వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలోని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.సోమవారం తెల్లవారుజామునే తిరుమలకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, అత్యంత పవిత్రమైన వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వారం ద్వారా శ్రీవారి దర్శనం లభించడం తనకు ఎంతో ఆనందం కలిగించిందని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు.
సీఎం రాక సందర్భంగా టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు ఘన స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో సీఎంకు స్వాగతం తెలిపి దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించారు.దర్శనానంతరం ఆలయ పండితులు సీఎం రేవంత్ రెడ్డికి వేదాశీర్వచనం చేసి, శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం సీఎం కుటుంబ సమేతంగా స్వామివారి సన్నిధిలో కొంత సమయం గడిపి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు.వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో వీఐపీలతో పాటు లక్షలాది మంది భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో టీటీడీ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.
ఓం నమో నారాయణాయ! 🙏
Tirumala











