1.5 లక్షల కోట్ల దోపిడీ కోసమే హైదరాబాద్ ప్రజలను ముంచిండు: కేటీఆర్ సంచలన ఆరోపణలు
రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యంతోనే మూసీకి వరదలు: కేటీఆర్
కొడంగల్‌లో రేవంత్‌కు ‘తొడపాశం’ పెడితే ఢిల్లీ దద్దరిల్లుతుంది
కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన కొడంగల్ కు చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ నేతలు
1,50,000 కోట్ల దోపిడీ కోసమే హైదరాబాద్ ప్రజలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ వరదలో ముంచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ కిరాతక మనస్తత్వంతోనే వేలాది ప్రజల ఇండ్లు, ఆస్తులు మూసీ వరదలో చిక్కుకున్నాయని మండిపడ్డారు. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా మాట్లాడిన కేటీఆర్, హైదరాబాద్ కు వరద ముప్పును తగ్గించేందుకు వందేళ్ల కిందట నిజాం ప్రభుత్వం నిర్మించిన ఉస్మాన్ సాగర్, గండిపేట చెరువులను వాతావరణ శాఖ హెచ్చరికలు రాగానే ఖాళీ చేసి మూసీ వరద నీటిని నిల్వ చేయాల్సి ఉంటుందని గుర్తుచేశారు. కానీ మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరుతో దోపిడీకి పాల్పడేందుకు ఆ ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేయాలన్న దురుద్దేశంతో రేవంత్ రెడ్డి ఆ చెరువులను ఖాళీ చేయించలేదని కేటీఆర్ ఆరోపించారు. అందుకే చరిత్రలో తొలిసారిగా ఇమ్లిబన్ బస్టాండ్‌ను వరద ముంచెత్తిందన్నారు.
అనుముల బ్రదర్స్ అరాచకాలపై ఆగ్రహంగా ఉన్న కొడంగల్ ప్రజలు ఎలాగైనా రేవంత్ ను ఓడించాలని కంకణం కట్టుకుని ఉన్నారని కేటీఆర్ తెలిపారు. కొడంగల్ లో వస్తున్న వ్యతిరేకతను గుర్తించిన రేవంత్ రెడ్డి, రాబోయే ఎన్నికల్లో వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఖాయమన్నారు. రాష్ట్రానికి సిఎం రేవంత్ అయినా కొడంగల్ కు మాత్రం ఆయన సోదరుడు తిరుపతి రెడ్డియే ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. కనీసం కౌన్సిలర్ కూడా కాని తిరుపతి రెడ్డికి కలెక్టర్లు, ఎస్పీలు వంగి దండాలు పెట్టడం సిగ్గుచేటని విమర్శించారు. కేసీఆర్ కట్టించిన భవనాలు, ఫ్లై ఓవర్లు, బ్రిడ్జిలకు రిబ్బన్ కట్ చేయడానికి రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డిలు జేబులో కత్తెరలు పెట్టుకొని తిరుగుతున్నారని అయితే కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొడంగల్ ప్రజలు భిక్షమేస్తే ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి, ఆ కొడంగల్ గురించి అసెంబ్లీలో అడ్డదిడ్డంగా మాట్లాడారని మండిపడ్డారు. అల్లుడి ఫ్యాక్టరీ కోసం భూములు గుంజుకొని రైతుల పొట్టగొడుతుంటే చూస్తూ ఊరుకోబోమని, “కొడంగల్ ఏమైనా రేవంత్ జాగీరా?” అని కేటీఆర్ ప్రశ్నించారు.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మంచి పని కూడా చేయలేదని కేటీఆర్ విమర్శించారు. రాహుల్, రేవంత్, భట్టి సంతకంతో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరెవరికి ఎంతెంత బాకీ ఉన్నదో చెబుతూ తాము ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ను తయారు చేశామన్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రచారం కోసం ఇంటింటికీ వచ్చే కాంగ్రెస్ నేతలకు ఈ కార్డును చూపించి, బాకీ కట్టిన తరువాతే ఓటు అడగాలని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లు వేసేటప్పుడు రైతుబంధు పైసలు పడేవన్న కేటీఆర్, రేవంత్ రెడ్డి మాత్రం ఓట్లు వేసేటప్పుడు మాత్రమే రైతుబంధు పైసలు వేస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్‌కు పేరు వస్తుందనే ఉద్దేశంతో 90% పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ రెడ్డి పక్కన పెట్టారని కేటీఆర్ ఆరోపించారు. అదే సమయంలో కమీషన్ల కోసం 4500 కోట్లతో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మొదలుపెట్టారని విమర్శించారు. అయితే అల్మట్టి ఎత్తు పెంచితే జూరాల ప్రాజెక్టు కు చుక్క నీళ్లు కూడా రావాన్న కేటీఆర్, కేవలం కమిషన్ల కోసమే ఈ పనులను మెగా కృష్ణారెడ్డికి, బాంబులేటి శ్రీనివాస్ రెడ్డికి అప్పజెప్పారని ఆరోపించారు. అయితే రేవంత్ రెడ్డి దోపిడీ కోర్టుకు అర్థమయి, ఆ పనులకు స్టే ఇచ్చిందన్నారు.
కాంగ్రెస్, రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి మూడేళ్లు ఎదురుచూడాల్సిన అవసరం లేదన్న కేటీఆర్, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను బంపర్ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కొడంగల్‌లో స్విచ్ బంద్ చేస్తే ఢిల్లీలో లైట్లు బంద్ అవుతాయి. కొడంగల్‌లో రేవంత్ రెడ్డికి తొడపాశం పెడితే ఢిల్లీ దద్దరిల్లుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని గెలిపిస్తే ప్రమోషన్ ఇస్తామని, కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసే జైత్రయాత్ర కొడంగల్ నుంచే మొదలుపెట్టాలని పిలుపునిచ్చారు.