తెలుసు కదా’ మూవీ రివ్యూ నటీనటులు: సిద్ధు జొన్నలగడ్డ- రాశి ఖన్నా- శ్రీనిధి శెట్టి- హర్ష చెముడు- రోహిణి- సంజయ్ స్వరూప్ తదితరులు సంగీతం: తమన్ ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్ నిర్మాతలు: విశ్వప్రసాద్- కృతి ప్రసాద్ రచన- దర్శకత్వం: నీరజ కోన చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. కృష్ణ అండ్ హిజ్ లీల- డీజే టిల్లు- టిల్లు స్క్వేర్ చిత్రాలతో యువతో మాంచి క్రేజ్ సంపాదించుకున్న యువ నటుడు సిద్ధు జొన్నలగడ్డ. మధ్యలో ‘జాక్’తో ఎదురు దెబ్బ తిన్న అతను.. మళ్లీ తన జోన్లోకి వెళ్లి ‘తెలుసు కదా’ సినిమా చేశాడు. స్టైలిస్టుగా బోలెడన్ని సినిమాలకు పని చేసిన నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలి అవతారం ఎత్తింది. సిద్ధు సరసన రాశి ఖన్నా.. శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటించిన ఈ చిత్రం దీపావళి కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి. కథ: వరుణ్ (సిద్ధు జొన్నలగడ్డ) ఒక అనాథ. చిన్నపుడే తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ కష్టపడి ఒక స్థాయిలో నిలబడతాడు. ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని.. పిల్లల్ని కని.. తనకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నది అతడి కోరిక. కానీ వరుణ్ ప్రేమించిన రాగ (శ్రీనిధి శెట్టి) కొంత కాలానికి అతణ్ని అర్థం చేసుకోలేక తనను విడిచి వెళ్లిపోతుంది. ఈ గ్యాప్ తర్వాత వరుణ్.. అంజలి (రాశి ఖన్నా)ను మ్యాట్రిమొనీ ద్వారా కలిసి ఆమెతో తనకు బాగా సింక్ కావడంతో పెళ్లి చేసుకుంటాడు. కానీ అంతలోనే వీళ్లిద్దరి ఒక సమస్య తలెత్తుతుంది. అప్పుడే అంజలి ద్వారానే వరుణ్ జీవితంలోకి మళ్లీ రాగ తిరిగొస్తుంది. ఇంతకీ ఆ సమస్యేంటి.. రాగ పునరాగమనంతో వరుణ్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మిగతా కథ. కథనం- విశ్లేషణ: ఒక పెళ్ళి సంబంధం విషయమై అబ్బాయి-అమ్మాయి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరి అభిరుచులు కలుస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తాయి. అంతా బాగానే సాగుతుంటుంది. ఉన్నట్లుండి అబ్బాయి.. ‘‘నేను కొంచెం అన్ కంఫర్టబుల్ గా ఉన్నాను… వెళ్తా’’ అంటాడు. ఏమైంది అంటే.. ‘‘నీ నవ్వు చూస్తే నేను డిస్టర్బ్ అవుతున్నా. అలాంటపుడు డెసిషన్ తీసుకోవడం కష్టం’’ అంటాడు. అందుకా అమ్మాయి.. ‘‘నువ్వు ఫ్లర్ట్ చేస్తున్నావేమో అనిపిస్తోంది. కానీ కన్ఫ్యూజ్ అవుతున్నా’’ అంటుంది. ‘తెలుసు కదా’లో ఈ సంభాషణతో కూడిన సన్నివేశం చూసినపుడు ఎంత బ్యూటిఫుల్ గా దీన్ని ప్రెజెంట్ చేశారో కదా అనిపిస్తుంది. సినిమాలో ఇలాంటి మంచి సంభాషణలతో కూడిన అందమైన సన్నివేశాలు బోలెడున్నాయి. కానీ సినిమా అంతే అవే ఉండడమే సమస్య. రెండుంబావు గంటల నిడివి ఉన్న ‘తెలుసు కదా’లో పట్టుమని పది పాత్రలు కూడా కనిపించవు. ఓ ముప్పావు వంతు సినిమాలో కనిపించేది కేవలం నాలుగు పాత్రలే. ఇద్దరు లేదా ముగ్గురు ఒక చోట చేరడం.. మాట్లాడుకోవడం.. ఇలాగే సాగుతుంది సినిమా అంతా. ముఖ్య పాత్రలన్నీ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.. డైలాగులు గొప్పగా అనిపిస్తాయి.. సన్నివేశాలు చాలా మెచ్యూర్ గా సాగుతాయి. కానీ కేవలం కాన్వర్జేషన్ల మీదే సినిమాను నడిపించడంతో ఎంత అభిరుచి ఉన్న ప్రేక్షకులకైనా ఏదో ఒక దశలో ‘తెలుసు కదా’ రిపీటిటివ్ గా.. కాస్త భారంగాగే అనిపిస్తుంది. ‘తెలుసు కదా’ కచ్చితంగా ఒక మంచి సినిమా. భిన్నమైన ప్రయత్నం. ఆలోచనతో చూసే ఒక వర్గం ప్రేక్షకులకు ఇది విపరీతంగా నచ్చొచ్చు. కానీ వినోదం ఆశించే వారికి మాత్రం దీంతో ఇబ్బంది తప్పదు.
మోడర్న్ రిలేషన్ షిప్స్ మీద ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ రూపంలో ఒక కల్ట్ మూవీ అందించాడు సిద్ధు జొన్నలగడ్డ. దానికి స్పినాఫ్ లాంటి సినిమా.. తెలుసు కదా. ఇటు సిద్ధు.. అటు దర్శకురాలు నీరజ కోన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ లాంటి సినిమానే చేద్దాం అనుకుని రంగంలోకి దిగారేమో అనిపిస్తుంది ‘తెలుసు కదా’ చూస్తున్నంతసేపు. అందులో మాదిరే ఇక్కడా రిలేషన్షిప్స్ చుట్టూనే చర్చోపచర్చలు సాగుతాయి. కథ ఆసక్తికర మలుపులు తిరుగుతుంది. కానీ దానంత వినోదాత్మకంగా మాత్రం ఇది సాగదు. ఇది కొంచెం డ్రైగా అనిపిస్తుంది. ఇక్కడ ఎడతెగని విధంగా సాగే కాన్వర్జేషన్లు ఒకింత అసహనానికి గురి చేస్తాయి. కానీ మనసు పెట్టి ఆలోచిస్తే మాత్రం ఆ సంభాషణలు చాలా బలంగా తాకుతాయి. పెళ్లి పట్ల సదభిప్రాయం లేని అమ్మాయి.. పెళ్లే లక్ష్యంగా సాగే అబ్బాయి.. భర్తతో ఒక సమస్య తలెత్తగానే విడిపోవడమే పరిష్కారం అనుకునే ఇంకో అమ్మాయి.. ఇలా ప్రస్తుత తరంలో భిన్న ఆలోచనలున్న ముగ్గురు వ్యక్తులకు ప్రతినిధుల్లా ఉంటారు ఇందులోని ప్రధాన పాత్రధారులు. ఒక అబ్బాయికి బ్రేకప్ అయ్యాక కొత్త రిలేషన్షిప్ మొదలవడం.. అంతలో బ్రేకప్ చేసుకున్న అమ్మాయి తిరిగి తన జీవితంలోకి రావడం.. ఈ కోవలో చాలా సినిమాలు చూశాం. ‘తెలుసు కదా’ కూడా ఆ కోవలోని సినిమానే కానీ.. ఇందులో పాత అమ్మాయి తిరిగి అబ్బాయి జీవితంలోకి రావడంలో ఒక ట్విస్ట్ ఉంటుంది. తొలి అమ్మాయితో ప్రేమలో ఉండగా.. ‘‘ఎప్పటికైనా నా బిడ్డకు నిన్ను తల్లిని చేస్తా’’ అంటూ ఒక డైలాగ్ చెబుతాడు అబ్బాయి. ఆ అమ్మాయి నుంచి విడిపోయి మరో అమ్మాయితో వివాహ బంధంలోకి వెళ్లాక కూడా ఈ మాటే నిజం అయ్యే పరిస్థితి వస్తుంది. అదెలా అన్నది తెర మీదే చూడాలి. ‘తెలుసు కదా’ను యునీక్ గా నిలబెట్టే పాయింట్ ఇదే. దాని చుట్టూ నడిపిన డ్రామా సినిమాలో హైలైట్. ప్రథమార్ధంలో ఒకవైపు వర్తమానంలో హీరో లవ్ లైఫ్ ను చూపిస్తూ.. ఇంకోపక్క తన పాత లవ్ స్టోరీని దశల వారీగా నరేట్ చేస్తూ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో సినిమాను ముందుకు నడిపింది నీరజ కోన. ఆసక్తికర మలుపులు తిరిగే సినిమా.. ఇంటర్వెల్ సమయానికి రసపట్టులో పడ్డట్లు అనిపిస్తుంది. కానీ ద్వితీయార్ధంలో కథను ముందుకు నడిపించడంలో తడబాటు కనిపిస్తుంది. పాత్రల ప్రవర్తన అసహజంగా అనిపిస్తూ.. ఫోర్స్డ్ గా అనిపించే సీన్లు ప్రేక్షకులకు విసుగు పుట్టిస్తాయి. హీరో పాత్ర ఓవర్ మెచ్యూర్డ్ గా.. ఓవర్ స్మార్ట్ గా ప్రవర్తిస్తూ.. దాన్ని తట్టుకోవడం కష్టమన్నట్లు సాగుతుంది. తెర మీద మూడే పాత్రలు కనిపిస్తూ.. అవి ఎడతెగని విధంగా మాట్లాడుకోవడం మీదే సన్నివేశాలను నడిపించడంతో చూసిన సీన్లే మళ్లీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. కథ కూడా ముందుకు కదలక ఇబ్బంది పెడుతుంది. కానీ చివరి అరగంటలో ‘తెలుసు కదా’ మళ్లీ పట్టాలెక్కుతుంది. చక్కటి డైలాగులు.. మంచి ఎమోషన్ తో పతాక సన్నివేశాలను నడిపించిన నీరజ కోన మార్కులు కొట్టేసింది. ముఖ్యంగా సిద్ధు జొన్నలగడ్డ అదిరిపోయే పెర్ఫామెన్సుతో క్లైమాక్సును నిలబెట్టాడు. ఈ కథను ఎలా ముగిస్తారో అనే అయోమయానికి తెరదించుతూ కన్విన్సింగ్ క్లైమాక్సుతో దర్శకురాలు మెప్పించింది. ఓవరాల్ గా చెప్పాలంటే.. ‘తెలుసు కదా’ అందరూ మెచ్చే ఎంటర్టైనర్ కాదు. కానీ పరిణతితో కూడిన పాత్రలు.. వాటి మధ్య లోతైన సంభాషణల మీద నడిచే ఈ చిత్రం ఒక వర్గం ప్రేక్షకులకు బాగా నచ్చే అవకాశముంది. కమర్షియల్ సక్సెస్ మీద సందేహాలుండొచ్చు కానీ.. ఇది కంటెంట్ రిచ్ మూవీనే.
నటీనటులు: ‘జాక్’తో మెప్పించలేకపోయిన సిద్ధు జొన్నలగడ్డ మళ్లీ తన జోన్లోకి వచ్చేశాడు. జీవితం పట్ల ఫుల్ క్లారిటీ ఉంటూ.. కొంచెం టిపికల్ గానూ ప్రవర్తించే వరుణ్ పాత్రలో అతను జీవించేశాడు. ఈ పాత్రను అతను ఓన్ చేసుకున్న విధానం మెప్పిస్తుంది. తన మార్కు పెర్ఫామెన్స్.. డైలాగ్ డెలివరీతో అతను ఆకట్టుకున్నాడు. వరుణ్ పాత్ర.. అందులో సిద్ధు నటన కొంతమేర ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ను గుర్తుకు తెస్తాయి. అంజలి పాత్రలో రాశి ఖన్నా ఆకర్షణీయంగా కనిపించింది. తన పెర్ఫామెన్స్ లోనూ ఒక గ్రేస్ కనిపిస్తుంది. రాగ పాత్రలో శ్రీనిధి శెట్టి కూడా మెప్పించింది. తన లుక్స్ అంత గొప్పగా లేకపోయినా.. నటన ఓకే. హీరో స్నేహితుడి పాత్రలో హర్ష చెముడు మెప్పించాడు. అది రెగ్యులర్ ఫ్రెండు పాత్రలాగే అనిపించినా.. హర్ష తన ప్రత్యేకతను చాటుకున్నాడు. సంజయ్ స్వరూప్.. రోహిణి.. మిగతా నటీనటులంతా మామూలే. సాంకేతిక వర్గం: టెక్నికల్ గా తెలుసు కదాలో మంచి క్వాలిటీ కనిపిస్తుంది. తమన్ మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్. మల్లిక గంద.. సొగసు చూడతరమా పాటలు వినసొంపుగా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బావుంది. జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణం ఎంతో కలర్ ఫుల్ గా సాగింది. విజువల్స్ కంటికి ఇంపుగా ఉన్నాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. ఇక రైటర్ కం డైరెక్టర్ నీరజ కోన తన తొలి చిత్రంతో సేఫ్ గేమ్ ఆడకుండా రిస్కీ సబ్జెక్ట్ ఎంచుకుంది. ట్రెండీ కథను పరిణతితో డీల్ చేసింది. డైలాగుల విషయంలో ఆమెకు మంచి మార్కులు పడతాయి. ఫలానా చోట అని కాకుండా సినిమా అంతా అద్భుతమైన సంభాషణలున్నాయి. కానీ కొంచెం డైలాగులు తగ్గించి.. కథలో ఇంకొన్ని మలుపులతో దృశ్యప్రధానంగా సినిమాను తీర్చిదిద్ది ఉండాల్సిందనిపిస్తుంది. సామాన్య ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని దీనికి కొంచెం కమర్షియల్ టచ్ ఇచ్చి ఉంటే బాగుండేది.
రేటింగ్ : 3/5