తెలంగాణ ప్రజల చిరకాల డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ప్రముఖ కట్టడం, ట్రాఫిక్‌కు ఎంతో ఉపశమనం అందించిన ‘తెలుగు తల్లి ఫ్లైఓవర్’ పేరును ఇకపై ‘తెలంగాణ తల్లి ఫ్లైఓవర్’గా మార్చాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రేవంత్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రక ఘట్టంగా నిలిచింది.
రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ఆవిర్భవించిన (2014) అప్పటి నుంచి లోయర్ ట్యాంక్ బండ్–సెక్రటేరియట్ మధ్య ఉన్న ఈ ఫ్లైఓవర్‌కు ‘తెలంగాణ తల్లి’ పేరు పెట్టాలనే డిమాండ్లు బలంగా వినిపించాయి. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని, ప్రత్యేక రాష్ట్ర స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ మార్పు జరగాలని అనేక సంఘాలు, రాజకీయ నాయకులు పదేపదే విజ్ఞప్తి చేశారు.
ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటూ GHMC బోర్డు పేరు మార్పు తీర్మానాన్ని అధికారికంగా ఆమోదించింది. మేయర్ విజయలక్ష్మి ఈ నిర్ణయాన్ని మీడియాతో పంచుకున్నారు. “తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, గర్వభావాలను పెంపొందించేందుకు ఈ చర్య తీసుకున్నాం. ఇది ప్రజల మనసుల్లో ఉన్న భావాలకు ప్రతిబింబం మాత్రమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు, తెలంగాణ స్ఫూర్తికి అనుగుణంగా ఈ చారిత్రక నిర్ణయాన్ని అమలు చేయబోతున్నాం” అని ఆమె పేర్కొన్నారు.
1997లో ప్రారంభించబడిన ఈ ఫ్లైఓవర్, నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా సేవలు అందించింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలో ఉన్న మాజీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పేరు మార్పు డిమాండ్‌పై అనేకసార్లు చర్చించినప్పటికీ, చివరికి తుది నిర్ణయం తీసుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ ఆధ్వర్యంలోని GHMC బోర్డు ఈ విషయంలో వేగంగా అడుగులు వేసి, నిర్ణయాన్ని అధికారికంగా అమలు చేయబోతోంది.
ఈ ఫ్లైఓవర్ పేరు మార్పు కేవలం ఒక పేరు మార్పు మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష, గుర్తింపు , ఆత్మగౌరవానికి చిహ్నంగా నిలవనుంది. ‘తెలుగు తల్లి’ స్థానంలో ‘తెలంగాణ తల్లి’ పేరు రావడం ద్వారా, ఇది నగరంలో తెలంగాణ సంస్కృతి, చరిత్రకు నిలువెత్తు నిదర్శనంగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. పేరు మార్పు ప్రక్రియ త్వరలోనే అధికారికంగా పూర్తి కానుంది.