.. దాన్నుంచి బయటికి రావడానికి ఏం చేసిందనే కాన్సెప్ట్ తో రాహుల్ రవీంద్రన్ సమాజానికి.. ముఖ్యంగా అమ్మాయిలకు ఒక బలమైన మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాడిందులో. రాహుల్ కు బేసిగ్గా ఉన్న ఇమేజ్ దృష్ట్యా అతనొక సైడ్ తీసుకుని ఈ కథను నరేట్ చేయడం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావచ్చు. మగాళ్లందరినీ ఒక గాటన కట్టి ఇలా ప్రెజెంట్ చేశాడనే అభ్యంతరాలు వ్యక్తం కావచ్చు. కానీ ఈ సినిమా తీసిన అతనూ ఒక మగాడే అని ఆలోచించి ఈ కథను సానుకూల ధోరణితో చూస్తే ‘ది గర్ల్ ఫ్రెండ్’ బలమైన ఇంపాక్టే చూపిస్తుంది. కథనం కొంచెం ఎగుడుదిగుడుగా సాగినా.. కొన్ని సీన్లు అందరికీ రుచించకపోయినా.. రాహుల్ చెప్పాలనుకున్న పాయింట్ మాత్రం ప్రేక్షకుల హృదయాలను బలంగా తాకుతుంది. కొన్ని లోపాలున్నప్పటికీ ప్లాట్ పాయింట్.. పెర్ఫామెన్సులు ‘ది గర్ల్ ఫ్రెండ్’ను ప్రత్యేకంగా నిలబెడతాయి. టాక్సిక్ రిలేషన్‌షిప్స్ మనిషిని ఎంతగా వేదనకు గురి చేస్తాయో చెప్పే చిత్రం.. ది గర్ల్ ఫ్రెండ్. ఐతే ఈ పాయింటును దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కొంచెం సమతూకంతో డీల్ చేయాల్సింది. కానీ అతను ఒక సైడ్ తీసుకుని ఈ కథను నరేట్ చేశాడు. ఈ క్రమంలో కొన్ని సన్నివేశాల్లో ఓవర్ ద బోర్డ్ వెళ్లిపోయాడు అనిపిస్తుంది. ఆ సందర్భాల్లో కొందరికి చిర్రెత్తుకురావచ్చు కూడా. కానీ తాను చెప్పాలనుకున్న విషయాన్ని అతను చాలా బలంగా చెప్పాడన్నది మాత్రం వాస్తవం. కూతురిని బాయ్ ఫ్రెండుతో కలిసి రూంలో చూసిన తండ్రి స్పందించే తీరు.. దాని గురించి హెచ్వోడీని నిలదీస్తే అతను ఇచ్చే సమాధానం ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఎలాంటి సినిమానో నిర్వచిస్తుంది. ఆ సన్నివేశం విషయంలో ప్రేక్షకులు రెండు వర్గాలుగా విడిపోవచ్చు. కొందరికి ఈ సీన్ ఏం తీశాడురా అనిపించొచ్చు. కొందరికి తీవ్రమైన అసహనం కలగొచ్చు. అలాగే హీరో తల్లికి.. కథానాయికకు మధ్య వచ్చే సన్నివేశం కూడా ఈ కోవకు చెందిందే. ఇలాంటి హార్డ్ హిట్టింగ్ సీన్లు నచ్చడం.. నచ్చకపోవడాన్ని బట్టి సినిమా రుచిస్తుందా లేదా అన్నది చెప్పొచ్చు. సినిమా అంతా ఒకే ఫ్లోలో నడకవపోయినా.. ప్రేక్షకులపై బలమైన ప్రభావం చూపించే ఐదారు ఎపిసోడ్లతో దర్శకుడు రాహుల్ తన ముద్రను చూపించాడు.
‘ది గర్ల్ ఫ్రెండ్’ ప్రథమార్ధంలో అంత మంచి ఫ్లోతో సాగదు. ఆరంభ సన్నివేశాలు మామూలుగా అనిపిస్తాయి. కాలేజీ సీన్లు ఏమంత గొప్పగా అనిపించవు. హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ కూడా ఓ మోస్తరుగా అనిపిస్తుందంతే. హీరో వెంట ఉండే బ్యాచ్ ప్రవర్తించే తీరు.. వాళ్ల మాటలు చికాకు పెడతాయి. కొన్ని సీన్ల వరకు చాలా మెచ్యూర్డ్ గా అనిపించే ‘ది గర్ల్ ఫ్రెండ్’లో ఇలాంటి పాత్రలు.. డైలాగులేంటో అర్థం కాదు. కానీ రష్మిక-దీక్షిత్ పాత్రల చిత్రణ.. వాళ్ల మధ్య వచ్చే కీలక సన్నివేశాలు.. డైలాగులు ఎంగేజ్ చేస్తాయి. ఇంటర్వెల్ నుంచి సినిమా టెంపో మారుతుంది. ద్వితీయార్ధంలో కొన్ని బలమైన ఎపిసోడ్లు సినిమా స్థాయిని పెంచుతాయి. దీక్షిత్ నుంచి బ్రేకప్ చేసుకోనున్నట్లు రష్మిక చెప్పే సన్నివేశానికి థియేటర్లు హోరెత్తిపోతాయి. క్లైమాక్స్ ‘ది గర్ల్ ఫ్రెండ్’కు మరో ప్రధాన ఆకర్షణ. ఆ సన్నివేశాన్ని కన్సీవ్ చేసిన తీరు దర్శకుడిగా రాహుల్ ప్రత్యేకతను చాటుతుంది. అందులో రష్మిక పెర్ఫామెన్స్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. డైలాగులు కూడా బాగా పేలాయి. మొత్తంగా చూస్తే ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఒక హార్డ్ హిట్టింగ్ సినిమా అనడంలో సందేహం లేదు. కొందరికి ఈ సినిమా విపరీతంగా నచ్చొచ్చు. కొందరికి అంతే వ్యతిరేక అభిప్రాయం కలిగించొచ్చు. కానీ నచ్చినా.. నచ్చకపోయినా ‘ది గర్ల్ ఫ్రెండ్’ అన్నది విస్మరించలేని సినిమా అన్నది మాత్రం వాస్తవం. నటీనటులు: రష్మిక మందన్నా నటన గురించి ప్రమోషన్లలో టీం చెప్పిన మాటలు.. ఇండస్ట్రీలో జరిగిన చర్చలో అతిశయోక్తి లేదు. తన కెరీర్లో మైలురాయిలా నిలిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చిందామె. అద్దం ముందు నిలబడ్డ సన్నివేశంలో.. అలాగే పతాక ఘట్టంలో రష్మిక మందన్నా నటనను అంత సులువుగా మరిచిపోలేం. నిజంగా తనది అవార్డ్ విన్నింగ్ పెర్ఫామెన్సే. విక్రమ్ పాత్రలో దీక్షిత్ శెట్టి కూడా అదరగొట్టేశాడు. నెగిటివ్ షేడ్స్ ను అతను పలికించిన తీరు మెప్పిస్తుంది. బలమైన ఇంపాక్ట్ చూపించాడతను. ఈ సినిమా తర్వాత తనకు తెలుగులో మరిన్ని అవకాశాలు రావడం ఖాయం. చాన్నాళ్ల తర్వాత తెలుగు తెరపై కనిపించిన అను ఇమ్మాన్యూల్ కు తక్కువ సన్నివేశాలే ఉన్నా.. బాగానే చేసింది. క్యామియో తరహా ప్రొఫెసర్ పాత్రలో రాహుల్ రవీంద్రన్ ఓకే అనిపించాడు. రోహిణి ఒక్క సన్నివేశంలోనే కనిపించినా.. తన ప్రత్యేకతను చాటుకుంది. రావు రమేష్ ఎప్పట్లాగే తన ముద్రను చాటాడు. సాంకేతిక వర్గం: టెక్నికల్ గా ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఉన్నతంగా అనిపిస్తుంది. హేషమ్ అబ్దుల్ సినిమాకు బలం చేకూర్చే పాటలు ఇచ్చాడు. అవి మరీ వినసొంపుగా లేకపోయినా.. సినిమాను డ్రైవ్ చేయడంలో ఉపయోగపడ్డాయి. ప్రశాంత్ విహారి తన నేపథ్య సంగీతంతో సన్నివేశాలను ఎలివేట్ చేశాడు. కృష్ణన్ వసంత్ విజువల్స్ బాగున్నాయి. తన ఛాయాగ్రహణంలో మంచి అభిరుచి కనిపిస్తుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. సినిమాలో మంచి క్వాలిటీ కనిపిస్తుంది. రచయిత-దర్శకుడు రాహుల్ రవీంద్రన్.. మన్మథుడు-2 తర్వాత మళ్లీ తన మార్కు చూపించాడు. రిలేషన్‌షిప్ విషయంలో అతను ఒక సైడ్ తీసుకున్నట్లు అనిపిస్తుంది కానీ.. చెప్పాలనుకున్న కథను మాత్రం బలంగానే చెప్పాడు. కథ కొత్తది కాకపోయినా.. కొంచెం కొత్తగా దాన్ని నరేట్ చేసే ప్రయత్నం చేశాడు. కథలో కీలకమైన సన్నివేశాలను అతను రాసుకున్న తీరు.. తెరకెక్కించిన వైనం ఆకట్టుకుంటుంది. తన డైలాగులు సినిమాలకు మేజర్ హైలైట్.
రేటింగ్- 2.5/5


















