జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితం సానుకూలంగా ఉండటం రేవంత్ సర్కారుకు నైతిక మద్దతు లభించినట్లుగా కనిపిస్తోంది. తాజాగా నిర్వహించిన మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాల్ని తీసుకున్నారు. అందులో ముఖ్యమైనది స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం కావటమే కాదు.. ఎప్పుడు జరుగుతాయన్న అంశానికి సంబంధించిన సిగ్నల్ వచ్చేసింది. అంతేకాదు.. స్థానిక సంస్థల ఎన్నికల పూర్తికి డెడ్ లైన్ కూడా చెప్పేసిన రేవంత్ సర్కారు.. అందుకు సముచిత కారణాన్ని చెప్పే ప్రయత్నం ద్వారా జూబ్లీహిల్స్ విజయంతో తామీ నిర్ణయాన్ని తీసుకోలేదని చెప్పే ప్రయత్నం చేయటం ఆసక్తికరంగా మారింది.
సోమవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేత్రత్వంలో నిర్వహించిన మంత్రిమండలి సమావేశంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించటానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని చెప్పటమే కాదు.. వచ్చే ఏడాది మార్చి 31 లోపు పూర్తి చేస్తామని స్పష్టం చేయటం గమనార్హం ఎందుకిలా? అన్న ప్రశ్నకు మంత్రిమండలి సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి పొంగులేటి చెప్పుకొచ్చారు.
‘‘డిసెంబరు 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాల్ని నిర్వహించనున్నాం. బీసీలకు 42 శాతం కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించాం. పార్టీ పరంగానూ 42 శాతం రిజర్వేషన్లు ఇస్తాం. తొలుత గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించాం. 15వ ఆర్థిక సంఘం కాలపరిమితి వచ్చే ఏడాది మార్చి 31తో ముగియనుంది. అప్పటిలోపు ఎన్నికలు పూర్తి కాకపోతే.. గ్రామాలకు రావాల్సిన రూ.3 వేల కోట్లు నిధులు కోల్పోతాం’’ అని చెప్పటం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఎందుకు సుముఖంగా ఉందన్న విషయానికి సరైన రీతిలో జస్టిఫికేషన్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.
కీలకమైన స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణ మాత్రమే కాదు.. ఇటీవల ప్రాణాలు కోల్పోయిన ప్రముఖ కవి అందెశ్రీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలన్న నిర్ణయాన్ని తీసుకుంది. అందులో భాగంగా అందెశ్రీ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వటమే కాదు.. అందెశ్రీ స్మ్రతివనం ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. అంతేకాదు.. పాఠ్య పుస్తకాల్లో అందెశ్రీ రాసిని తెలంగాణ గీతాన్ని పెట్టనున్న విషయాన్ని వెల్లడించారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో డిసెంబరు 8-9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నిర్వహించేందుకు మంత్రివర్గం ఆమోదాన్ని తెలిపింది. అంతేకాదు..ఔటర్ రింగు రోడ్డు లోపలున్న ఇండస్ట్రియల్ ల్యాండ్ ను మల్టీ యూజ్ జోన్స్ గా రూపొందించిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ ఫర్మేషన్ పాలసీకి మంత్రివర్గం ఓకే చెప్పింది. ఊహించని రీతిలో సౌదీ అరేబియాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించిన కేబినెట్.. మంత్రి అజారుద్దీన్.. మజ్లిస్ ఎమ్మెల్యే.. మైనార్టీ విభాగానికి చెందిన ఒక అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిది టీంను వెంటనే సౌదీకి పంపాలని సూచన చేసింది. అంతేకాదు.. మరణించిన వారిని వారి మత సంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించినట్లుగా మంత్రి పొంగులేటి వెల్లడించారు.


















