తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు సర్వం సిద్ధమవుతున్న కీలక తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నుంచి బిగ్ రిలీఫ్ లభించింది. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది . స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ అక్టోబర్ 9న వెలువడనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తాజా తీర్పు రేవంత్ ప్రభుత్వానికి తాత్కాలికంగా సుప్రీం రిలీఫ్ గా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
తెలంగాణ ప్రభుత్వం రాబోయే పంచాయతీలు, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. బీసీల జనాభా, వారి సామాజిక-ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ పెంపును చేపట్టారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక రాజకీయ వ్యూహం, సామాజిక న్యాయం లక్ష్యాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రభుత్వ రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మొదట మాధవరెడ్డి అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణను అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. అయితే, హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే గోపాల్ రెడ్డి అనే మరో వ్యక్తి ఇదే అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఈ వ్యవహారంలో కీలక మలుపు.
పిటిషనర్ గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. “తెలంగాణ హైకోర్టులో ఇప్పటికే కేసు పెండింగ్‌లో ఉన్నప్పుడు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు?” అని పిటిషనర్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. దీనికి సమాధానంగా పిటిషనర్, “హైకోర్టు స్టే ఇవ్వకపోవడంతోనే మేము అత్యవసరంగా ఇక్కడికి వచ్చాం” అని వివరణ ఇచ్చారు.
అయితే, సుప్రీంకోర్టు ఈ వివరణను ఏమాత్రం అంగీకరించలేదు. “హైకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు, ఈ దశలో అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు” అని స్పష్టం చేస్తూ, గోపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను తక్షణమే డిస్మిస్ చేసింది.
సుప్రీంకోర్టు తీర్పుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఊపిరి పీల్చుకున్నాయి. అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఈ తీర్పు రాజకీయంగా వారికి అనుకూలంగా మారింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకపోవడం వల్ల, హైకోర్టు విచారణ పూర్తయ్యే వరకు ప్రభుత్వం తీసుకున్న 42 శాతం రిజర్వేషన్ల నిర్ణయం అమల్లో కొనసాగుతుంది.
మరోవైపు, ఈ కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పు ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. అక్టోబర్ 8న హైకోర్టు ఈ అంశంపై తుది విచారణ జరపనుంది. హైకోర్టు రిజర్వేషన్ల ఆదేశాలను నిలిపివేస్తే, ప్రభుత్వ నిర్ణయంపై తాత్కాలికంగా బ్రేక్ పడి, ఎన్నికల ప్రక్రియలో మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఒకవేళ హైకోర్టు కూడా పిటిషన్‌ను కొట్టివేస్తే లేదా స్టే ఇవ్వడానికి నిరాకరిస్తే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం ఖాయం.
మొత్తానికి, సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో స్థానిక సంస్థల ఎన్నికల ముందు రేవంత్ ప్రభుత్వానికి ‘సుప్రీం రిలీఫ్’ లభించినట్లయింది. అందరి దృష్టి ఇప్పుడు రేపటి (అక్టోబర్ 8) హైకోర్టు విచారణపైనే ఉంది.