తెలంగాణలో గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. ఇప్పటికే చాలామంది ముంపు గ్రామాల్లో ఉన్న ప్రజలను ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కురిసిన వర్షానికి రోడ్లు, పంట పొలాలు, ఇల్లు అన్ని మునిగిపోవడమే కాకుండా చాలా భయంకరంగా మారిపోయాయి. తెలంగాణలోని మెదక్, కామారెడ్డి జిల్లాలో 24 గంటల నుండి అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. ఈ వర్షపు నీటి కారణంగా ముంపు ప్రాంతాల్లో ఉన్న ఇల్లు, పొలాలు అన్ని మునిగిపోయాయి. వాగులు, వంకలు అన్ని నీళ్లతో పొంగి పొర్లుతున్నాయి. 24 గంటల నుండి పడుతున్న వర్షంతో ఆ రెండు జిల్లాల్లో ప్రస్తుతం చోటు చేసుకున్న పరిస్థితికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలు చూస్తే మాత్రం చాలా భయానకంగా ఉన్నాయి అని చెప్పవచ్చు.
ఆ రెండు జిల్లాలలో వర్షం ఎంతలా నమోదయ్యిందంటే.. ఒక అంతస్తు ఉన్న ఇల్లు పూర్తిగా మునిగిపోయే వరకు నీళ్లు చేరుకున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ అధికారులు చాలామంది ప్రజలను కాపాడి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అలాగే వరదల్లో చిక్కుకున్న వారిని పోలీసులు, సహాయ బృందాలు రక్షిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో పడ్డ వర్షానికి జిల్లా మొత్తం అస్తవ్యస్తమయ్యింది. ముఖ్యంగా ఎటు చూసినా నీరె నిండి ఉండడంతో జనజీవనం స్తంభించిపోయింది. నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. కామారెడ్డి లో ఉండే గొస్కె రాజయ్య కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీలలో వరద ఉధృతికి రోడ్లు కూడా పూర్తిగా కొట్టుకుపోయాయి. కామారెడ్డి నుండి హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారి కల్వర్టు పూర్తిగా ధ్వంసమైన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఈ భయానక దృశ్యాలను చూసి చాలామంది ప్రజలు ఆందోళన చెందుతున్నారు..
చాలా చోట్ల రహదారులు కోతకు గురవ్వడంతో పాటు అక్కడక్కడ రోడ్లు మధ్యలో తెగిపోయి రవాణా కూడా నిలిచిపోయింది. కామారెడ్డి జిల్లాలో ఉండే పోచారం ప్రాజెక్టుకు కూడా భారీ వరద నీరు వచ్చి చేరింది. అలా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలు కామారెడ్డి, మెదక్ జిల్లాలో ఉన్న తాజా పరిస్థితులను తెలియజేస్తున్నాయి.ఈ దృశ్యాలు చాలా భయానకంగా ఉన్నాయి అని ఈ వీడియో చూసిన నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు భారీగా పడటంతో స్కూళ్లకు, ఆఫీసులకు కూడా సెలవులు ఇచ్చేశారు. ఈరోజు ఉండే పరీక్షలు అన్నీ కూడా వాయిదా వేసేసారు. అలాగే ప్రజలెవరు బయటికి రాకూడదని అత్యవసరం అయితేనే బయటికి రావాలని చెబుతున్నారు.
అల్పపీడన ప్రభావంతో మరో రెండు, మూడు రోజుల వరకు భారీ వర్షాలు పడబోతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ వర్షం వల్ల ప్రభావితమైన ప్రాంతాలు కోలుకోవాలంటే చాలా రోజులే పడుతుంది. ఈ భారీ వర్షాల వల్ల ప్రజలు చాలా నష్టపోయారు.మరి ఈ వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలకు ప్రభుత్వం తరఫున ఏదైనా సహాయం అందుతుందా అనేది చూడాలి.