మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుతో ఎవరినీ నిరాశ్రయులను చేయం.. మెరుగైన వసతులతో పునరావాసం కల్పిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
మూసీ ప్రక్షాళన కోసం చేపట్టనున్న ప్రాజెక్టు నేపథ్యంలో పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల్లో ఎలాంటి ఆందోళన అవసరం లేదని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలెవరినీ నిరాశ్రయులను చేయబోమని, ఎవరికీ నష్టం జరగకుండా మరింత మెరుగైన వసతులతో ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని సీఎం హామీ ఇచ్చారు.
శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై స్పందించిన ముఖ్యమంత్రి, మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు సహాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి ప్రణాళికలను సమగ్రంగా పరిశీలించి, ప్రజలకు ఉపయోగపడేలా సలహాలు, సూచనలు ఇస్తే ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందని తెలిపారు.
హైదరాబాద్ నగర అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల, రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన TelanganaRising2047 దార్శనికతను కూడా సీఎం ఈ సందర్భంగా వివరించారు. దేశంలోని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, చారిత్రాత్మక హైదరాబాద్‌ను మరోసారి పూర్వ వైభవంతో, అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.
నల్గొండ ప్రజల జీవన స్థితిగతులు, వారి ఆవేదనభరిత వాస్తవాలు తెలుసుకునే వారు ఎవరూ కూడా ఈ ప్రాజెక్టును ఆపాలని అనుకోరని సీఎం అన్నారు. మూసీ ప్రక్షాళనపై మరింత విస్తృత చర్చకు సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
రాష్ట్ర అభివృద్ధిలో నగరాల పాత్ర ఎంత కీలకమో వివరించిన సీఎం, ఏ రాష్ట్ర ప్రగతి అయినా ఆ రాష్ట్ర నగరాలు, పెట్టుబడులు, ప్రజల జీవన స్థితిగతులపై ఆధారపడి ఉంటుందని అన్నారు. భారతదేశంలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాల గురించి తరచూ చర్చ జరుగుతుంటే, హైదరాబాద్ పేరు ప్రధానంగా ఫార్మా రంగం, లివబుల్ సిటీ అనే గుర్తింపుతో వినిపిస్తోందన్నారు.
అయితే ప్రస్తుతం దేశంలోని మహానగరాలు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నాయని సీఎం వివరించారు. ముంబైలో వర్షాలు పడితే జీవనం స్తంభించే పరిస్థితి, ఢిల్లీలో తీవ్రమైన కాలుష్యం, బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ, చెన్నైలో భారీ వర్షాల కారణంగా రవాణా ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. అలాంటి అనుభవాలు మనకు ముందస్తు హెచ్చరికలని, హైదరాబాద్‌ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయకపోతే భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఇక్కడ కూడా ఉత్పన్నం కావచ్చని సూచించారు.
ఒకప్పుడు లేక్ అండ్ రాక్ సిటీగా ఖ్యాతి గడించిన చారిత్రాత్మక హైదరాబాద్ ఇప్పుడు కాలుష్యం, ట్రాఫిక్, అనియంత్రిత విస్తరణ వంటి సమస్యలను ఎదుర్కొంటోందన్నారు. ఇవి సహజ సిద్ధమైన భౌగోళిక కారణాల వల్ల కాకుండా, మానవ తప్పిదాల వల్లే ఏర్పడ్డాయని సీఎం అభిప్రాయపడ్డారు. కుతుబ్ షాహీల కాలం నుంచి గుల్జార్ హౌజ్, ఫలక్‌నుమా, తారామతి బారాదరి, ఉస్మానియా హాస్పిటల్, హైకోర్టు, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ వంటి చారిత్రక కట్టడాలతో వెలుగొందిన ఈ నగరాన్ని మళ్లీ గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని అన్నారు.
ఈ దిశగా తెలంగాణను #CURE, #PURE, #RARE అనే మూడు అభివృద్ధి మండలాలుగా విభజించి సమగ్ర కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని సీఎం వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని 1.34 కోట్ల జనాభా ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్‌గా గుర్తించి, కాలుష్య కారక రెడ్, ఆరెంజ్ జోన్ పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలికి తరలించే ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. ఈ ప్రాంతాన్ని సర్వీస్ సెక్టార్ కేంద్రంగా అభివృద్ధి చేయడం లక్ష్యమన్నారు.
ఈ క్రమంలో తీసుకువచ్చిన #HILTP పాలసీ ద్వారా పారిశ్రామిక జోన్‌లలోని భూములను మల్టీయూజ్ జోన్‌లుగా మార్చుతున్నామని, అయితే యాజమాన్య హక్కుల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. అలా మారిన ప్రాంతాలు భవిష్యత్తులో మధ్య తరగతి నివాసాలకు అనువైన ప్రాంతాలుగా మారతాయని వివరించారు.
అంతేకాకుండా, నగర కాలుష్యాన్ని తగ్గించడమే మొదటి ప్రాధాన్యమని చెబుతూ, గోదావరి నుంచి 20 టీఎంసీల నీటిని తరలించి, అందులో 17 టీఎంసీలను జంట నగరాల తాగునీటి అవసరాలకు వినియోగించి, మిగిలిన నీటిని మూసీలో నిరంతర ప్రవాహం కోసం వినియోగిస్తామని సీఎం పేర్కొన్నారు.
రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి కోసం రూపొందించిన రోడ్ మ్యాప్‌లో మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు ఒక కీలక భాగమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలనే దిశగా కాకుండా, మరింత మెరుగ్గా ఎలా అమలు చేయాలనే దిశగా సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. చివరగా, మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఎవరినీ నిరాశ్రయులను చేయమని, వారికి మరింత మెరుగైన వసతులతో పునరావాసం కల్పించి, ఎవరికీ నష్టం జరగకుండా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మరోసారి హామీ ఇచ్చారు.
Telangana







