కవిత ఆరోపణలపై స్పందించిన హరీష్‌రావు
నా జీవితం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం
కొందరు నాయకులు, పార్టీలు చేసిన ఆరోపణలే కవిత చేశారు
కవిత వ్యాఖ్యలు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా-హరీష్
తెలంగాణ రాష్ట్ర సాధనలో నా నిబద్ధత అందరికీ తెలుసు
తెలంగాణ ద్రోహుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుంటాం
కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తాం-హరీష్
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ఆరోపణలపై తొలిసారిగా స్పందించారు. విదేశీ పర్యటన ముగించుకుని హరీష్ రావు ఈరోజు తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడ మీడియా నుంచి ఎదురైన ప్రశ్నలపై స్పందించారు. తన 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెరిచిన పుస్తకమని, అందులో దాపరికాలు ఏం లేవని పేర్కొన్నారు. ఇటీవల కొందరు తనపై, పార్టీపైనా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఆ ఆరోపణలనే వారు (కవిత) కూడా చేశారని అన్నారు. వారు ఎందుకు చేశారో, ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు చేశారనేది… వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు.
కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్దిలో తాను చూపిన నిబద్ధత, పాత్ర అందరికి తెలిసిందేనని హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యూరియా లేక రైతులు గోస పడుతున్నారని, వరద ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు. తెలంగాణలో పదేళ్ల పాటు కేసీఆర్ నిర్మించిన వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు, తెలంగాణ ద్రోహుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడంపై తమ దృష్టి ఉంటుందని చెప్పారు. తాము రాష్ట్ర సాధనలో పోరాటం చేసినవాళ్లమని, రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో బాధ్యత కలిగినవాళ్లమని… తమ సమయం అంతా అందుకోసమే వెచ్చిస్తామని తెలిపపారు. తప్పకుండా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్‌ను అధికారంలోకి తీసుకొస్తామని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలను తొలగించడంలో ముందుకు సాగుతామని తెలిపారు.
ఇక, బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సంతోష్ రావులపై కవిత ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. హరీష్ రావు ఇంట్లో, సంతోష్ కుమార్ ఇంట్లో బంగారం ఉంటే… బంగారు తెలంగాణ అయిపోతుందా? అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, తనది రక్త సంబంధం అని… పదవులు పోతేనో, పార్టీలో నుంచి సస్పెండ్ చేస్తేనో పోయే బంధం కాదని అన్నారు. అయితే పార్టీలో ఉండి డబ్బు సంపాదించుకోవాలని, వ్యక్తిగత లబ్ది పొందాలని చూస్తున్నవారు… తమ కుటుంబం బాగుండకూడదని, తాము ముగ్గురం కలిసి ఉండొద్దని, తమ కుటుంబం విచ్ఛిన్నం కావాలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అందులో మొదటి స్టెప్‌గా పార్టీలో నుంచి తనను బయటకు పంపించారని చెప్పుకొచ్చారు. ఇది ఇక్కడితో ఆగిపోదని… కేసీఆర్ ఆయన చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోవాలని అభ్యర్థిస్తున్నానని పేర్కొన్నారు. రేపటి రోజున ఇదే ప్రమాదం రామన్న (కేటీఆర్)కు, తన తండ్రి కేసీఆర్‌కు పొంచి ఉందని చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ పార్టీని వారు హస్తగతం చేసుకునేందుకు చూస్తున్నారని హరీష్ రావు, సంతోష్ కుమార్ టార్గెట్‌గా తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావులు కలిసి ఒకే ఫ్లైట్‌లో ప్రయాణం చేసిన సమయంలో… రేవంత్ రెడ్డి కాళ్లు పట్టుకుని హరీష్ రావు సరెండర్ అయిన తర్వాత తనపై కుట్రలు ప్రారంభమయ్యాయని ఆరోపించారు. అప్పటినుంచే తమ కుటుంబాన్ని విడిగొట్టాలనే ప్రయత్నాలు మొదలయ్యాయని అన్నారు. రేవంత్ రెడ్డి, హరీష్ రావులు ఒకే ఫ్లైట్‌లో ప్రయాణించారా? లేదా? అనేది వారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్‌తో బాగున్నట్టుగా హరీష్ రావు, సంతోష్ రావులు నటించవచ్చని… వాళ్లు తమ కుటుంబ మంచి కోరుకునే వాళ్లు కాదని, తెలంగాణ మంచి కోరుకునే వాళ్లు కాదని, కేసీఆర్ మంచి కోరుకునే వాళ్లు కాదని ఆరోపించారు.
కేసీఆర్ పార్టీ పెట్టిన తొలి రోజు నుంచి ఆయన వెంట హరీష్ రావు… 10 నెలల తర్వాత పార్టీలో చేరారని కవిత అన్నారు. హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదని, బబుల్ షూటరని తీవ్రంగా విమర్శించారు. ట్రబుల్ ఆయనే క్రియేట్ చేసి, దానిని పరిష్కరించినట్టుగా నటిస్తారని ఆరోపించారు. గతంలో ఎన్నికల్లో తనను, కేటీఆర్‌ను ఓడించేందుకు హరీష్ రావు ప్రయత్నించారని సంచలన ఆరోపణలు చేశారు.